Politics

రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్ష నేతలకు మమతాబెనర్జీ లేఖలు

రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్ష నేతలకు మమతాబెనర్జీ లేఖలు

మరికొద్ది రోజుల్లో రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారు.విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం వ్యూహాలు రచించేందుకు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి హాజరుకావాలంటూ ప్రతిపక్ష నేతలకు లేఖలు రాశారు.దిల్లీలోని కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌లో జూన్ 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఈ సంయుక్త సమావేశం జరగనున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 22 మంది విపక్ష పార్టీల నేతలకు, ముఖ్యమంత్రులకు దీదీ లేఖలు రాశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు, తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాల సీఎంలు, ఇతర విపక్ష నేతలను ఆమె ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు టీఎంసీ తెలిపింది.అటు కాంగ్రెస్‌ కూడా రాష్ట్రపతి ఎన్నికపై వ్యూహాలు రచిస్తోంది.

ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ప్రతిపక్ష నేతలలో మంతనాలు మొదలుపెట్టారు. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఆమె మాట్లాడినట్లు తెలిసింది. విపక్ష పార్టీలతో చర్చలు జరిపి, రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం తీసుకువచ్చేలా హస్తం పార్టీ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది. 21న ఓట్ల లెక్కింపు చేపట్టనన్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం వచ్చేనెల 24వ తేదీతో ముగియనుంది. రాష్ట్రపతి రేసులో పలువురు శరద్‌ పవార్‌, నీతీశ్‌ కుమార్‌, ద్రౌపది ముర్ము, ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, తమిళిసై సౌందరరాజన్‌, జగదీశ్‌ ముఖి వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో అధికార భాజపా ఎవరిని నిలబెడుతుందో.. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ఎంపికచేస్తాయో చూడాలి..!