Devotional

ఇంద్రకీలాద్రిపై ఇక ఈ-విరాళాలు

ఇంద్రకీలాద్రిపై ఇక ఈ-విరాళాలు

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి ఓ దాత రూ.10,116 విరాళంగా అందజేశారు. ఆలయంలోని ఆర్జిత సేవా కౌంటరులో విధులు నిర్వహిస్తున్న రికార్డు అసిస్టెంట్‌ ఆ విరాళం వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేయకుండా మాన్యువల్‌గా పుస్తకంలో రాసి రశీదు ఇచ్చాడు. కానీ, రశీదు పుస్తకంలో కార్బన్‌ పేపర్‌ పెట్టి రాసే కింద పేపరుపై మాత్రం కేవలం రూ.116 మాత్రమే నమోదయ్యేలా మాయ చేశాడు. మిగతా రూ.10 వేలను తన జేబులో వేసుకున్నాడు. అయితే, రూ.5,116, ఆపై విరాళం ఇచ్చే దాతలకు బాండ్‌ ఇస్తారని తెలుసుకున్న దాత మళ్లీ ఆలయానికి వచ్చి బాండ్‌ ఇప్పించాలని ఈవోను కోరారు. ఆమె విరాళాల పుస్తకం తెప్పించుకుని పరిశీలించగా, అందులో సదరు దాత కేవలం రూ.116 ఇచ్చినట్టు నమోదై ఉంది. విచారణ చేయగా, రికార్డు అసిస్టెంట్‌ ఘనకార్యం బయటపడింది. అతడిని వెంటనే సస్పెండ్‌ చేశారు. గత ఏడాది జూలై ఒకటో తేదీన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇకపై ఇలాంటి ఘటనలకు చెల్లు.

*కోట్లాది మంది భక్తులు కొలిచే కనకదుర్గమ్మ దేవస్థానంలోనూ ఇక డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమ్మవారికి విరాళాలు ఇచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండటంతో పాటు భక్తితో వారు అందజేసే సొమ్ము అక్రమార్కుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఈ-విరాళాల సేకరణకు ఈవో భ్రమరాంబ శ్రీకారం చుట్టారు. ఈ విధానం వారంలో అందుబాటులోకి వస్తుంది. అమ్మవారికి విరాళాలు చెల్లించాలనుకునే భక్తులు ఇకపై తమ సెల్‌ఫోన్ల ద్వారానే అందజేయొచ్చు. ఈ విధానం పూర్తి పారదర్శకంగా ఉండటంతో పాటు భక్తులు సమర్పించే ప్రతి పైసా నేరుగా అమ్మవారి ఖాతాలోకే చేరుతుంది.

*ఈవో చొరవతో..
మాన్యువల్‌గా రశీదులు ఇచ్చే క్రమంలోనే అక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి సన్నిధిలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఈవో నిర్ణయించారు. నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను కనకదుర్గమ్మ పేరుతో ఉన్న ఖాతాలకు అనుసంధానం చేయించి దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయం పేరుతో క్యూఆర్‌ కోడ్‌లను అందుబాటులోకి తేనున్నారు. అన్నదానం ట్రస్టు, గో సంరక్షణ ట్రస్టు, కృష్ణమ్మ హారతుల ట్రస్టు, వేద పరిరక్షణ ట్రస్టు, అమ్మవారి ఆలయ అభివృద్ధి నిధి పేర్లతో పాటు అమ్మవారి దర్శన టికెట్ల విక్రయ కౌంటర్లలో కూడా ఈ క్యూఆర్‌ కోడ్‌లను అందుబాటులో ఉంచుతారు. ఈ విధానానికి భక్తులు అలవాటు పడితే చాలావరకు విరాళాలు నేరుగా అమ్మవారి ఖాతాలోకే చేరిపోతాయి.

*విదేశాల నుంచీ..
ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడిన భక్తులు కూడా ఈ క్యూర్‌ కోడ్‌లను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా తదితర సామాజిక మాధ్యమాల ద్వారా తీసుకుని నేరుగా అమ్మవారి ఖాతాకు విరాళాలను పంపించవచ్చు. ఇందుకోసం గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం తదితర డిజిటల్‌ వేదికల ద్వారా, యూపీఐ వంటి మొబైల్‌ యాప్‌లను వినియోగించవచ్చు.

*రశీదులకు చెల్లు
భక్తులు ఆలయానికి వచ్చి, ఈవోలు, ఆలయ అధికారులకు ఇచ్చే విరాళాలకు రశీదులు ఇచ్చి, ఆ మొత్తాలను ఆలయ రికార్డుల్లో నమోదు చేసి, ఆదాయాన్ని లెక్కగట్టుకుంటున్నారు. ఇప్పుడు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా భక్తులు నేరుగా అమ్మవారి ఖాతాకు పంపించే విరాళాలకు రశీదులుండవు. విరాళం అమ్మవారి బ్యాంకు ఖాతాలో జమ కాగానే, ఈవో సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. వాటి ఆధారంగా నెలవారీగా అమ్మవారి బ్యాంకు ఖాతా మినీ స్టేట్‌మెంట్‌ తీసుకుని ఈ-విరాళాల వివరాలను ఆలయ రికార్డుల్లో నమోదు చేస్తారు.