NRI-NRT

అమెరికా వెళ్లే విదేశీ ప్రయాణికులకు తీపి కబురు.. ఆ నిబంధన ఎత్తివేత

అమెరికా వెళ్లే విదేశీ ప్రయాణికులకు తీపి కబురు.. ఆ నిబంధన ఎత్తివేత

అమెరికా వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు భారీ ఉపశమనం కల్పిస్తూ అమెరికా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణికులు ప్రయాణానికి ఒకరోజు ముందు తప్పనిసరిగా కరోనా టెస్టు చేయించుకోవాలన్న నిబంధనను ఎత్తివేసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ ఆదివారం మధ్యాహ్నం 12:01 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) నుండి ఈ నిబంధన అమలులోకి వస్తుందని తెలియజేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నాలుగు పేజీల ఆర్డర్‌ను జారీ చేశారు. సమ్మర్ సీజన్ ప్రారంభం కావడం, ఇప్పటికే కరోనా కారణంగా విమానయాన సంస్థలు భారీ నష్టాలు చవిచూడడంతో ఇలాంటి ఆంక్షలు మరోసారి అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో అగ్రరాజ్యం తాజాగా ప్రయాణానికి ఒకరోజు ముందు తప్పనిసరిగా కరోనా టెస్టు చేయించుకోవాలన్న నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుందని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతానికి ఈ నిబంధనను తొలగించినా.. 90 రోజులకు ఒకసారి ఈ విషయంలో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని సీడీసీ వెల్లడించింది.

ఇక CDC నిర్ణయం అనేది సైన్స్, అందుబాటులో ఉన్న డేటాపై ఆధారపడి ఉంటుందని US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ జేవియర్ బెకెర్రా పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. గతేడాది డిసెంబర్ నుంచి అమెరికా సర్కార్ విదేశీ ప్రయాణికులకు జర్నీకి ఒకరోజు ముందు కోవిడ్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి అనే నిబంధనను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. యూరప్, ఇతర ప్రాంతాలలోని చాలా దేశాలు ఇప్పటికే ప్రయాణానికి ముందు కరోనా టెస్టు చేయించుకోవాలనే షరతును తొలగించాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం కూడా తాజాగా ఈ నిబంధనను సడలించింది. కాగా, జో బైడెన్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంపట్ల విమానయాన సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. డెల్టా ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్ బాస్టియన్, జెట్‌బ్లూ ఎయిర్‌వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబిన్ హేస్ మాట్లాడుతూ ఈ నిర్ణయం తమకు ఎంతోగాను లబ్ధి చేకూరుస్తుందని తెలిపారు. ఇన్నాళ్లు ఈ నిబంధన కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు.