DailyDose

అమెరికాలో మరో భారతీయుని అరెస్టు – TNI నేర వార్తలు

అమెరికాలో మరో భారతీయుని అరెస్టు – TNI  నేర వార్తలు

* అమెరికాలో సీనియర్‌ సిటిజన్ల ఖాతాలను దోచేసిన కేసులో తాజాగా మరో భారతీయుడు అరెస్టయ్యాడు. వర్జీనియాకు చెందిన అనిరుధ్‌ కల్‌కోటెను (24) శుక్రవారం హూస్టన్‌లో కోర్టులో హాజరుపరిచారు. సీనియర్‌ సిటిజన్ల నుంచి డబ్బులు దోచేందుకు వారికి కొందరు బెదిరింపు మెయిల్స్‌ పంపడం, ఇవ్వకుంటే దాడులకు దిగుతామని హెచ్చరించడం వంటివి చేశారు. హూస్టన్‌లో చట్టవిరుద్ధంగా ఉంటున్న కొందరు భారతీయులు ముఠాగా ఏర్పడి వెస్ట్రన్‌ యూనియన్, మనీగ్రాం వంటి ట్రాన్స్‌మిటర్‌ బిజినెస్‌ల లింకులు పంపి వృద్ధుల ఖాతాల్లోని సొమ్ము కాజేశారు. మహమ్మద్‌ ఆజాద్‌ (25) అనే వ్యక్తితో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడన్నది అనిరుధ్‌పై అభియోగం. ఆజాద్‌ను 2020లోనే అరెస్టు చేశారు. నేరాలు రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష, 20 వేల డాలర్ల జరిమానా పడొచ్చు.

*నరసరావుపేట మండలం, పమిడిమర్రులో దొంగలు హల్ చల్ చేశారు. రామాలయం గుడిలో చోరీకి యత్నించారు. ఇది గమనించిన గ్రామస్తులు దొంగలను వెంబడించి ఇద్దరిని పట్టుకుని గుడిలో బంధించారు. మరో నలుగురు దొంగలు పరారయ్యారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకుని దొంగలను అదుపులోకి తీసుకున్నారు. కాగా పమిడిమర్రులో పదిహేను రోజుల వ్యవధిలో ఇది రెండో దొంగతనం.

*జనగామ జిల్లా కేంద్రంలో విలేకరిగా పనిచేస్తున్న అబ్దుల్‌ ఖాదర్‌ పాషా (శనివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పెంబర్తిలోని అరబిందో కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షా కేంద్రానికి వెళుతుండగా పెంబర్తి వద్ద జనగామ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న మినీ డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో పాషా తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌ ద్వారా జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. పాషా ఆంధ్రజ్యోతికి జనగామ టౌన్‌ విలేకరిగా పనిచేస్తున్నారు. అవివాహితుడైన పాషాకు వృద్ధురాలైన తల్లి ఇద్దరు అక్కలు ఒక చెల్లె ఉన్నారు. సోదరి హస్రా సుల్తానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

*మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్‌లో పబ్జీ గేమ్‌కు అలవాటుపడి మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు (16) తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో వాళ్లతో కలిసి పబ్జి గేమ్ ఆడాడు. అయితే గేమ్‌లో ఓడిపోవడంతో ఇంట్లో వాళ్లు ప్రభును కాస్తా ఆటపట్టిస్తూ హేళన చేశారు.దీంతో అవమానం తట్టుకోలేక వేరే గదిలో పడుకుంటానని చెప్పి ప్రభు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం ఎంత సేపటికి బయటకి రాకపోవడంతో నిద్ర లేపేందుకు తండ్రి తలుపులు తీయడంతో గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కొడుకు ఉరికి వేలాడుతూ కనిపించడంతో అది చూసిన తండ్రి సొమ్మసిల్లి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

*జనావాసాల్లోకి వచ్చే ఏనుగులు ఒక్కోసారి స్థానిక ప్రజలపై దాడులు చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. ఇలా ఒడిశాలో ఓ ఏనుగు వింత ప్రవర్తనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఓ 70 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆమె అంత్యక్రియల సమయంలోనూ ఆ ఏనుగు మరోసారి దాడి చేయడం కలకలం సృష్టించింది. ఇలా వృద్ధురాలిని చంపిన ఘటనలో ఏనుగు వింత ప్రవర్తన అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

*విశాఖలో గుట్టుగా సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో డ్రగ్స్ వినియోగం, సరఫరా, కొనుగోళ్లుపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులకు.. గాజువాక పరిసరాల్లో సింథటిక్ డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు గిరీష్, తేజ నాయుడు అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లిసర్జిక్ యాసిడ్ డైథలామిడ్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

*నూజివీడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా..మందికి తీవ్ర గాయాలయ్యాయి. పది మంది కూలీలు మామిడి కోతలకు వెళ్ళి ఆటోలో తిరిగి ఇంటికి బయల్దేరారు. మిట్టగూడెం వద్ద డ్రైవర్ ఆటోను కాసేపు రోడ్డు పక్కన ఆపాడు. ఇంతలో వేగంగా దూసుకువచ్చి లారీ ఆటోను ఢీకొట్టింది. ఒక్కసారిగా కూలీలంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. గాయపడ్డ వారిలో ఎక్కువ శాతం మహిళలు. క్షతగాత్రులను వెంటనే స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నూజివీడు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

*సరైన ఉపాధి అవకాశాలు లభించడంలేదన్న కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. కూకట్‌పల్లిలో శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం…. శ్రీకాకుళం జిల్లా భోగబండ ప్రాంతానికి చెందిన జంకుడు ప్రసాద్‌( తల్లిదండ్రులతో కలిసి మూసాపేట జనతానగర్‌లో నివాసముంటున్నాడు. ప్రసాద్‌ కొంతకాలంగా సరైన వ్యాపారం మంచి ఉపాధి అవకాశం దొరకకపోవడంతో తరచూ బాధపడుతుండేవాడు. కాగా తల్లిదండ్రులు రోజుల కితం సొంతూరు వెళ్లగా…. ప్రసాద్‌ ఒక్కడే ఉంటున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో సీలింగ్‌ ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. బంధువులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

*అడిగితే కోరిక తీర్చలేదని, పైగా విషయాన్ని గ్రామస్థులకు చెప్పిందన్న కోపంతో ఓ మహిళపై హత్యాయత్నం చేశాడో వ్యక్తి. మహిళపై బ్లేడుతో దాడి చేశాడు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముకుంధాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. మకుందాపురం గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. అదే గ్రామానికి చెందిన సంఘం ఉదయగిరి అనే వ్యక్తి గత రెండు నెలలుగా కోరిక తీర్చాలంటూ ఆ మహిళను వేదిస్తున్నాడు. విసుగు చెందిన మహిళ ఈ విషయాన్ని గ్రామంలోని ఇద్దరికి చెప్పింది. వారు ఉదయగిరిని పిలిపించి తీవ్ర ంగా మందలించారు. దీన్ని అవమానంగా భావించిన ఉదయగిరి శనివారం కూలీ పనులకు వెళుతున్న మహిళను అడ్డగించి దుర్భాషలాడాడు. అనంతరం బ్లేడుతో పీక కోయబోగా తప్పంచుకొవటంతో ఆమె ముఖం, చేతిపై తీవ్రగాయాలయ్యాయి. మహిళ గట్టిగా అరవటంతో అటుగా వెళుతున్న కొందరు అడ్డుకోగా వారిలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధిత మహిళ, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

* అనారోగ్యానికి గురైన తల్లి సర్కారు దవాఖానాకు పోతే తోడుగా వెళ్లిన 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. నిందితుడు యూపీకి చెందిన 21 ఏళ్ల యువకుడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ కూతురును వెంటబెట్టుకొని శుక్రవారం ఉదయం జిల్లా ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరింది. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా జిల్లా ఈ ఆస్పత్రిలో ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో యూపీకి చెందిన ధీరజ్‌ ఇక్కడ పెయింటింగ్‌ పనులు చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 11:30 గంటలకు బాలికకు అతడు మాయమాటలు చెప్పి ఆస్పత్రి భవనంపై ఉన్న ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని పసిగట్టిన సెక్యూరిటీ గార్డులు రాజశేఖర్‌, మల్లేశ్‌, ఆస్పత్రి సిబ్బంది, రోగుల బంధువులు కలిసి నిందితుడిని పట్టుకొని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు

*శ్రుతి హసన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సహా ఎంతో మంది సినీతారలకు అందమైన దుస్తులను రూపొందించిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ గరిమెళ్ల ప్రత్యూష(36). ఆత్మహత్యకు పాల్పడ్డారు. బొగ్గుల కుంపటిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ ద్రావణం పోసి.. దాన్నుంచి వచ్చిన విషవాయువును పీల్చి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తీవ్ర ఒత్తిడితోనే ఆమె బలవన్మరణానికి పాల్పడివుంటారని అనుమానిస్తున్నారు. ప్రత్యూష స్వస్థలం ఏపీలోని విజయవాడ. ఆమె వద్ద దుస్తులు డిజైనింగ్‌ చేసుకున్న ప్రముఖుల్లో సినీతారలు పరిణితి చోప్రా, మాధురి దీక్షిత్‌, కాజోల్‌ దేవగన్‌, విద్యాబాలన్‌, రవీనాటాండన్‌, నేహా దూపియా, జుహీ చావ్లా, కృతి కర్బందా, క్రీడాకారిణి సానియా మీర్జా వంటి ఎంతో మంది ఉన్నారు. ఈ ఏడాదే హైదరాబాద్‌ వచ్చిన ప్రత్యూష బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12లో బొటిక్‌ ఏర్పాటు చేసుకున్నారు.

*జనగామ జిల్లా కేంద్రంలో విలేకరిగా పనిచేస్తున్న అబ్దుల్‌ ఖాదర్‌ పాషా (48) శనివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పెంబర్తిలోని అరబిందో కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షా కేంద్రానికి వెళుతుండగా పెంబర్తి వద్ద జనగామ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న మినీ డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో పాషా తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌ ద్వారా జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. పాషా ఆంధ్రజ్యోతికి జనగామ టౌన్‌ విలేకరిగా పనిచేస్తున్నారు. అవివాహితుడైన పాషాకు వృద్ధురాలైన తల్లి, ఇద్దరు అక్కలు, ఒక చెల్లె ఉన్నారు. సోదరి హస్రా సుల్తానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

* వారంతా ఉజ్వల భవిష్యత్తున్న విద్యార్థులు. ఎక్కడెక్కడో చదువుతూ వేసవి సెలలకు గ్రామానికి వచ్చారు. సాయంత్రం సరదాగా ఈతకు వెళ్లారు. నీళ్లలోకి దిగి కేరింతలు కొడుతూ.. ఆడుకుంటున్నారు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. అలా ఆడుకుంటూ లోతైన గుంతలోకి వెళ్లిన నలుగురు బాలురు చూస్తుండగానే నీట మునిగి మృత్యువాత పడ్డారు. చివర్లో చెరువులోకి దిగిన ఇద్దరు విద్యార్థినులను మాత్రం స్థానికులు కాపాడగలిగారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం అక్కచెరువుపాలెంలో శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. వివిధ ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు వేసవి సెలవులకు గ్రామానికి వచ్చారు. సాయంత్రం వీరంతా గ్రామంలోని వ్యవసాయ చెరువులో ఈతకు వెళ్లారు. ముందుగా చెరువులోకి దిగిన చింతల కౌశిక్‌ (16), మద్దినేని సుబ్రమణ్యం(15), అబ్బూరి హరిభగవన్నారాయణ(11)తోపాటు బంధువు ఇంటికి వచ్చిన చీమకుర్తి మండలం, బూసరపల్లికి చెందిన మున్నంగి శివాజీ (13) లోతుకు వెళ్లి నీటమునిగి చనిపో యారు. ఆ తర్వాత దిగిన ఇద్దరు బాలికలను మాత్రం స్థానికులు కాపాడారు.

*ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రిమూవీ మేకర్స్‌, శ్రేయాస్‌ మీడియాపై శుక్రవారం మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నాని, నజ్రియ హీరోహీరోయిన్‌లుగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ ప్రీరిలేజ్‌ వేడుక ఈనెల 9న మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించారు. ఈ వేడుకలకు సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. దీంతో పెద్దసంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. కార్యక్రమంలో కరోనా ఆంక్షలు పాటించకుండా, అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేయడంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని మైత్రి మూవీస్‌, శ్రేయాస్‌ మీడియాపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమతులు లేకుండా, కరోనా ఆంక్షలు పాటించకుండా ఫ్రీరిలీజ్‌ వంటి వేడుకలు నిర్వహించరాదని, చట్టవిరుద్ధ్దమైన పనులకు పాల్పడితో చర్యలు తప్పవని మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్రప్రసాద్‌ హెచ్చరించారు.