NRI-NRT

యూఏఈ పర్యటనకు మోదీ

యూఏఈ పర్యటనకు మోదీ

మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలతో గల్ఫ్‌ దేశాల్లో భారత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల చివర్లో యూఏఈ పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. జర్మనీలో ఈ నెల 26-28 తేదీల మధ్య జీ-7 దేశాల సదస్సు జరుగనున్నది. దీనికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగానే ఆయన యూఏఈ కూడా వెళ్లనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ నేతలు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ వ్యాఖ్యలపై ఇస్లామిక్‌ దేశాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. పలు దేశాలు భారత రాయబారులకు సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేశాయి. భారత ఉత్పత్తులను బహిష్కరించాలని పలు ఇస్లామిక్‌ దేశాల్లో డిమాండ్లు వెల్లువెత్తాయి. గల్ఫ్‌లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది. దశాబ్దాలుగా గల్ఫ్‌తో ఉన్న సత్సంబంధాలు బీజేపీ నేతల వ్యాఖ్యతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామిక్‌ దేశాల ఆగ్రహాన్ని చల్లార్చి తిరిగి దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన యూఏఈ వెళ్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.