Politics

ఆసుపత్రిలో చేరిన సోనియా

ఆసుపత్రిలో చేరిన సోనియా

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్ చేరారు. ఇటీవల ఆమె కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. వాస్తవానికి సోనియా నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఈ నెల 8న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సింది. అయితే కోవిడ్‌ కారణంగా ఆమె హాజరు కాలేకపోతున్నారని కాంగ్రెస్ ఇటీవలే ప్రకటించింది.
ఇదే కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల 2న ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు ఈడీ సమన్లు పంపింది. అయితే రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నారని ఈ నెల 13న హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. రాహుల్ ఈడీ ఎదుట హాజరౌతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహం చేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90.25 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు.