DailyDose

తెలంగాణకు ఏపీ బాకీ 4,774 కోట్లు

తెలంగాణకు ఏపీ బాకీ 4,774 కోట్లు

ఏపీ ప్రభుత్వం రూ.4,774 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టులో తెలంగాణ జెన్‌కో పిటిషన్‌ దాఖలు చేసింది. తెలంగాణ జెన్‌ కో, ప్రావిడెంట్‌ ఫండ్‌ ట్రస్ట్‌, పెన్షన్‌ అండ్‌ గ్రాట్యుటీ ట్రస్ట్‌ల తరఫున టీ రామకిషన్‌రావు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మొత్తాన్ని ఏపీ జెన్‌కో, ప్రావిడెంట్‌ ఫండ్‌ ట్రస్ట్‌, పెన్షన్‌ అండ్‌ గ్రాట్యుటీ ట్రస్ట్‌ల నుంచి చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలన్న తెలంగాణ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలితో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘గతంలో రుణాలకు అధిక మొత్తంలో తెలంగాణ చెల్లించాల్సింది రూ. 549 కోట్లు, దీనికి వడ్డీ రూ.423 కోట్లు. మొత్తంగా రూ.972 కోట్లు రావాల్సి ఉన్నది.

పెట్టుబడుల్లో తెలంగాణ జెన్‌కో ట్రస్ట్‌ వాటా చెల్లించాల్సింది రూ.1,218 కోట్లు. దీనికి వడ్డీ రూ.954 కోట్లు. మొత్తంగా రూ.2,172 కోట్లకు చేరింది. డిసంల బాండ్లలో తెలంగాణ వాటా రూ.500 కోట్లు, వడ్డీ రూ. 382 కోట్లు కలిపి మొత్తం రూ.882 కోట్లు, ఏపీ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.481 కోట్లు, వడ్డీ రూ.317 కోట్లతో కలిపి మొత్తం రూ.748 కోట్లు తెలంగాణకు రావాల్సి ఉన్నది. ఈ మొత్తం కలిపి రూ.4,774 కోట్ల బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలి’ అని తెలంగాణ తరఫు న్యాయవాది కోరారు. రాష్ట్ర విభజన చట్ట నిబంధనలను ఏపీ సరారు ఉల్లంఘించిందని వెల్లడించారు. ఉద్యోగుల విభజన కాలేదని చెప్పి ప్రావిడెంట్‌ ఫండ్‌, పెన్షన్‌ బకాయిలను సర్దుబాటు చేయటం ఆపేసిందని తెలిపారు. మొత్తం 3,442 మందిలో కేవలం 28 మంది తుది కేటాయింపులే పెండింగ్‌లో ఉన్నాయని, కానీ, మిగిలిన అందరి పీఎఫ్‌, పెన్షన్‌ బకాయిలను ఏపీ చెల్లించటం లేదని హైకోర్టకు వివరించారు.

విభజన చట్ట నిబంధనల ప్రకారం తెలంగాణ, ఏపీలు జనాభా నిష్పత్తి ప్రకారం రెండు రాష్ట్రాల జెన్‌కోలు, డిసంలు విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉన్నదని, అయితే ఏపీ జెన్‌కో ఏకపక్షంగా సరఫరాను నిలిపివేసిందని తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు కేంద్రం జోక్యం చేసుకోకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనల అనంతరం ప్రతివాదులు ఏపీ జెన్‌కో, ఏపీ జెన్‌కో పెన్షన్‌ అండ్‌ గ్రాట్యుటీ ట్రస్ట్‌, ఏపీ విద్యుత్తు శాఖ, ఏపీ పవర్‌ కోఆర్డినేషన్‌ కమిటీ, కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.