Politics

గన్నవరంలో గరం గరం.. నేతల పరస్పర ఆరోపణలు

గన్నవరంలో గరం గరం.. నేతల పరస్పర ఆరోపణలు

గన్నవరంలో వైకాపా నేతల తీరు అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. కలిసి పని చేసుకోవాలని సీఎం సైతం సూచించినా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. తాజాగా పరస్పర ఆరోపణలు చేసుకుంటూ మీడియాకు ఎక్కారు. వచ్చే ఎన్నికల్లో సీటు నాదంటే.. నాది అని నేతలు ప్రకటించుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి సీరియస్​ అయినట్లు సమాచారం.

గన్నవరం నియోజకవర్గ వైకాపాలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే, వైకాపా నేతలు మీడియా వేదికగా చేసుకుంటున్న ఘాటైన విమర్శలు, తీవ్ర స్థాయి ఆరోపణలతో అక్కడి రాజకీయం గరంగరంగా మారింది. వైకాపా అధిష్ఠానానికి ఈ పరిస్థితి తలనొప్పిగా మారింది. గత కొంత కాలంగా ఇక్కడ అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు బహిర్గతమవుతూ అధిష్ఠానం దృష్టికి వెళ్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు సీఎం సైతం ఇరువర్గాలకు సర్దిచెప్పి కలిసి పనిచేసుకోవాలని సూచిస్తూ వచ్చారు. అయినా నేతల మధ్య అదే ధోరణి కనిపిస్తోంది. మీడియా ముందు మనసులోని మాటలను బయట పెడుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఘాటైన పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు. ఆదివారం నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు ముఖ్యనేతలు మీడియా ముందు పరస్పర ఆరోపణలు విమర్శలు చేసుకోవడం వైకాపా వర్గాల్లో కలకలం రేపుతోంది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా సీరియస్‌ అయినట్లు తెలిసింది. గన్నవరం వైకాపా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో సీటు నాదంటే నాది అంటూ నేతలు ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

గన్నవరం నుంచి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీమోహన్‌ తెదేపా సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన వైఎస్‌ జగన్‌కు మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ఇక్కడ నుంచి గన్నవరం అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాట ప్రారంభమైంది. 2019లో వంశీపై వైకాపా నుంచి పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావు సుమారు 800 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అంతకుముందు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న దుట్టా రామచంద్రరావుకు ఎమ్మెల్సీ ఇస్తానని అధినేత జగన్‌ హామీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. యార్లగడ్డ ఓడిన తర్వాత డీసీసీబీ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు జరిగాయి. రూ.కోట్లలో ఆదాయానికి గండికొట్టారు. ఇదే అంశంపై అధికార పార్టీ నేతలు పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ వంశీ వర్గం, వ్యతిరేక వర్గంగా తయారయ్యారు. తెదేపా నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, వైకాపా కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందంటూ దుట్టా, యార్లగడ్డ అనుచరులు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ఇప్పటికే మూడుసార్లు సీఎం వద్ద పంచాయితీ జరిగింది. తాజాగా మరోసారి పిలుస్తారని పార్టీ పెద్దలు చెబుతున్న తరుణంలో ఆదివారం ఒక్కసారిగా నేతల నోటి వెంట ఘాటైన పదజాలాలు వెలువడ్డాయి. ఆత్కూరులో ఒక కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వంశీ, హనుమాన్‌ జంక్షన్‌లో తన నివాసంలో దుట్టా రామచంద్రరావు, అల్లుడు శివభరత్‌రెడ్డి, విజయవాడలో తన నివాసంలో యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

*పిచ్చిగా వాగితే తాట తీస్తా :-ఎమ్మెల్యే వంశీమోహన్‌
నా గురించి పిచ్చవాగుడు వాగితే తాట తీస్తా! వంశీ అంటే ఏమిటో చూపిస్తా! ప్రజల్లో ఓడిన వారిపై విశ్వాసం ఉంటుందా.. గెలిచిన వారిపై ఉంటుందా..?ఐఎస్‌ఓ ఏజెన్సీలా వ్యవహరిస్తున్నారు. 3 సంవత్సరాలు ఓపిక పట్టాను. చాలా మర్యాదగా చెప్పాను. సీఎం చెప్పిన పని నేను చేస్తున్నా. అభ్యంతరాలు ఉంటే ఆయనకే చెప్పుకోవాలి. అంతేగాని ఇంట్లో కూర్చుని పిచ్చవాగుడు వాగితే డొక్క తీస్తా! ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఎంపీపీ గెలిచారట. ఇప్పుడు గెలవమను. ఎన్ని పంచాయతీలు గెలుస్తారు..? ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో తెలుసు. భూకబ్జాలు చేశారో తెలుసు. రేమాండ్‌ స్థలం కబ్జా, మల్లవల్లి వాడలో రూ.2 కోట్లు వసూలు, వీరవల్లి చెరుకు ఫ్యాక్టరీ తగలబెట్టేందుకు వెళితే రైతుల చేతిలో దెబ్బలు తిన్నది తెలుసు. ఆటోనగర్‌ ప్లాట్లు అమ్ముకున్నది తెలుసు. వీళ్ల గురించి పెద్ద గ్రంథమే ఉంది. ఇంకో ఆయన మూడు నెలలకు ఆరునెలలకు వచ్చి పిచ్చవాగుడు వాగుతాడు. నేను అస్సాం, అమెరికా పారిపోలేదు. గొట్టాలు కనపడితే చాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. వీరికి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది. నా గురించి విమర్శిస్తేనే మీడియాలో కనపడతారు. లేకపోతే వీరిని దేకేదెవరు.? ఈ పకోడి గాళ్ల గురించి పట్టించుకోను. బృహన్నలు ఏం చేస్తారు..?

వంశీతో కలిసి పని చేయలేను:-యార్లగడ్డ వెంకట్రావు
వంశీ అంటే నాకేమీ భయం లేదు. నేను నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేసిన వాడిని. ప్రజల సమస్యల గురించి నాకు తెలుసు. వంశీతో కలిసి పనిచేయలేక నియోజకవర్గానికి దూరమయ్యాను. గద్దె రామ్మోహన్‌ లాంటి జంటిల్‌మెన్‌తో కలిసి పనిచేస్తాను గానీ వంశీతో కలవనని జగన్‌తోనే చెప్పాను. అధికార పార్టీలో ఉండి.. ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇప్పించలేని నిస్సహాయస్థితిలో ఉన్నాం. సంస్కారవంతంగా పెరిగా. సభ్యత లేకుండా మాట్లాడలేను. ఇలా తిట్టుకుంటే జనం ఇడియట్లు అనుకుంటారు. ఐఎస్‌బీలో చదివే వ్యక్తికి ఎలా మాట్లాడాలో కూడా తెలియదా..? ఎయిర్‌పోర్టు ఎదురుగా 150 ఎకరాలు కబ్జా కాకుండా కాపాడాను. అక్కడ కన్వెన్షన్‌ సెంటర్‌ కట్టాలని ప్రయత్నించాను.

ఇంకెన్ని పార్టీలు మారతావో..:-శివభరత్‌రెడ్డి, వైకాపా
మేం పుట్టింది రాయలసీమలో.. నీకు లాగా పౌరుషం లేకకాదు. మేము మనుషులకు వైద్యం చేస్తాం. సంస్కారంతో ఉన్నాం. నీవు పశువులకు వైద్యం చేస్తావు కాబట్టి పశువులా ప్రవర్తిస్తున్నావ్‌! తెదేపా ఉన్నప్పుడు విజయమ్మను, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని, జగన్‌మోహన్‌రెడ్డిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. ఇప్పుడు వైకాపాలోకి వచ్చి చంద్రబాబుని, వారి సతీమణిపై నోరుపారేసుకున్నావ్‌! పిచ్చిపడితే మంచి వైద్యం చేయించుకో. వైకాపా ఆవిర్భావం నుంచి ఉన్నాం. ఊసరవెల్లిలాగా రోజుకో పార్టీ మారుతున్నావు. ఇంకెన్ని పార్టీలు మారతావో..?నువ్వు మూడు సంవత్సరాల నుంచి భరిస్తే.. మేం 14 సంవత్సరాల నుంచి సహిస్తున్నాం. మేం సహనం కోల్పేతే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకో..!

మట్టి తవ్వకాలపై విచారణ జరపాలి..-దుట్టా రామచంద్రరావు, వైకాపా
నేను 40 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నా. నా కూతురు జడ్పీటీసీగా గెలవడంలో వంశీ పాత్ర లేదు. నేను ఫ్యాక్షనిస్టు కాదు. నాకు భద్రత లేకుండానే ప్రజల్లో తిరుగుతున్నా. నాకు ఎంపీ కావాలా.. ఎమ్మెల్యే కావాలా అని సీఎం జగనే అడిగారు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు, జనసేన ఓట్లతో కేవలం 800 ఆధిక్యంతో గెలిచావు. వచ్చే ఎన్నికల్లో వంశీకే టిక్కెట్‌ వస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదు. పార్టీలోనే ఉంటా. ఈ విషయాన్ని అధిష్ఠానానికి స్పష్టం చేశాను. మల్లవల్లి భూములు, మట్టి తవ్వకాల విషయంలో ఆరోపణలు చేస్తున్నారు. అన్నింటిపై విచారణ జరపాలి.ఎవరు కుక్కలో ప్రజలకి తెలుసు.వంశీ నాకు కళ్లు చిదంబరం, పిచ్చికుక్క అంటూ రెండు ఆస్కార్‌ అవార్డులు ఇచ్చారు. అది ఆయన సంస్కారం!