Politics

జగన్ అలా చేస్తే.. కేంద్రం నుంచి రావాల్సినవి వస్తాయి – TNI రాజకీయ వార్తలు

జగన్ అలా చేస్తే.. కేంద్రం నుంచి రావాల్సినవి వస్తాయి – TNI రాజకీయ వార్తలు

* రాష్ట్రపతి ఎన్నికను పావుగా వాడుకొని రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుకు వైకాపా పట్టుబట్టాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ సూచించారు. సీఎం జగన్ కేసులకు భయపడితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయమే జరగుతుందన్నారు.
ప్రత్యేక హోదా సాధించాలంటే.. రాష్ట్రపతి ఎన్నికలను వైకాపా బహిష్కరించాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ సూచించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపాది కీలకపాత్ర కాబట్టి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేస్తే.. రాష్ట్రానికి రావాల్సినవన్నీ వస్తాయన్నారు. కేంద్రం మెడలు వంచేందుకు ఇంతకన్నా మంచి అవకాశం రాదన్నారు. సెప్టెంబర్ 25న రాజమహేంద్రవరంలో దళిత సింహగర్జన నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. సింహగర్జనకు మైనార్టీలను కలుపుకొని వెళతామని చెప్పారు.తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఉహాగానాలపైనా హర్ష కుమార్ తనదైన శైలిలో స్పందించారు. జాతీయ పార్టీ కంటే ముందు రేవంత్ రెడ్డిని ఢీకొనాలని సూచించారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని హర్ష కుమార్ డిమాండ్ చేశారు.

*బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు: CLP Leader bhatti
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గాందీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తోందని, బిజెపి బెదిరింపులకు భయపడేది లేదని సీఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క హెచ్చరించారు. గతంలో ఇందిరాగాంధీని జైలుకు పంపిస్తే ఏం జరిగిందో ప్రజలకు తెలుసునని గుర్తు చేశారు.గాంధీ కుటుంబం జోలికి వస్తే బీజేపీని తరిమికొడతామని భట్టి హెచ్చరించారు.ఇది అంతంకాదు..ఆరంభం మాత్రమేనని, ఎన్ని పోరాటాలకైనా కాంగ్రెస్ సిద్ధంగా వుంటుందన్నారు. రాహుల్, సోనియాలపై ఈ వాలనివ్వమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

*APలో అరాచక పాలన నడుస్తోంది: నారా లోకేష్
ఏపీలో అరాచక పాలన నడుస్తోందని టీడీపీ నేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రాష్ట్రంపై పడి ప్రజాధనం దోచుకుంటుంటే.. వైసీపీ నేతలు గ్రామాలపై పడుతున్నారని మండిపడ్డారు. హిందూ దేవాలయాలపై వైసీపీ ముఠాలే దాడులు చేసి.. టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లాకు చెందిన చోటా వైసీపీ నేత వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో రూ.25కోట్ల విలువైన మరకత విగ్రహం బయటపడిందన్నారు. వైసీపీ బడా నేతల ఇళ్లల్లో ఇంకెన్ని పురాతన విగ్రహాలున్నాయో? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ వైసీపీ నేతలు.. నగలు, విగ్రహాలు ఎత్తుకెళ్లారని భక్తుల్లో అనుమానాలున్నాయని లోకేష్‌ తెలిపారు.

*’ఎమ్మెల్యేల పీఏలది కీలక పాత్ర: vijayasai reddy
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పీఏలది కీలక పాత్ర అని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల పర్యటన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల గ్రూపుల్లో ఉంచాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు, ప్రజల విజ్ఞపణలు ఈ గ్రూపుల్లో పోస్ట్ చేయాలన్నారు. ప్రజల డిమాండ్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

*దళితులకు ఇచ్చే పథకాలను వైసీపీ రద్దు చేసింది: హర్షకుమార్
దళితులకు ఇచ్చే పథకాలను వైసీపీ రద్దు చేసిందని మాజీ ఎంపీ హర్షకుమార్ దుయ్యబట్టారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులు హత్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులను ఏకతాటిపైకి తెచ్చి దళిత సింహగర్జన చేపడతామని ప్రకటించారు. సెప్టెంబర్‌లో భారీ ఎత్తున దళిత సింహగర్జన నిర్వహిస్తామని హర్షకుమార్ తెలిపారు.

*ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది: దుట్టా రామచంద్ర రావు
వచ్చే ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్ర రావు తెలిపారు. తనకు ఎంపీ సీటు కావాలా? లేక ఎమ్మెల్యే సీటు కావాలా? అని జగన్ అడిగారని చెప్పారు. వంశీకి టిక్కెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని.. కానీ పార్టీలోనే ఉంటానని సీఎంకు తెలిపానని దుట్టా చెప్పారు. తాను ఇప్పటివరకూ చంద్రబాబు‌ను నేరుగా చూడలేదన్నారు. టీడీపీ వారితో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.

*బాలశౌరి బహిరంగ క్షమాపణ చెప్పాలి: కొనకళ్ల నారాయణరావు
మచిలీపట్నం ఎంపీ బాలశౌరిపై టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఫైర్ అయ్యారు. పేర్ని నాని, తనకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని బాలశౌరి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏ ఆధారంతో పేర్ని నానికి, తనకు సత్సంబంధాలు ఉన్నాయని బాలశౌరి ఆరోపించాడో సమాధానం చెప్పాలని కొనకళ్ల డిమాండ్ చేశారు. పేర్ని నాని తనకు ఓ రాజకీయ ప్రత్యర్థి అని, ఆయనొక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని, నేనొక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానన్నారు. నా గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరాధార వ్యాఖ్యలు చేసిన బాలశౌరి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

*జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మద్యపానాన్ని నిషేధించాలి: ఆచంట సునీత
జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని టీడీపీ మహిళా నేత ఆచంట సునీత డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పిన జగన్ మాట మార్చి మరీ మద్యాన్ని అమ్మిస్తున్నాడని ఆరోపించారు. మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతో పాలన సాగించే స్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని విమర్శించారు. మహిళా పక్షపాతిని, మహిళా సంక్షేమమే తన ధ్యేయం అని చెబుతూనే.. మహిళల మాన ప్రాణాలతో ఆడుకోవడం దుర్మార్గమన్నారు.

*టీఆర్‌ఎస్‌కు ముందస్తు భయం ఎందుకు?: భట్టి
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అభద్రతా భావం టీఆర్‌ఎస్‌ పాలకులకు ఎందుకు వచ్చిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయ్రాత్ర చేస్తున్న భట్టి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడానికి టీఆర్‌ఎస్‌ పాలకులు ముందస్తు ఎన్నికలను తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ను ఎదుర్కోలేక ఈడీ నోటీసులు, విచారణ పేరిట బీజేపీ కక్ష సాధింపు రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

*కాంగ్రెస్‌కు అంతిమ యాత్ర: బాల్క సుమన్‌
దేశంలో కాంగ్రెస్‌ కొన ఊపిరితో ఐసీయూలో ఉందని, ఆ పార్టీకి అంతిమ యాత్ర.. నవ భారత నిర్మాణానికి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న టీఆర్‌ఎ్‌సది జైత్రయాత్ర అని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. బంగారు భారత్‌ లక్ష్యంగా.. కేసీఆర్‌ జాతీయ పార్టీ పెడుతున్నారనగానే కాంగ్రెస్‌, బీజేపీల్లో వణుకు మొదలైందని అన్నారు.

*ముఖ్యమంత్రి పదవి నాకొద్దు: జానారెడ్డి
‘కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం పూర్తిగా పాడైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని బాగు చేయడం ఎవరి తరం కాదు. అందుకే నేను ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ పార్టీ అధిష్ఠానం నన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా వద్దని చెబుతాను’ అని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి అంతా కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన సూచించారు

*సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే: Pawan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం.. చిన్న గమనిక.. సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే.. సామెతలు 12:22 అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు’’ అంటూ పవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

*కేంద్ర నిధులతోనే నవరత్నాలు: బీజేవైఎం
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను దగా చేస్తున్నదని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌ విమర్శించారు. నవరత్నాల్లో ఒక్క అమ్మఒడి మినహా మిగిలిన పథకాలన్నింటినీ కేంద్రం ఇచ్చే నిధులతోనే అమలు చేస్తున్నదన్నారు. ఆ విషయాన్ని బహిర్గతం చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నదని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు.

*పోలీసుల స్థలాన్ని కాపాడండి!: వర్ల
చంద్రగిరిలో పోలీస్‌ శాఖకు కేటాయించిన భూమిని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికార వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీకి ఆదివారం లేఖ రాశారు. పార్టీ కార్యాలయం కోసం పోలీసు భూములపై వైసీపీ ల్యాండ్‌ మాఫియా కన్నేసిందని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే అక్రమంగా పోలీసుల భూమిలో భూమిపూజ నిర్వహించినట్లు తెలుస్తోందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

*ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. దాడులతో బెదిరిస్తారా? : చంద్రబాబు
ష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా సర్కారు పనితీరును ప్రశ్నిస్తే.. దాడులు చేసి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ రెడ్డి సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తే.. దాడులు, హత్యలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వెంకాయమ్మ కుటుంబంపై మరోసారి దాడి జరగడంపై.. డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై వైకాపా నేతలు ఇష్టానుసారం దాడులు చేస్తున్నారని అన్నారు. కొందరు పోలీసు అధికారుల సహకారంతోనే.. ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.వెంకాయమ్మ, ఆమె కుమారుడు వంశీపై జరిగిన దాడి.. ఈ వరుస ఘటనల్లో భాగమేనని లేఖలో పేర్కొన్నారు. వెంకాయమ్మపై దాడి చేసిన వారిపై ఇంకా చర్యలు తీసుకోలేదన్న చంద్రబాబు.. ఆమె కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖతోపాటు పలు వీడియోలు జతచేసి డీజీపీ పంపించారు.

*మూడేళ్లుగా వైకాపా రాక్షస పాలన సాగిస్తోంది: తెదేపా
వైకాపా ప్రభుత్వ పాలనపై తెదేపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడేళ్లుగా వైకాపా రాక్షస పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాదుడే బాదుడు, మహానాడుకు వచ్చిన స్పందన చూసి అధికార పార్టీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.’బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న తెదేపా అధినేత నారా చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. కార్యక్రమం నిర్వహణపై విజయనగరం జిల్లా తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడేళ్లుగా రాక్షస పాలన‌ కొనసాగుతోందని మండిపడ్డారు. వైకాపా పాలనలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారన్నారు. వివాదరహితుడిగా పేరున్న మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుని కూడా వదల్లేదన్నారు. మాన్సాస్ ఆస్తుల విషయమై ఆయన్ను తీవ్రంగా వేధించారని మండిపడ్డారు. తాజాగా లోకేశ్ పదో తరగతి విద్యార్థులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో వైకాపా నేతలు దొంగల్లా ప్రవేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులు చర్యలు తీడుకోకపోవటం హాస్యాస్పదమని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బుద్ధా డిమాండ్ చేశారు.చంద్రబాబు ఇప్పటి వరకు 7 ప్రాంతాల్లో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. బాదుడే బాదుడు, మహానాడుకు వచ్చిన స్పందన చూసి అధికార పార్టీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే.. మంత్రుల బస్సుయాత్ర, గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా కార్యక్రమాలకు వ్యతిరేకంగా అధికార వైకాపా చేపట్టిన కార్యక్రమాలన్నీ విఫలమయ్యాయని చెప్పారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.., ఈ ప్రభుత్వాని ఓడించేందుకు ప్రజలు అత్రుతగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.రాష్ట్రంలో లా అండ్ అర్డర్ అదుపుతప్పిందని మరో నేత అశోక గజపతిరాజు అన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటంతో రైతులు క్రాప్ హాలీడేకు వెళ్లారని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఊసే లేదని.., ప్రభుత్వానికి చట్టాలు, రాజ్యం, పద్దతులు పట్టడం లేదని మండిపడ్డారు.

*బుస్సు మాటలతో మద్యాంధ్రప్రదేశ్‌: లోకేశ్‌
బూమ్‌బూమ్‌ రెడ్డి బుస్సు మాటలు, మోసాలకు అడ్డూ ఆపు లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆదివారం విమర్శించారు. ‘‘ఎన్నికల ముందు మద్యపాన నిషేధం, ఎన్నికల తర్వాత సంపూర్ణ మద్యపానప్రదేశ్‌. మద్య నిషేధం అనే ఊసు కూడా ఎత్తేది లేదంటూ రాసిచ్చి మరీ… మందుబాబుల్ని తాకట్టుపెట్టి రూ.8,300 కోట్ల అప్పుతెచ్చారు. జగన్‌ బ్రాండ్లతో ఎన్నివేల మంది మహిళల మెడలో తాళ్లు తెగబోతున్నాయో ఆలోచిస్తేనే భయం వేస్తుంది’’ అని ఒక ప్రకటనలో లోకేశ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, జనం ఏమైతే నాకేంటి.. జగన్‌ బాగుంటే చాలని ముఖ్యమం త్రి అనుకోవడం తప్పని టీడీపీ మహిళా నేత గద్దె అనూరాఽధ పేర్కొన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు అక్రమ సంపాదన కోసం రాష్ట్రాన్ని మద్యం, గంజాయి, నాటుసారా కేంద్రంగా మార్చారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పేరు జగన్మోహన్‌రెడ్డి కాదు.. మద్యమోహన్‌రెడ్డి అని టీడీపీ నేత ఆచంట సునీత ఎద్దేవా చేశారు.

*రౌడీలు వచ్చి స్టేషన్‌లోనే అల్లర్లు చేస్తున్నారు: నక్కా ఆనందబాబు
వైసీపీ రౌడీలు వచ్చి స్టేషన్‌లోనే అల్లర్లు చేస్తున్నారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకాయమ్మపై పీఎస్‌లో దాడి చేసినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారని మండిపడ్డారు. పోలీసులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. దాడులు చేసినవారిపై ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు. మానవ హక్కులు, ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

*ప్రజా సేవకు పార్టీ అవసరం లేదు: వాణీ విశ్వనాథ్‌
ప్రజా సేవ చేయడానికి ఏ పార్టీ అవసరం లేదని సినీ నటి వాణీవిశ్వనాథ్‌ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి ఆంధ్రవాడలో ఆదివారం జరిగిన మాతమ్మ తిరుణాళ్ళలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాతమ్మ ఆలయానికి రూ.60 వేలు విరాళంగా ఇచ్చారు. తన సేవను గుర్తించి ఏ పార్టీ తనకు సముచిత స్థానం కల్పిస్తుందో ఆ పార్టీ తరపున రాబోయే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. వీలుకాని పక్షంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వాణీ విశ్వనాథ్‌ తెలిపారు.

*ఒక్కచాన్స్ అని వచ్చిన జగన్ వన్‌టైమ్ సీఎంగా మిగిలిపోతారు: బోండా ఉమ
వైసీపీ పాలనలో పేదల జీవితాలు తలకిందులయ్యాయని టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పెట్టిన పథకాలన్నీ రద్దు చేశారని మండిపడ్డారు. పన్నులు, చార్జీలు, ధరల పెంపుతో సామాన్యులు బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1వ తారీఖు వస్తుందంటేనే పేదలు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఒక్కచాన్స్ అని వచ్చిన జగన్ వన్‌టైమ్ సీఎంగా మిగిలిపోతారని విమర్శించారు. 175 సీట్లు గెలుస్తామన్న నమ్మకముంటే జగన్ ఎన్నికలకు వెళ్లాలన్నారు.

*వారి కుటుంబానికి రక్షణ కల్పించా కల్పించాలి: అచ్చెన్నాయుడు
వైసీపీ పాలనలో ప్రశ్నించినవారిపై దాడులు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వెంకాయమ్మ కుటుంబంపై వైసీపీ మూకల దాడిని ఖండిస్తున్నామన్నారు. వైసీపీ పాలనను ప్రశ్నించినందుకు వెంకాయమ్మను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకాయమ్మ కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.