Politics

అరాచకానికి పరాకాష్ట ఇది

అరాచకానికి పరాకాష్ట ఇది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకత్వానికి పరాకాష్ట ఇది. ఇందులో అంతర్లీనంగా క్షేత్రస్థాయిలో పరిపాలన వ్యవహారాలు ఎంత ఘోరంగా మారిపోతున్నాయో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ నాయకులు ఎంత అడ్డగోలుగా చెలరేగిపోతున్నారో కూడా తెలుస్తుంది?

తాడిపత్రిలో మురుగునీటి శుద్ధి కేంద్రం పైపులైన్లు దెబ్బతిన్నాయి. వాటిని బాగు చేయడానికి 2 లక్షలు ఖర్చవుతుందంటే.. మునిసిపాలిటీ అధికారులు నిధులు ఇవ్వడానికి నిరాకరించారు. అక్కడ ఛైర్మన్ తెలుగుదేశానికి చెందిన జెసి ప్రభాకర రెడ్డి! అయినా ఆయన మాటకు మునిసిపాలిటీ అధికారుల వద్ద చెల్లుబాటు లేదు. తన సొంత డబ్బు వెచ్చించి పనులు చేయించడానికి జెసి ప్రభాకరరెడ్డి ముందుకొచ్చారు.

మునిసిపల్ ఛైర్మన్ సొంత డబ్బుతో పనులు చేయిస్తోంటే.. ఎమ్మెల్యే కొడుకు వచ్చి, నా అనుమతి లేకుండా పనులు చేస్తారా అంటూ కాంట్రాక్టరును కొట్టడం దారుణం. మురుగునీళ్లు పొంగుతోంటే.. అక్కడ ప్రజలకు ఇబ్బంది గనుక పనులు చేస్తున్నారని చెప్పబోయిన తెలుగుదేశం కౌన్సిలర్ ను కొట్టడం, ఈ వ్యవహారం ఫోన్ లో షూట్ చేస్తున్న ఈనాడు రిపోర్టరును కొట్టడం వారి దౌర్జన్యానికి పరాకాష్ట.

అక్కడ మునిసిపల్ ఛైర్మన్ తెలుగుదేశానికి చెందిన వ్యక్తి గనుక.. ఆ మునిసిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి పని జరగనివ్వకుండా స్తంభింపజేయాలని ప్రభుత్వం అనుకుంటోందా? టీడీపీ వారు వాళ్ల సొంత డబ్బుల్తో పనులు చేయాలనుకున్నా కూడా జరగనివ్వరా? అడ్డుకుంటారా? ఇది సరైన పరిపాలన అనిపించుకుంటుందా? ప్రజలు ఇలాంటి దౌర్జన్యాలని, దాడులను, అరాచకత్వాన్ని హర్షిస్తారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి.ఎస్సీ యువకుడిని హత్య చేసిన పార్టీ నాయకుడి మీదనే తూతూ మంత్రపు చర్యలతో ఉపేక్షించిన అధికార పార్టీ.. ఇలాంటి దాడులకు తెగబడిన తమ నేతల మీద ఎంత కఠినంగా వ్యవహరిస్తుందని ఆశించగలం..?