NRI-NRT

అమెరికా నుంచి ఆఫ్రికా దాకా ఆప‌ద‌లో ఉన్న‌వారికి అండగా నిలుస్తున్న అర్జుమంద్‌ జువేరియా

అమెరికా నుంచి ఆఫ్రికా దాకా ఆప‌ద‌లో ఉన్న‌వారికి అండగా నిలుస్తున్న   అర్జుమంద్‌ జువేరియా

నిరాశ్రయులు ఏడిస్తే.. ఆమె కంట కన్నీరు కారుతుంది. నిరుపేదలు ఆకలితో అలమటిస్తే ఆమె ప్రాణం విలవిల్లాడుతుంది! అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, ఇండియా అయినా.. చేయూత అందిస్తూనే ఉంటుంది! సేవా కార్యక్రమాలతో పేదలకు అండగా నిలుస్తున్న ఫార్మసిస్ట్‌ అర్జుమంద్‌ జువేరియా పరిచయం..

మా సొంతూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు. నాన్న సింగరేణిలో పనిచేసి రిటైర్‌ అయ్యాడు. ఇంటర్‌ వరకు ఇల్లందులోనే చదువుకున్నా. బీఫార్మసీ కోసం హైదరాబాద్‌ వచ్చాను. దారుస్సలాంలో అమ్మమ్మ వాళ్లింట్లో ఉండేదాన్ని. ప్రస్తుతం అమెరికాలో జెర్సీ సిటీలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నా. సామాజిక సేవ నా ప్రవృత్తి, నా ప్రాణం, దేవుడు అప్పగించిన బాధ్యత.

ఆశ
ఏ దిక్కూలేని వాళ్లు ఎంతోమంది. వాళ్లంతా ఎలా ఉంటున్నారు? ఏం తింటున్నారు? అన్నది తెలుసుకున్నా. తొలి ప్రయత్నంగా రంజాన్‌ మాసంలో నిరుపేదలకు సాయం చేయడం మొదలుపెట్టాను. బీఫార్మసీ పాసయ్యాక నిమ్స్‌ ఔట్‌ ఫార్మసీలో చేశాను. తర్వాత, కేర్‌లో ఫార్మసిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించాను. గ్లోబల్‌ హాస్పిటల్‌లో ఫార్మసీ మేనేజర్‌ స్థాయికి ఎదిగాను. వార్డ్‌ బాయ్స్‌తో, ఆయాలతో మామూలుగా పనేం ఉండదు మాకు. కానీ నేనే కల్పించుకొని వాళ్ల బాగోగులు తెలుసుకునేదాన్ని. అలా అశోక్‌ గురించి తెలిసింది. ఆ వార్డ్‌బాయ్‌ డ్యూటీ తర్వాత హాస్పిటల్‌ బయట చలిలో పడుకుంటున్నాడట. తనకొచ్చే జీతంతో కిరాయికి గది తీసుకొనే పరిస్థితి లేదు. తనకు నా వంతు సాయం చేశాను. ఆ సంఘటన నాలో కొత్త ఆశలు కలిగించింది.
t2
స్ఫూర్తి
నేనప్పుడు షాదాన్‌ కాలేజీలో బీఫార్మసీ చదివేదాన్ని. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్నా. ఎర్రటెండ దంచుతున్నది. ఒక మహిళ చంకన బిడ్డనెత్తుకొని చెత్తకుప్పలో దేవులాడుతున్నది. వెతకగా వెతకగా ఓ చిన్న ప్యాకెట్‌ దొరికింది. అందులో పాడైపోయిన ఆహారమేదో ఉన్నది. తినేలోపే వెళ్లి లాగేసుకున్నా. ‘ఏమైందమ్మా! ఇట్లా చెత్తకుప్పలో పడేసింది తింటవ్‌? ఈ చంటిబిడ్డకు కూడా ఇదే పెడతవా?’ అన్నాను. అప్పుడామె వొలవొలా ఏడ్చేసింది. తన చేయి పట్టుకొని పండ్ల దుకాణానికి తీసుకెళ్లాను. ఏమేం కావాలో అడిగి ఇప్పించాను. ఇంటికెళ్లిన తర్వాత కూడా అదే ఆలోచన. ‘సరే నేను చూశాను కాబట్టి తనకు ఆ పూటకు పండ్లు ఇప్పించగలిగాను. మరి నేను చూడని వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ల సంగతేమిటి? ఎవరు బాధ్యత తీసుకుంటారు?’ అనిపించింది. ఆ సంఘటన నాలో స్ఫూర్తి నింపింది.

సంతోషం
ఓ రోజు, ఫార్మసీలో బిజీగా ఉన్నా. ఓ ఆయమ్మ ఏడుస్తూ వచ్చింది. ‘బిడ్డె పెండ్లి పెట్టుకున్నా. చేతిలోనేమో ఒక్క పైసాకూడా లేదు. మగ దిక్కులేని సంసారం. ఇంకా నలుగురు పిల్లలున్నారు’ అని చెప్పింది. ఆమె ఆందోళన అర్థమైంది. నా దగ్గర కట్నం ఇచ్చేంత డబ్బులు లేవు. తలా ఇంత వేసుకొని ఆయమ్మకు అండగా నిలిస్తే పెండ్లి జరుగుతుందని తోటి సిబ్బందితో చెప్పాను. ఎవరూ ముందుకురాలేదు. చివరి ప్రయత్నంగా నాన్నను కలిశాను. ఆయన దానధర్మాలు చేస్తుంటాడు. పరిస్థితి వివరిస్తే.. లక్ష రూపాయలైనా ఇస్తాడు. కానీ నేను అలా చేయదలుచుకోలేదు. ప్రతిసారీ అడగలేను కదా. అందుకే చేబదులుగా కొంత డబ్బు తీసుకొని, దానితో ఆయమ్మ బిడ్డ పెండ్లికి సాయం చేశాను. ఆ సంఘటన నాలో సంతోషాన్ని కలిగించింది. ఇప్పటివరకు దాదాపు 10 మంది నిరుపేదలకు పెండ్లిల్లు చేశాను.
t1
ఆత్మ విశ్వాసం
నా యాక్టివిటీస్‌, ప్రొఫైల్‌ చూసి విజయ్‌రెడ్డి అనే వ్యక్తి అమెరికాలో ఉద్యోగం ఆఫర్‌ చేశాడు. 2013లో అమెరికా వచ్చాను. ఆర్నెల్లు పని చేయగానే కంపెనీ మూతపడింది. తెలిసినవాళ్లెవరూ లేరు. ఇంటి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితి. అప్పుడే వినయ్‌ అంకం అన్న పరిచయం అయ్యాడు. తనకు లోకల్‌గా రెస్టారెంట్‌ ఉన్నది. తొలి పరిచయంలోనే ‘చెల్లె’ అని పలకరించాడు. నా బాధ తెలుసుకున్నాడు. నా అవసరం అర్థం చేసుకున్నాడు. నా ప్రతీ అడుగులో తోబుట్టువులా తోడున్నాడు. మళ్లీ ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టాను. ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నాను. నా ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. నేను సాయం చేసిన ప్రతీసారి ‘గాడ్‌ బ్లెస్‌ యూ బేటా’ అంటూ వినిపించిన ప్రతి ఆశీర్వాదం నన్ను రక్షిస్తున్నది.

విజయం
సేవా కార్యక్రమాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నాను. జెర్సీ సిటీలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. అమెరికన్స్‌, ఇండియన్స్‌,ఆఫ్రికన్స్‌.. అందరికీ పదేండ్ల నుంచి సహాయం చేస్తున్నా. మతాలకు అతీతంగా విద్య, ఆరోగ్య, ఉపాధి శిబిరాలు నిర్వహిస్తున్నా. ఎక్కడో ఇల్లందులో పుట్టి, పెరిగిన నాకు దేశం కాని దేశంలో ఎంతో మందికి సేవచేసే భాగ్యం లభించినందుకు గర్వంగా ఉంది. నా సేవలను గుర్తించిన జెర్సీ సిటీ కౌన్సిల్‌ ‘ఉమన్‌ ఆఫ్‌ యాక్షన్‌’ అవార్డును అందజేసింది. సేవా మార్గంలో ఇదొక గెలుపు చిహ్నంగా భావిస్తాను. భవిష్యత్‌లో ఒక ఎన్‌జీవో స్థాపించాలని అనుకుంటున్నా.