Politics

శరద్ పవార్‌తో మమత బెనర్జీ భేటీ – TNI రాజకీయ వార్తలు

శరద్ పవార్‌తో మమత బెనర్జీ భేటీ  – TNI రాజకీయ వార్తలు

* రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవడంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మంగళవారం ఆమె ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. వివిధ పార్టీల నేతలతో ఆమె బుధవారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, మమత బెనర్జీ మంగళవారం న్యూఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించారు. శరద్ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపేందుకు ప్రతిపక్షాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని మీడియా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. మమత శనివారం రాసిన లేఖలో రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు రావాలని 22 మంది నేతలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ 22 మంది నేతల్లో బీజేపీయేత పార్టీల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఉన్నారు. 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు జూలై 18న పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూలై 21న జరుగుతుంది. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఇప్పటి వరకు తన అభ్యర్థిని ప్రకటించలేదు. అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వీలుగా కూటమిలోని పార్టీలతోపాటు ప్రతిపక్షాలతో చర్చించే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు అప్పగించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24న ముగుస్తుంది.

*వంద శాతం భూ సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి హరీశ్‌ రావు
వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగులోని ఫారెస్ట్ కళాశాలలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధరణి పోర్టల్‌కు సంబంధించి ప్రత్యేక పోర్టల్‌ పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అందులో భాగంగా జిల్లాలోని ములుగు మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. కోర్టులు కేసులు, కుటుంబ తగాదాలతో కొన్ని భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ములుగులో సమస్యలు పరిష్కరించి రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తాం.ములుగు తర్వాత ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. ధరణి ద్వారా అనేక అక్రమాలక చెక్ పడిందని మంత్రి వివరించారు.సీఎ ఎస్ సోమేశ్ కుమార్‌ మాట్లాడుతూ..ధరణి పోర్టల్‌లో ఎలాంటి సమస్య లేదు. సాంకేతిక సమస్యలు కొన్ని ఉన్నాయన్నారు.

*బీజేపీ విభజన రాజకీయాలతో దేశంలో మతహింస : కె. నారాయణ
బీజేపీ విభజన రాజకీయలు దేశంలో మతహింసను పెంచుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. దీంతో భారతదేశ లౌకికతత్వం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, గిరిజన, మైనారిటీలపై ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర దాడులు జరుగుతున్నాయన్నారు.మఖ్దూం భవన్‌లో మంగళవారం నిర్వహించిన సీపీఐ రాష్ట్ర 3వ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. వైవిద్యభరిత, సుసంపన్న సంస్కృతి, సంప్రదాయాలు కగిలిన భారత దేశాన్ని అఖండ హిందూ దేశంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అందుకోసమే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువను ధ్వంసం చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.ప్రశ్నించేవారిపై దేశద్రోహం లేదా ఈడీ, సీబీఐలతో కేసులు పెట్టిస్తున్నారని వాపోయారు. కేంద్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలన్నారు. సెప్టెంబర్‌4 నుంచి 7 వరకు శంషాబాద్‌లో నిర్వహించే పార్టీ మహాసభలను చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

*ఉద్యమం నాటి KCRకు.. ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా..: Etelat
ఉద్యమం నాటి కేసీఆర్‌ (KCR)కు.. ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండాభూదేవి గార్డెన్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ 8 ఏళ్ళ ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఒకప్పుడు కేసీఆర్‌ టీవీలో కనబడితే యువత కేరింతలు కొట్టేవారని.. ఇప్పుడు చీదరించుకుంటున్నారని అన్నారు. తాను పార్టీ మారలేదని, టీఆర్‌ఎస్‌ వాళ్ళే వెళ్లగొట్టారన్నారు. రెచ్చగొడితే ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై చర్చకు సిద్ధమని అన్నారు. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరాలని చాలామంది ఎదురు చూస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు

*ఈ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా?: రేవంత్
ఆసిఫ్నగర్ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. పోలీస్ వాహనం ఎక్కి మందుబాబుల వీరంగం దృశ్యాన్ని ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్లోనేనని తెలిపారు. హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై.. దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందని ట్వీట్‌లో రేవంత్ పేర్కొన్నారు. ‘‘ఆసిఫ్నగర్లో పోలీసు వాహనం ఎక్కి మందుబాబుల వీరంగం.. హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై.. దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చింది. ఈ నగరాన్ని… ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా?.. పౌర సమాజం ఆలోచన చేయాలి’’ అంటూ రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

*ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్య: Ponnam
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి భయం పుట్టినప్పుడల్లా గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్మం డిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీలదన్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. ముంబై ఎయిర్పోర్టును ఆధానికి అప్పగించడానికి సీబీఐని ఉపయోగించుకున్నారా? లేదా..? అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకులను బీజేపీ… సీబీఐ, ఈడీతో అణిచివేసే ప్రయత్నం చేస్తోందని పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

*గౌరవెల్లి భూనిర్వాసితులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోండి: Narayana
గౌరవెల్లి భూ నిర్వాసితులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో సీపీఐ పాత్ర కూడా ఉందని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా సీపీఐ కాపాడిందన్నారు. కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తానన్న కేసీఆర్.. మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ప్రకారం.. అల్లుడు హరీశ్ రావు కుర్చీ వేసుకుని కూర్చుని బాధితులకు న్యాయం చేయాలని నారాయణ అన్నారు

*సమాజంలోని పరిస్థితులను ‘మనసున్నోడు’లో చూపించారు: రామకృష్ణ
సమాజంలోని పరిస్థితులను మనసున్నోడు సినిమాలో చూపించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మంగళవారం ఈ సినిమా ట్రెయిలర్‌ని రామకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విశ్వ జాగృతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కించారని చెప్పారు.ముంబైలో స్థిరపడి ప్రేమ వివాహం చేసుకున్న తమిళ మహిళ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు.ఓటీటీ, థియేట్రికల్ రిలీజ్ ఉంటుందన్నారు.ఈ చిత్రం విజయవంతం కావడానికి నిర్మాతలు సహకరించాలని కోరారు.తమిళనాడు డైరెక్టర్ జ్ఞానవేలు తీసిన ‘జై భీమ్’ ప్రజల మన్ననలు పొందిందని చెప్పారు. అదే విధంగా ప్రజానాట్య మండలి నాటకాన్ని మనసున్నోడు చిత్రంగా తీశారన్నారు.సమాజంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా తీసిన సినిమాని అందరూ ఆదరించాలని రామకృష్ణ కోరారు.

*కేంద్రాన్ని, ప్రజలను వైసీపీ సర్కార్ తప్పుదోవ పట్టిస్తోంది: Yanamala
రాష్ట్రంలో వాస్తవ ఆర్థిక పరిస్థితిని మరుగుపెట్టి తప్పుడు లెక్కలతో అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర రెవెన్యూ రాబడులతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అధికవడ్డీలకు అప్పులు తెస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని పరిస్థితి చూసి పెట్టుబడులు పెట్టడానికి, అప్పులివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఇష్టానుసారంగా బదిలీ చేసి ప్రజా ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆయన మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు చెల్లించకపోవడంతో రైల్వే పనులు నిలిచిపోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రుణాలు, ఉపయోగిస్తున్న నిధులపై కేంద్ర ప్రభుత్వం, నీతిఆయోగ్‌, రిజర్వ్ బ్యాంక్‌తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను బహిర్గతం చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

*జగనన్న సొంతింటి కళ సాకారం అయ్యే సూచనలు లేవు: Alapati raja
జగనన్న సొంతింటి కళ సాకారం అయ్యే సూచనలు లేవని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని, 17వేల కాలనీలు నిర్మిస్తున్నట్లు గొప్పలకు పోయారన్నారు. పట్టణాల్లో ఉన్న వారిని ఇళ్ల స్థలాల పేరుతో గ్రామాలకు తీసుకెళ్లారని తెలిపారు. ఇప్పుడు లబ్ధిదారులే కట్టుకోవాలని చెబుతున్నారని మండిపడ్డారు. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలకు పైగా వ్యయం అవుతోందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు ఇంటి నిర్మాణానికి ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. జగనన్న కాలనీల్లో రోడ్డు, నీరు, కరెంటు వంటి మౌలిక వసతులు లేవని ఆయన విమర్శించారు.

కేవలం 2 శాతం ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని… మరి ప్రభుత్వం చెప్పిన లక్షల ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇంటి నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చే లక్షా 80 వేలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఇవ్వటం లేదన్నారు. నిధులు కేంద్రానివి, పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదా అని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వంలో రెండున్నర లక్షలకు పైగా ఇళ్లు నిర్మాణం పూర్తయితే వాటిని లబ్ధిదారులకు ఇవ్వటం లేదని ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

*జగనన్న కాలనీలతో మళ్లీ దళితులను ఊరు బయటకు పంపే ప్రయత్నం: మాణిక్యరావు
వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు నవ బొగ్గులుగా మారాయని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్య రావు పేర్కొన్నారు. గతంలో దళితులు ఊరు బయట ఉండేవారని.. ఆధునిక సమాజంలో అందరు కలిసి జీవిస్తున్నామన్నారు. కానీ జగనన్న కాలనీల పేరుతో మరల దళితులను ఊరు బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని పిల్లి మాణిక్యాలరావు పేర్కొన్నారు. దళితులు గ్రామాలలో ఉండటం జగన్ రెడ్డికి ఇష్టం లేదన్నారు. జగనన్న కాలనీలు రేపు మురికి కూపలుగా మారుతాయన్నారు. మురికి కూపాలలో దళితులు చావాలని జగన్ రెడ్డి కుట్ర అని పిల్లి మాణిక్యాలరావు విమర్శించారు.

*రైతుల మెడకి ఉరి తాడు బిగిస్తున్నా జగన్: లోకేష్
జగన్ మోసపు రెడ్డి చేసిన ప్రతి మోసాన్ని బయటపెడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాడు టీడీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని.. అవాస్తవ ప్రచారం చేసిన జగన్‌రెడ్డి.. నేడు రైతుల మెడకి మీటర్ల రూపంలో ఉరి తాడు బిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవెర్చలేదని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని, వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందని నారా లోకేష్ ధ్వజమెత్తారు.

*ఉద్యోగులకు ప్రతి ఒక్కటీ మంచే చేస్తున్నాం: Jagan
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే అల్లర్లు చేశారని.. దళిత, బీసీ నేతల ఇళ్లపై దాడులు చేయడం సబబేనా?అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. నేడు శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో సామాజిక న్యాయానికి అర్ధం చెప్పామన్నారు. ఉద్యోగులను తాము కలుపుకుని పోతుంటే… వారిని కూడా రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఉద్యోగులకు ప్రతి ఒక్కటీ మంచే చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా… వైసీపీ ఎదుర్కొంటుందన్నారు. కోనసీమలో రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. మీరు పెట్టిన బకాయిలను తాము తీర్చినందుకా? లేదంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకా? అని నిలదీశారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలవాలంటే.. వారికి మంచి విద్యను అందించాలని సీఎం జగన్ కోరారు.

*బీజేపీ సర్కార్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి: Sailajanth
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే వెనక్కు తీసుకుని… బీజేపీ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నిందలు మోపుతూ బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. సోనియా, రాహుల్ గాంధీలపై ఎఫ్‌ఐఆర్ కూడా లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు.

*Kodali Nani ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మాజీ ఎమ్మెల్యే అయిపోతావ్: Matta Prasad
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి పై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను కృష్ణా జిల్లా బీజేపీ నేతలు ఖండించారు. ఈ సందర్బంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు మట్టా ప్రసాద్ గుడివాడ లో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కొడాలి నాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మాజీ ఎమ్మెల్యే అయిపోతావని హెచ్చరించారు. పురందేశ్వరిపై పరుష పదజాలంతో మాట్లాడడం సరికాదన్నారు. తమ నాయకురాలు పురందేశ్వరికి, కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుడివాడలో రైల్వే ఫ్లై ఓవర్లు నిర్మించాలని పురందేశ్వరి ద్వారా కేంద్ర మంత్రికి 2020లో తాము స్వయంగా వినతిపత్రం ఇచ్చామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఆమె అడ్డుకోరన్నారు. రాజకీయ లబ్ధి కోసం అనవసర వివాదాల్లోకి పురందేశ్వరిని లాగితే సహించేది లేదన్నారు. గుడివాడలో ప్రజలకు దూరమైన కొడాలి నాని వ్యక్తిగత మైలేజ్ కోసమే పురంధేశ్వరిపై విష ప్రచారం చేస్తున్నారని మట్టా ప్రసాద్ మండిపడ్డారు.

*Jagan పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది: Tulasi Reddy
జగన్ మూడేళ్ల పాలనలో నవరత్నాలు నకిలీ రత్నాలుగా, రంగు రాళ్లుగా, గులక రాళ్ళుగా, గుండ్రాళ్ళుగా మారాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ మూడేళ్ల పాలనలో మంజూరైన ఇళ్లు 15.60 లక్షలు కాగా.. పూర్తి అయినవి కేవలం 60,783 మాత్రమేనని విమర్శించారు. మద్యం ద్వారా రాబోవు 12 ఏళ్లకు వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 9.62 శాతం వడ్డీతో రూ.8,300 కోట్లు అప్పు తీసుకుందన్నారు. దీంతో సమీప భవిషత్తులో కూడా మద్యపాన నిషేదం ఉండదని తేలిపోయిందన్నారు. ఇది మాట తప్పడం, మహిళలను నమ్మించి మోసగించడమేనన్నారు. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందన్నారు. ఆరోగ్య శ్రీ డబ్బులు రోగుల ఖాతాల్లో వేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశం మరిన్నీ చిక్కులు తెస్తుందన్నారు. రోగులు ముందుగా బిల్లులు చెల్లిస్తే తప్ప ఆసుపత్రులు అడ్మిట్ చేసుకోవని, దీని వల్ల సకాలంలో వైద్యం అందక రోగులు చనిపోతారన్నారు. పేద రోగుల పట్ల సీఎం జగన్ యమధర్మరాజుగా మారడం శోచనీయమని తులసి రెడ్డి అన్నారు.

*దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్‌దే విజయం: శ్రీనివాస్‌గౌడ్‌
సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో వంద శాతం విజయం సాధిస్తారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ ఆలోచనలతో దేశం బాగుపడుతుందని, అనేక మంది మేధావులు ఆలోచిస్తున్నారని తెలిపారు. గుడి పేరుతో బీజేపీ రాజకీయం చేసిందే తప్ప గుడిని కట్టి హిందుత్వాన్ని విస్తరించాలనే ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం సరైన నాయకత్వం లేదనే విషయం అందరికీ తెలుసన్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా ఎవరు వస్తారని దేశప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రధాని పదవి కోసం కేసీఆర్‌, కేంద్ర రాజకీయాల్లోకి రావడం లేదని, దేశప్రజలను చైతన్య పరచడానికి వస్తున్నారని ఓ ప్రశ్నకు శ్రీనివాస్‌గౌడ్‌ బదులిచ్చారు.

*కేంద్రం కక్ష సాధింపు చర్యలు: ఉత్తమ్‌
కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం రాహుల్‌ గాంధీ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో కాంగ్రెస్‌ నిర్వహించిన సత్యాగ్రహ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తోందన్నారు. నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించేందుకు సైతం పోలీసులు అనుమతించకపోవడం దారుణమన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసును బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తిరగదోడిందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు

*దేశంలోనూ కేసీఆర్‌దే విజయం: శ్రీనివాస్‌ గౌడ్‌
అన్ని రంగాల్లో విశేష నైపుణ్యం కలిగిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో వంద శాతం విజయం సాధిస్తారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణను ప్రయోగశాలగా తీసుకుని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లినట్టు.. దేశాన్ని కూడా అభివృద్ధివైపు నడిపించేలా కేసీఆర్‌ యోచిస్తున్నట్టు చెప్పారు.
అన్ని రంగాల్లో విశేష నైపుణ్యం కలిగిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో వంద శాతం విజయం సాధిస్తారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణను ప్రయోగశాలగా తీసుకుని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లినట్టు.. దేశాన్ని కూడా అభివృద్ధివైపు నడిపించేలా కేసీఆర్‌ యోచిస్తున్నట్టు చెప్పారు.

*రూ.168 కోట్లు తక్షణమే ఇవ్వండి: తెలంగాణ
నీటి వనరుల మరమ్మతు (రిపేర్‌), నవీకరణ (రెనొవేషన్‌), పునరుద్ధరణ (రిస్టోరేషన్‌) పథకం కింద కేంద్రం నుంచి విడుదల కావాల్సిన రూ.168 కోట్లను తక్షణమే ఇవ్వాలని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ (ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన) అమలుపై సోమవారం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ వర్చువల్‌ విధానంలో రాష్ట్రాలతో సమీక్ష జరిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 575 చెరువుల పనులు చేపట్టారు. రూ.459.17 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా ఇందులో కేంద్రం వాటా రూ.272.02 కోట్లు. ఇప్పటి వరకు కేంద్రం రూ.104.55 కోట్లు విడుదల చేసింది.

*2024లో బీజేపీ వస్తే..రాజ్యాంగాన్ని మార్చేస్తారు : సీపీఐ రామకృష్ణ
మూడేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హంద్రీనీవాతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేశారని, రైతులకు ఆయన చేసింది ఏమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఏ ఒక్క రైతుకు డ్రిప్‌ ఇచ్చింది లేదన్నారు. కనీసం దరఖాస్తు కూడా చేసుకోడానికి లేకుండా చేశాడని, ముఖ్యమంత్రి ఏ మోహం పెట్టుకుని అనంతపురం వస్తున్నాడో రైతులకు జవాబు చెప్పాలంటూ ప్రశ్నించారు. సోమవారం సీపీఐ ఆఫీ్‌సలో ఆ పార్టీ జిల్లాకార్యదర్శి జాఫర్‌, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌ ఇతర నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… హంద్రీనీవా ప్రాజెక్టు సామర్థ్యం 6 వేల క్యూసెక్కులకు పెంచి, 4 వేల క్యూసెక్కుల నీటిపారుదల సౌకర్యంతో సమాంతర కాలువ తవ్వి 10 వేల క్యూసెక్కుల నీటిని అందిస్తామని గతంలో జగన మాట ఇచ్చాడన్నారు. ఈ మూడేళ్లలో సీఎం జగన్‌ పిల్ల కాలువ కూడా తవ్వలేకపోయాడంటూ మండిపడ్డారు. సమావేశంలో సహాయకార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి, శింగనమల కార్యదర్శి నారాయణస్వామి పాల్గొన్నారు.

*మాకు వైఎస్‌తోనే అనుబంధం.. ఆయన కుటుంబంతో కాదు: కొండా సురేఖ
‘‘మా కుటుంబానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో మాత్రమే అనుబంధం ఉంది. ఆయన కుటుంబంతో ఎలాంటి అనుబంధం లేదు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వైఎస్‌ కుటుంబాన్ని ఏనాడు కలవలేదు’’ అని కాంగ్రెస్‌ తెలంగాణ నాయకురాలు కొండా సురేఖ స్పష్టం చేశారు. తాను గానీ, తన భర్త కొండా మురళీ గానీ ఈ స్థాయిలో ఉండటానికి వైఎస్‌ఆర్‌ పెట్టిన భిక్షేనని చెప్పారు. రాంగోపాలవర్మ దర్శకత్వంలో తెరకెక్కెతున్న కొండా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విజయవాడకు వచ్చారు. పోలీసు కంట్రోల్‌ రూం వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి ఆమె సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కొండా మురళీతోపాటు తాను పడిన ఇబ్బందులు, కష్టాలు ప్రజలకు కొన్ని మాత్రమే తెలుసని చెప్పారు. తమ ప్రేమ వివాహం నుంచి ఒక బలహీన వర్గానికి చెందిన నేతగా కొండా మురళీ పడిన కష్టాలు, ప్రభుత్వాలు చేసిన వేధింపులను ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో తమ కుమార్తె ఈ చిత్రాన్ని నిర్మించిందని కొండా సురేఖ తెలిపారు.

*APలో అరాచక పాలన నడుస్తోంది: నారా లోకేష్
ఏపీ (AP)లో అరాచక పాలన నడుస్తోందని టీడీపీ నేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రాష్ట్రంపై పడి ప్రజాధనం దోచుకుంటుంటే.. వైసీపీ (YCP) నేతలు గ్రామాలపై పడుతున్నారని మండిపడ్డారు. హిందూ దేవాలయాలపై వైసీపీ ముఠాలే దాడులు చేసి.. టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లాకు చెందిన చోటా వైసీపీ నేత వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో రూ.25కోట్ల విలువైన మరకత విగ్రహం బయటపడిందన్నారు. వైసీపీ బడా నేతల ఇళ్లల్లో ఇంకెన్ని పురాతన విగ్రహాలున్నాయో? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ వైసీపీ నేతలు.. నగలు, విగ్రహాలు ఎత్తుకెళ్లారని భక్తుల్లో అనుమానాలున్నాయని లోకేష్‌ తెలిపారు.

*ఏపీలో బీజేపీ బలంగా ఉంది: ఉండవల్లి
ఏపీలో బీజేపీ బలంగా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి తాను వ్యతిరేకం కాదని, ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకమని ప్రకటించారు. బీజేపీకి చెక్ పెట్టాలంటే ప్రతిపక్షాలు బలంగా ఉండాలన్నారు. దేశంలో ప్రతిపక్షం ఉండొద్దన్నది బీజేపీ విధానమని పేర్కొన్నారు. వ్యతిరేకించినవారిపై ఈడీ, సీబీఐ, ఐటీతో దాడులు చేయిస్తున్నారని ఉండవల్లి అరుణ్‌కుమార్ దుయ్యబట్టారు.

*దళితురాలు వెంకాయమ్మకు రక్షణ కల్పించాలి: టీడీపీ నేతలు
సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిందని తాడికొండ మండలం కంతేరు గ్రామ దళిత మహిళ వెంకాయమ్మపై కొందరు వైసీపీ నాయకులు ఇటీవల దాడి చేశారు. తనకున్న నాలుగున్నర సెంట్ల స్థలంలో మూడున్నర సెంటు ఆక్రమణకు గురికాగా.. న్యాయం కోసం చాలాకాలంగా వెంకాయమ్మ తహసీల్దార్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో విసిగెత్తిపోయిన ఆమె జగన్ పాలనలో ఏ సమస్యా పరిష్కారం కాదని బహిరంగంగానే చెప్పింది. దీంతో వైసీపీ నాయకులకు కోపం వచ్చి, ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డారు. నేపథ్యంలో వెంకాయమ్మకు వైసీపీ మూకల నుంచి రక్షణ కల్పించాలని ఎస్పీని కోరాతామని టీడీపీ నేతలు నక్కాఆనంద్ బాబు, తెనాలి శ్రావణ కుమార్ పేర్కొన్నారు. బాధితురాలిపైనే కేసు పెట్టడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. చలో కంతేరుకు వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. పంచాయతీ అనుమతి లేకుండానే వంగిపురంలో మట్టిని తవ్వుతున్నారని, అడిగినందుకు మహిళా సర్పంచిపై దాడి చేశారని గుర్తు చేశారు. తాము అధికారంలో ఉండగా ఏ రోజూ అక్రమాలకు పాల్పడలేదన్నారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తపుకుంటామని సవాల్ విసిరారు.

*రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ పూర్తి విఫలం: పరిటాల సునీత
రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… రైతు సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. తక్షణమే 1500 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు.

*రాష్ట్రపతి ఎన్నికను వైకాపా బహిష్కరించాలి: హర్షకుమార్‌
రాష్ట్రానికి మేలు చేయాలని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రపతి ఎన్నికను వైకాపా బహిష్కరించాలని, ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వేజోన్‌, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సమస్యలు పరిష్కరించుకోవచ్చని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికకు వైకాపా ఓట్లు కీలకమైనందున, దూరంగా ఉంటామని ఒక్క ప్రకటన చేస్తే చాలని, కేంద్రాన్ని డిమాండ్‌ చేయడానికి ఇదే బంగారం లాంటి అవకాశమన్నారు. కేసులకు భయపడి ఏమీ మాట్లాడకపోతే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినట్లేనన్నారు.