Politics

ముగ్గురూ ముగ్గురే…!

ముగ్గురూ ముగ్గురే…!

మంత్రి పదవి అంటే అదో మంత్రదండం. సద్వినియోగం చేసుకోవడం.. సమస్యలు పరిష్కరించుకోవడం.. ప్రజలకు చేయాల్సింది చేయడం.. వంటివి చేతిలో పని. కానీ, మన మాజీ మంత్రుల మూడేళ్ల కాలం ఎలా గడిచిందంటే.. అభివృద్ధిని వెనక్కి నెట్టేయడం, అడ్డొచ్చిన వారిని కొట్టేయడం, మట్టిని కొల్లగొట్టడం, ఆధిపత్య ధోరణి కోసం పాకులాడటం, చివరకు దుర్గమ్మ సొమ్మునూ కాజేయడం వంటి మూడు అక్రమాలు.. ఆరు అవినీతి పనులుగా ముగిసింది. పదవి పోయాక కూడా అవే గొడవలు.. ఘర్షణలతో రచ్చ సాగుతోంది.
పేర్ని నానీ.. ఏదేమైనా కానీ..

సుమారు రూ.12వేల కోట్లతో రూపుదిద్దుకోవాల్సిన బందరు పోర్టు ఉమ్మడి కృష్ణాజిల్లావాసుల దశాబ్దాల కల. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోర్టు నిర్మాణ పనులను ప్రభుత్వమే చేపట్టి పరుగులు తీయిస్తుందని నాటి మంత్రి పేర్ని నాని ప్రకటించారు. మూడేళ్లు ఆయన మంత్రిగా అధికారం చెలాయించినా అడుగు ముందుకు పడలేదు.

ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడిగా, జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మచిలీపట్నం ఖ్యాతిని దశదిశలా చాటిన డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో స్మారక భవనం నిర్మించాలన్న ఆలోచనకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఊపిరిపోశారు. స్మారక భవనంతో పాటు మ్యూజియం, యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఆంధ్రాబ్యాంకును విలీనం చేసుకున్న యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉన్నతస్థాయి అధికారులతో బాలశౌరి పలుమార్లు సంప్రదింపులు జరిపి సుమారు రూ.70 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిర్మాణ పనులకు మచిలీపట్నంలో రెండెకరాల భూమిని కేటాయించాలని ఆయన ఎప్పటినుంచో అధికారులను కోరుతున్నారు. కానీ, ఎంపీ మాటకు స్పందించే అధికారులే కరువయ్యారు. పేర్ని నాని తెరవెనుక చేస్తున్న రాజకీయమే ఇందుకు కారణం.

నాని ఆధిపత్య ధోరణి కారణంగానే మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో ఆయనకు పొసగడం లేదు. ఈ కారణంగానే మూడేళ్లపాటు పేర్ని నాని పాల్గొన్న ఏ కార్యక్రమానికీ అధికారులు ఎంపీని ఆహ్వానించలేదు. ఇదే విషయంపై ఇటీవల బాలశౌరి సైతం తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ నాయకులతో వేదిక పంచుకునే నాని సొంత పార్టీ ఎంపీతో వేదిక పంచుకోకపోవడం ఏమిటని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. బాలశౌరి ఫ్లెక్సీలను సైతం పట్టణంలో ఏర్పాటు చేయనివ్వకుండా నాని రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ వర్గీయులు విమర్శిస్తున్నారు. ఇటీవల జిల్లా ఆసుపత్రిలో సుమారు రూ.2 కోట్ల సీటీ స్కాన్‌ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. బెల్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెల్‌ సీఎండీ ఆనంది రామలింగం మాట్లాడుతూ ఎంపీ బాలశౌరి చొరవతో దీన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అదే వేదికపై ఉన్న పేర్ని నానీకి ఈ మాటలు రుచించలేదు. సభా మర్యాద అని కూడా చూడకుండా.. ఆసుపత్రి అభివృద్ధికి ఎంపీ చాలా చేశారంటూ వ్యంగ్యంగా మాట్లాడి విసురుగా వెళ్లిపోయారు. సొంత నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ నిధులు తెస్తున్నా కలిసిరాకుండా రాజకీయాలు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేశ్‌ విషయంలోనూ పేర్ని నాని ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారన్న విమర్శ ఉంది. దీనిపై మంత్రి అనుచరులు గుర్రుగా ఉన్నారు.

మచిలీపట్నం అభివృద్ధికి సొంత పార్టీ ఎంపీ తీసుకుంటున్న చొరవను సైతం రాజకీయం చేస్తున్న నానీపై ఆ పార్టీ నాయకులే గుర్రుగా ఉన్నారు. దీంతో అనుచరగణం ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, ముడా చైర్మన్‌ పీఠాలపై మహిళలను కూర్చోబెట్టి కీలుబొమ్మలను చేశారు. అంతా కుమారుడు పేర్ని కిట్టు కనుసన్నల్లోనే నడిపిస్తున్నారన్నది సొంత పార్టీ నుంచి వినిపించే ఆరోపణ. తన కొడుకు రాజకీయ ఎదుగుదలే లక్ష్యంగా నాని అడుగులు ఉంటున్నాయి. దీంతో పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి హయాం నుంచి ఉంటున్న వారు సైతం ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు.

కొడాలి నానీ.. ఉత్త హామీ..
మూడేళ్లు మంత్రిగా ఉన్న కొడాలి నాని సొంత నియోజకవర్గం గుడివాడకు చేసింది శూన్యం. పేకాట శిబిరాలు, కేసినోల నిర్వహణతో నిత్యం గుడివాడను వార్తల్లో నిలిచేలా చేయడం, ప్రతిపక్ష పార్టీ నాయకులపై బూతులతో విరుచుకుపడటం తప్ప మంత్రిగా ఒక్క అభివృద్ధి పనిపైనా నాని దృష్టి పెట్టలేదు. గుడివాడ అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మూడేళ్ల సమయంలో ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు. గుడివాడ బస్టాండ్‌ ఆధునికీకరణదీ అదే దారి. గుడివాడ-కానుకొల్లు రహదారి, దొండపాడు-కుదరవల్లి రహదారి పనుల విషయంలోనూ అదే జరిగింది.

వెలంపల్లి.. అన్నింటికీ లొల్లి..
మూడేళ్లు మంత్రిగా ఉన్న వెలంపల్లి శ్రీనివాసరావు కూడా సొంత ఇంటిని చక్కదిద్దుకునేందుకు పెట్టిన దృష్టి పశ్చిమ నియోజకవర్గంపై పెట్టలేదు. దేవదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వెలంపల్లి ఇంద్ర కీలాద్రిపై అక్రమాలను పెంచి పోషించారు. అమ్మవారి వెండి సింహాల మాయం, ఎలాంటి నిర్మాణాలు చేయకుండానే నిధులు స్వాహా చేయడం వంటి వాటితో ప్రతిష్టను దిగజార్చారు. కరోనా కాలంలో తన అనుచరులతో ఆసుపత్రి బెడ్ల మొదలు మందుబిళ్లల వరకు ఆయన చేయని అక్రమాలు లేవు. వెలంపల్లి వద్ద ఓఎస్‌డీగా చేసిన అశోక్‌, ఆయన మామ కాశీరావు చేసిన కబ్జాకాండకు ఓ కుటుంబం రోడ్డున పడింది.