WorldWonders

ఎడిటర్‌కి ఎనిమిదేళ్ల జైలు!.. రెండేళ్లకే పేపర్‌ మూత!!

ఎడిటర్‌కి ఎనిమిదేళ్ల జైలు!.. రెండేళ్లకే పేపర్‌ మూత!!

‘జాతీయవాదం అనే మహా సౌధ నిర్మాణంలో భారతీయ పత్రికారంగం ప్రధానమైన, ప్రతిష్టాత్మకమైన పాత్రను నిర్వహించింది’ అన్నారు, స్వాతంత్య్రోద్యమ కాలం నాటి న్యాయ నిపుణుడు తేజ్‌ బహదుర్‌ సప్రూ. కాలానికి ఆధునికతనీ, చైతన్యాన్నీ అద్దిన చరిత్ర పత్రికలకు ఉంది. ప్రలకు కొత్త దృష్టిని ప్రసాదించడం, కదిలించడం వాటి సహజ లక్షణం. ఉద్యమాల చరిత్రలో కనిపించే ప్రజాసమూహాల అడుగులన్నీ పత్రికారంగం చూపిన దారి వెంట పడినవే. భారత స్వరాజ్య సమరంలోను ఆ జాడలు కనిపిస్తాయి.

జాతీయభావమే భారతీయులందరిని స్వాతంత్య్రం అనే లక్ష్యం వైపు నడిపించింది. మాతృభూమిని విదేశీ పాలన నుంచి తప్పించడానికి స్వాతంత్య్రోద్యమం అనివార్యమన్న తాత్త్వికతనీ, ఏకాత్మతనూ తీసుకువచ్చినవి వార్తాపత్రికలు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లేని జాతి ప్రతిభ, సృజన, ఘనతరగతాలకు రాణింపు ఉండదని, ప్రపంచపటంలో స్థానం ఉండదని హెచ్చరించినవీ పత్రికలే.

స్వయం పాలనే ఆధునిక ప్రాపంచిక చింతన అని తెలియచెప్పినవీ అవే. ప్రజాళిని బానిసత్వం నుంచి బానిసత్వానికి కాకుండా, భవిష్యత్తులోకి పత్రికలు నడిపించాయి. ఎన్నో నిర్బంధాల మధ్య ఇలాంటి ఒక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించినందుకే స్వాతంత్య్రోద్యమ చరిత్రలో పత్రికలకు కూడా ప్రముఖ స్థానం ఇస్తారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, జాతీయ కాంగ్రెస్‌ స్థాపన ఘట్టాలతో రాజకీయ ఐక్యతను సూచించే వాతావరణం దేశంలో ఏర్పడింది. ఆ భూమికతోనే పత్రికలు పుట్టుకు వచ్చాయి. బెంగాల్‌ విభజన నుంచి జనించిన జాతీయభావం వాటికి పదును పెట్టింది.

*తొమ్మిది దశాబ్దాల అణచివేత
బ్రిటిష్‌ ఇండియాలో వార్తాపత్రికల ఉనికి, లేదా భారత స్వాతంత్య్ర సమరంలో వార్తాపత్రికల పాత్ర ఏ విధంగా పిలుచుకున్నా, అది తొమ్మిది దశాబ్దాల అణచివేత చరిత్ర. 1858–1947 మధ్య ఊపిరాడని తీరులోనే వాటి మనుగడ సాగింది. వలసదేశంలో వార్తాపత్రిక అంటే, ఉద్యమాలకు ఊపిరినిస్తూనే, తన ఊపిరి నిలిచిపోకుండా చూసుకుంటుంది. పత్రిక బ్రిటిష్‌ జాతీయుడిదైనా, భారతీయుడిదైనా ప్రభుత్వాలను వ్యతిరేకిస్తే బతికి బట్టకట్టలేదు. భారతదేశంలో పుట్టిన తొలిపత్రిక జనన మరణాలు ఇదే చెబుతున్నాయి. ఇంతకీ ఇదంతా అంతకు ముందు ఏడున్నర దశాబ్దాల పత్రికా రంగ అణచివేతకు కొనసాగింపే.

1780 జనవరి 29 న జేమ్స్‌ అగస్టస్‌ హికీ ‘బెంగాల్‌ గెజెట్‌’ అనే రెండు పేజీల వారపత్రికను ప్రారంభించాడు. ‘కలకత్తా జనరల్‌ అడ్వైజర్‌’ అని కూడా ఆ పత్రికకు పేరు. ఆంగ్లేయుడు భారతదేశంలో ఆరంభించిన ఈ తొలి పత్రిక, తొలి గవర్నర్‌ జనరల్‌ వారన్‌ హేస్టింగ్స్, ప్రధాన న్యాయమూర్తి సర్‌ ఎలిజా ఇంపే మీద ద్వేష పూరిత విమర్శలు కురిపించింది. ప్రధాన న్యాయమూర్తి మీద విమర్శలు సహించబోమని ఈస్టిండియా కంపెనీ బెదిరిస్తే, ఏకంగా ఆయన భార్య మీదే రాశాడు హికీ. ఎనిమిదేళ్లు కారాగారం, రూ. 2000 జరిమానా విధించారు. 1782లో పత్రిక మూతపడింది. హికీ నుంచి రాజా రామమోహనరాయ్‌ కాలం (1826) వరకు భారతీయ పత్రికారంగానిది నిజానికి సంఘర్షణ ధోరణి కాదు. అయినా నిర్బంధమే ప్రాప్తమైంది. పత్రికలకు కొంచెం స్వేచ్ఛ కావాలని రామమోహన్‌రాయ్‌ సుప్రీంకోర్టుకు వినతిపత్రం ఇచ్చారు.

*మనవాళ్లు దిగారు
1851 నుంచి 1900 వరకు సాగిన యుగంలో పత్రికల కదలిక కొంచెం సుస్పష్టంగా ఉంది. జాతీయభావాల వ్యాప్తికి ఒక భూమిక సిద్ధమవుతున్న జాడలు కనిపిస్తాయి. ప్రజలకు, ప్రభుత్వానికి వార్తాపత్రికలు వారథిగా వ్యవహరిం చాయి. భారతదేశ స్థితిగతులు, పాలకుల ధోరణి ప్రజలకు అర్థం కావడానికి ఈ యుగంలోని పత్రికలే దోహదం చేశాయి. ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ (రాబర్ట్‌ నైట్‌), ‘ది స్టేట్స్‌మన్‌’ (రాబర్ట్‌ నైట్‌), ‘ది ట్రిబ్యూన్‌’ (సర్దార్‌ దయాళ్‌సింగ్‌ మజీథియా) ‘బాంబే క్రానికల్‌’ (ఫిరోజ్‌షా మెహతా), ‘వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ (దాదాభాయ్‌ నౌరోజీ), ‘సుధాకర’ (గోపాలకృష్ణ గోఖలే), ‘కేసరి’, ‘మరాట్టా’ (బాలగంగాధర తిలక్‌), ‘ది హిందు’, ‘స్వదేశమిత్రన్‌’ (జి.సుబ్రహ్మణ్య అయ్యర్‌), ‘బెంగాలీ’ (సురేంద్రనాథ్‌ బెనర్జీ), ‘వందేమాతరం’ (సుబోధ్‌చంద్ర మాలిక్, చిత్తరంజన్‌ దాస్, బిపిన్‌ చంద్రపాల్‌), ‘అమృత్‌ బజార్‌ పత్రిక’ (శిశిర్‌కుమార్‌ ఘోష్‌), ‘హరిజన్‌’, ‘యంగ్‌ ఇండియా’ (గాంధీ) వంటి పత్రికల్ని ఈ సమయంలోనే నెలకొల్పారు.

*అరవిందుడు, మదన్‌ మోహన్‌ మాలవీయ, మోతీలాల్‌ నెహ్రూ, అబుల్‌ కలాం ఆజాద్, సుబ్రహ్మణ్య భారతి, సీవై చింతామణి, కోటంరాజు పున్నయ్య, కోటంరాజు రామారావు, ఎం.చలపతిరావు, కుందూరి ఈశ్వరదత్‌ వంటివారు కూడా అటు స్వరాజ్య సమరయోధులుగా, ఇటు పత్రికా రచయితలుగా ద్విపాత్రాభినయం చేసినవారే. అంటే, స్వాతంత్య్రోద్యమ రథసారథులంతా దాదాపు పత్రికా రచయితలే. లేదా పత్రికాధిపతులు.