Politics

విపక్షాల్లో చీలిక..! కేసీఆర్ బాటలో క్రేజీవాల్

విపక్షాల్లో చీలిక..! కేసీఆర్ బాటలో క్రేజీవాల్

రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశరాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు… కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది.తాము నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని.. కాంగ్రెస్‌, దాని మిత్రాలను కోరనుంది బీజేపీ. ఇందులో భాగంగా విపక్షాలతో చర్చల జరిపే బాధ్యతను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు అప్పగించింది. విపక్షాలు అభ్యర్థిని నిలబెట్టకుండా.. తాము నిలిపే అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరేందుకు సిద్ధమయ్యాయి. ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడే అభ్యర్థిని ప్రకటించకుండా.. మద్దతు ఇవ్వాలని కోరడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ఇదే సమయంలో.. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.. అందులో భాగంగా టీఎంసీ సుప్రీం, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. బీజేపీయేతర పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయగా.. విపక్షాల్లో చీలక స్పష్టంగా కనిపిస్తోంది.

హస్తినలో ఇవాళ మమతా బెనర్జీ నిర్వహించే సమావేశానికి… దూరంగా ఉండాలని ఇప్పటికే టీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.. ఆయన వెళ్లకపోవడమే కాదు.. ఆ పార్టీ నుంచి కూడా ఎవ్వరినీ పంపించడంలేదు.. కాంగ్రెస్‌ పార్టీని ఈ సమావేశానికి ఆహ్వానించడంతో.. ఆ పార్టీతో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టంలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీఆర్ఎస్‌ ప్రకటించింది. ఇక, ఆమ్‌ఆద్మీ పార్టీ చీప్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా కేసీఆర్‌ బాటలోనే పయనిస్తున్నారు.. దీదీ నిర్వహిస్తోన్న విపక్షాల భేటీకి హాజరుకావడంలేదని పేర్కొంది ఆప్‌.. దీంతో, దీదీ ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి ఏయే పార్టీల అధినేతలు వెళతారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.మమతా బెనర్జీ 22 పార్టీలకు ఆహ్వానాలు పంపితే… కొన్ని పార్టీలు మాత్రమే స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ తమ ప్రతినిధుల పేర్లను నిర్ణయించింది. ఇక, ఈ సమావేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే.. కాంగ్రెస్‌ లేకుండా ప్రతిపక్షం లేదన్న ఆయన.. విపక్షాల ఐక్యతను దెబ్బతీయకూడను అనే ఉద్దేశంతోనే మమతా బెనర్జీ నిర్వహిస్తోన్న సమావేశానికి వెళ్లనున్నట్టు తెలిపారు. మరోవైపు.. రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ వ్యవహారంలో మేం ఎవరి మద్దతు కోరలేదని స్పష్టం చేశారు ఖర్గే.. కాగా, ఇప్పటికే రెండు రోజుల పాటు రాహుల్‌ గాంధీని సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ.. ఇవాళ మూడో రోజు కూడా రాహుల్‌ను విచారించనున్నారు.