Movies

మిస్ ఇండియా పోటీల్లో రాజ‌శేఖ‌ర్ కుమార్తె.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకెవ‌రు ఉన్నారంటే..

మిస్ ఇండియా పోటీల్లో రాజ‌శేఖ‌ర్ కుమార్తె.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకెవ‌రు ఉన్నారంటే..

అందాల పండగొచ్చింది. ఈ సంవత్సరం కూడా ‘ఫెమినా’ ఆంగ్ల పత్రిక ఆధ్వర్యంలో మిస్‌ ఇండియా తొలిదశ పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ముద్దుగుమ్మలు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ప్రజ్ఞ అయ్యగారి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సాయి లిఖిత యలమంచిలి జాతీయ స్థాయికి వెళ్తున్నారు. సినీ హీరో రాజశేఖర్‌ కుమార్తె శివాని తమిళనాడు ప్రతినిధిగా అర్హత సాధించడం విశేషం. మిస్‌ ఇండియా కిరీటం కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 31 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఎవరో ఒకరు కిరీటం ధరిస్తారు. ఆ ఒక్కరే ప్రపంచ సుందరి పోటీలకు వెళ్తారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రజ్ఞ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ స్టూడెంట్‌. ‘ఫ్యాషన్‌ రంగం మీద మక్కువతో ఇక్కడి దాకా వచ్చాను. నా విజయం ఎందరికో స్ఫూర్తినిస్తుంది’ అంటారామె. ఆంధ్రా సుందరి సాయి లిఖిత ఎంబీబీఎస్‌ చేశారు. అందాల ప్రపంచం మీద ఇష్టంతో ఫెమినా పోటీల్లో పాల్గొన్నారు. ‘నటిగా, వ్యక్తిగా నాకు ప్రియాంక చోప్రా స్ఫూర్తి. ఆమెది బలమైన వ్యక్తిత్వం’ అని చెబుతున్నారు లిఖిత. మెడిసిన్‌ చదువుతూనే సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శివాని ఓ సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. ఈ పోటీలో బహుమతి రూపంలో వచ్చే డబ్బును జంతు హింసకు వ్యతి రేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినియోగిస్తానని చెబుతున్నారు. ముగ్గురిలో ఏ ఒక్కరికి కిరీటం దక్కినా.. రెండు రాష్ట్రాలకూ సంబరమే.