Politics

ఆ రూ.2,907 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి’ – TNI రాజకీయ వార్తలు

ఆ రూ.2,907 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి’  – TNI రాజకీయ వార్తలు

* వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత దేవినేని ఉమా మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలను అడ్డం పెట్టుకొని భారీ అవకతవకలు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.2,907 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని దేవినేని ఉమా ప్రశ్నించారు.రైతు భరోసా కేంద్రాలను అడ్డం పెట్టుకొని భారీ అవకతవకలు, అవినీతికి పాల్పడుతూ.. వైకాపా సర్కార్ రైతుల గొంతు కోస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నందిగామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రైతు నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఉమా.. రైతుల పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.రైతు బోగస్ కేంద్రాలు చేసిన పాపాలకు సమాధానం చెప్పలేక అగ్రికల్చరల్ ఆఫీసర్లు ఫోనులు కట్టేస్తున్నారని దేవినేని ఉమా విమర్శించారు.ప్రభుత్వం విడుదల చేసిన రూ.2,907 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని దేవినేని ఉమా ప్రశ్నించారు. ఎవరెవరి ఖాతాల్లో పడ్డాయో.. మొత్తం వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. క్రాప్ బుకింగ్, పంటల బీమా చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఈ క్రాప్ నుంచి 20 లక్షల మంది రైతులను ఏ లెక్కన తొలగించారో చెప్పాలన్నారు.అగ్రికల్చర్, రెవెన్యూ ఆఫీసర్లను నామమాత్రం చేసి.. సలహా మండలి పేరుతో వైకాపా నాయకుల ఆధ్వర్యంలో రైతులను దోపిడి చేస్తున్నారని దేవినేని దుయ్యబట్టారు. వాలంటీర్లు ఇచ్చిన లిస్టు మాత్రమే అగ్రికల్చర్ ఆఫీసర్లు పైకి పంపిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెదేపా హయాంలో రూ.7,500 కోట్ల మొత్తాన్ని వివరాలతో సహా చంద్రబాబు అసలైన రైతులకు అందించారని గుర్తు చేశారు.

* అందుకే KCR కొత్త పార్టీ ఆలోచన: Jagadish Reddy
దేశాభివృద్ధిలో జాతీయ పార్టీలు విఫలం అయినందునే సీఎం కేసీఆర్ కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితి పార్టీగా మారే అంశంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు దేశ భవిష్యత్తుకు సరైన పునాదులు వేయలేకపోయాయని, సహజవనరులు ఉన్నా ఉపయోగించుకోలేని దుస్థితికి దేశాన్ని తీసుకొచ్చాయని విమర్శించారు. బీజేపీ పాలన దేశాన్ని మధ్యరాతి యుగం వైపు తీసుకెళ్తుండగా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ విఫలమైందన్నారు. దేశంలో రోజురోజుకి పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో దేశాభివృద్ధికి ప్రత్యామ్నాయ అజెండా కావాలన్నారు. ప్రత్యామ్నాయ అజెండా తీసుకొచ్చే శక్తుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, కొత్త తరానికి కొత్త ఎజెండాతో కేసీఆర్ రాబోతున్నారని అన్నారు. ఎనిమిదేళ్ళలో తెలంగాణా రూపురేఖల్ని మార్చినట్లుగానే కొత్త తరానికి కొత్త అజెండాతో కేసీఆర్ రాబోతున్నారన్నారు. త్వరలోనే దేశ రూపురేఖల్ని మార్చే అజెండా కేసీఆర్ ప్రకటిస్తారని అన్నారు. కేసీఆర్ ఎజెండా నచ్చితే ప్రజలు ఆశీర్వదిస్తారని, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

*రాజ్యసభ చైర్మన్ Venkaiahను కలిసిన విజయసాయిరెడ్డి
రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుతో కామర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ విజయసాయి రెడ్డి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సదర్భంగా కామర్స్ స్థాయి సంఘం నివేదికలను విజయసాయి సమ్పరించనున్నారు. అనంతరం…. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ పర్యాటక స్థాయి సంఘం నివేదికల ప్రజంటేషన్‌ను ఇవ్వనున్నారు. ఈ నెలాఖరుతో రాజ్యసభ పదవీ కాలం ముగియనుండటంతో ఇప్పటి వరకు చర్చించిన అంశాలపై నివేదికలను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడికి టీజీ వెంకటేష్ అందించనున్నారు.

*అర్హులకు బీమా పరిహారం ఇవ్వాలి: Tulasi reddy
పంటల భీమా పథకం కింద రాష్ట్రంలోని అనేక మంది రైతులకు పరిహారం అందకపోవడం దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… 29 లక్షల మంది రైతులు అర్హులు కాగా.. 15.6 లక్షల మందికి మాత్రమే మంజూరు అయ్యిందన్నారు. లక్ష మంది రైతుల ఖాతాల్లో డబ్బు పడలేదని తెలిపారు. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో రైతులు ధర్నాలు చేశారని, గ్రామ సచివాలయాలకు తాళాలు వేశారని అన్నారు. పులివెందుల పరిధిలో మామిడికి నష్టం.. పరిహారం అందలేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో మిర్చికి నష్టం.. పరిహారం అందలేదన్నారు. ప్రభుత్వం పునరాలోచించి అర్హులకు బీమా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోనసీమ, కె.సి.కెనాల్ రైతులు విరామం ప్రకటిస్తే సీఎం జగన్ ప్రతిపక్షాలపై నింద వేస్తున్నారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

*దేశంలో వ్యవసాయ స్వరూపం మారాలి:మంత్రి Niranjan reddy
దేశ వ్యవసాయ స్వరూపం మారాలని, యాంత్రీకరణ, సాంకేతికతను సంపూర్ణంగా అమలు చెయ్యాలని తద్వారా రైతుల ప్రయోజనాలుకాపాడేందుకు వీలుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.వ్యవసాయ, ఉద్యాన రంగాలలో నూతన ఆవిష్కరణలు, సాంకేతికతతో యువతకు ఉపాధి లభించాలని అన్నారు. దీనిమూలంగా వ్యవసాయరంగంలో యాంత్రీకరణ అందుబాటులోకి రావడమే కాకుండా, రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిడోరియంలో నిర్వహించిన “అధిక సాంద్రతతో పత్తి సాగుపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన సదస్సు”లో మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగులో నూతన శకానికి నాంది పలికాం, సాంప్రదాయ సాగునుండి ప్రపంచ సాంకేతికతను తెలంగాణ వ్యవసాయానికి అన్వయించుకోవాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని అన్నారు.మనకున్న వ్యవసాయాన్ని ఉజ్వలమైన వ్యవసాయంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.కేవలం అధిక మోతాదులో పంటలు పండించడమే కాదు. అవసరమైన పంటలు, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు, రైతుకు రాబడినిచ్చే పంటలు పండించాలని నిర్ణయించామన్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించి రాష్ట్ర ఆదాయం, దేశ ఆదాయం పెంచేలా తెలంగాణ వ్యవసాయం ముందుకుసాగాలని కోరారు.మూడేళ్లుగా రైతులను అప్రమత్తం చేస్తున్నాం.జిల్లాల వారీగా సదస్సులతో ఏ పంటలు వేయాలి అన్న విషయాన్ని రైతులకు వివరించాం. రైతులు కూడా పంటల వైవిద్యీకరణకు సానుకూలంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రపంచ అవసరాలకు సరిపడా పత్తి ఉత్పత్తి కావడం లేదు. ప్రపంచంలో పత్తి అత్యధికంగా సాగయ్యేది భారతదేశంలోనే అని చెప్పారు.3.20 కోట్ల ఎకరాలలో దేశంలో పత్తి సాగు అవుతున్నది. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాలలో తెలంగాణ, గుజరాత్ లు ఉన్నయననారు.ఈ సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

*ఆ విషయంలో జగన్‌దే నిర్ణయం: విజయసాయి రెడ్డి
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో.. జగనే ఒక నిర్ణయం తీసుకుంటారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని.. కామర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. కామర్స్‌ స్థాయి సంఘం నివేదికలను సమర్పించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో.. జగనే ఒక నిర్ణయం తీసుకుంటారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెట్‌ కామర్స్‌స్థాయిసంఘం ఛైర్మన్‌గా ఉన్న విజయసాయిరెడ్డి.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడిని కలిసి.. నివేదిక సమర్పించారు. పర్యాటక స్థాయి సంఘం నివేదికల ప్రజంటేషన్ను టీజీ వెంకటేశ్ సమర్పించారు.రాహుల్గాంధీ ఈడీ విచారణ కేంద్రం కక్ష సాధింపు కాదన్నారు. కర్మ సిద్ధాంతంతో పాటూ చేసిన పాపాలు అనుభవించాల్సిందేనన్నారు. కేంద్రం కక్షసాధింపు చేయట్లేదని.. సుబ్రహ్మణ్యస్వామి పిల్ పైనే విచారణ జరుగుతోందని అన్నారు.

*క్రాప్ ఇన్సూరెన్స్ రైతుల కోసమా?…మీ పార్టీ నేతల కోసమా?: Devineni
జగన్ సర్కార్ తీసుకువచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకంపై మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni uma) పలు వ్యాఖ్యలు చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘క్రాప్ ఇన్సూరెన్స్ పథకం రైతుల కోసమా?. మీ పార్టీ నేతల కోసమా?. పంటల భీమా చెల్లింపుల్లో అన్నీ అవకతవకలే. వైసీపీ నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా సాగుతున్న వ్యవహారం. లక్షల మంది అసలు రైతులకు అందని పరిహారం. రైతులకు దక్కాల్సిన కోట్లాది రూపాయలను మీ నేతలు ధీమాగా కొల్లగొడుతున్నారంటున్న రైతులకు ఏం సమాధానం చెప్తారు? సీఎం జగన్’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.

*రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయి: దాసోజు శ్రవణ్
రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని.. దీనిపై కఠినంగా వ్యవహరించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. మైనర్లపై అత్యాచారాలకు మూడు వారాల్లోగా శిక్ష పడాలని.. ఫాస్ట్ ట్రక్ కోర్టులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీలో 56 రోజుల్లోనే శిక్ష విధించారన్నారు. ఇక్కడ కూడా నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం రావాలన్నారు. మహిళా పొలీస్ స్టేషన్లను పెంచాలన్నారు. స్ట్రీట్ లైట్లు ఉంచాలని.. బహిరంగ కాలకృత్యాలు లేకుండా చూసుకోవాలన్నారు. డ్రగ్స్, మద్యం అరికట్టాలన్నారు. మహిళల రక్షణ కోసం ఒక ప్రత్యేక కార్యచరణ తయారు చేద్దామని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.

*ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్య: Ponnam
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి భయం పుట్టినప్పుడల్లా గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీలదన్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. ముంబై ఎయిర్పోర్టును ఆధానికి అప్పగించడానికి సీబీఐని ఉపయోగించుకున్నారా? లేదా..? అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకులను బీజేపీ… సీబీఐ, ఈడీతో అణిచివేసే ప్రయత్నం చేస్తోందని పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

*నాడు ముద్దులు-నేడు గుద్దులు: దేవినేని ఉమా
ఏపీలో బాదుడు ప్రభుత్వం పరిపాలిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ఓ ప్రకటనలో అన్నారు. నాడు ముద్దులు-నేడు గుద్దులు.. ఇదే జగన్ పాలన అని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్క చాన్స్‌ అంటూ ప్రజలను జగన్‌రెడ్డి మోసం చేశారన్నారు. ఇసుక ధరలు భారీగా పెంచి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని చెప్పారు. ఏపీలో విద్యుత్‌ కోతలతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారని దేవినేని ఉమా తెలిపారు.

*అమిత్ షా సభకు మించి..Bandi Sanjay
తుక్కుగూడ అమిత్ షా సభకు మించి ప్రధాని మోదీ సభ ఉంటుందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆయన బీజేపీ పదాధికారుల సమావేశంలో మాట్లాడారు. ‘డబుల్ ఇంజిన్ సర్కారే లక్ష్యంగా జాతీయ నాయకత్వం మద్దతు ఇస్తుంది. తెలంగాణపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జులై 3న ప్రధాని మోదీతో‌ భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభ చరిత్రలో నిలిచిపోవాలి. సభను విజయవంతానికి భారీగా జనసమీకరణ చేయాలి. ఈ బాధ్యత పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇంచార్జులు తీసుకోవాలి. అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాదని..‌ కార్యవర్గ సమావేశాల ఏర్పాటుకు తెలంగాణకు ఇచ్చారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. సభ స్థలాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తాం. జిల్లా, మండల, పోలింగ్ బూత్ స్థాయి నుంచి ప్రతీ కార్యకర్త సభకు వచ్చేలా ప్రచారం చేయాలి.’’ అని సంజయ్ పేర్కొన్నారు.

*ఆ నోటీసుల వెనుక రాజకీయ కుట్ర ఉంది: Revanth Reddy
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా, రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపడం వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నష్టాల్లో ఉన్న పత్రికను నడిపే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుందని, ఆస్తుల బదలాయింపులో ఆర్థిక లావాదేవీలు జరగలేదని గతంలోనే ఈడీ తేల్చి చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. మూసేసిన కేసును మళ్ళీ తెరిచి సోనియా, రాహుల్ గాంధీకి ఈడీతో నోటీసులు ఇప్పించడం వెనక బీజేపీ కుట్ర ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళితే ఓడిపోతామనే భయం ప్రధాని మోదీకి ఉందన్నారు. విచారణ పేరుతో రాహుల్ గాంధీని ఈడీ కార్యాలయంలో రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలో ఉంచడం వేధించడమేనని పేర్కొన్నారు. సోనియా గాంధీ ఈడీ కార్యాలయంలో అడుగు పెట్టిన రోజే బీజేపీ పతనం ప్రారంభమవుతుందన్నారు. ప్రాణాలు అడ్డుపెట్టైనా రాహుల్ గాంధీకి జరిగే అవమానాలను అడ్డుకుంటామన్నారు. అవసరమయితే 23న ఢిల్లీ వెళ్లి ఈడీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.

*ఉద్యమం నాటి KCRకు.. ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా..: Etela
ఉద్యమం నాటి కేసీఆర్‌ (KCR)కు.. ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్అ న్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండాభూదేవి గార్డెన్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ 8 ఏళ్ళ ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఒకప్పుడు కేసీఆర్‌ టీవీలో కనబడితే యువత కేరింతలు కొట్టేవారని.. ఇప్పుడు చీదరించుకుంటున్నారని అన్నారు. తాను పార్టీ మారలేదని, టీఆర్‌ఎస్‌ వాళ్ళే వెళ్లగొట్టారన్నారు. రెచ్చగొడితే ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై చర్చకు సిద్ధమని అన్నారు. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరాలని చాలామంది ఎదురు చూస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు.

*సోనియా, రాహుల్‌పై కేసులతో మోదీ, షా పైశాచిక ఆనందం: సాకే
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఈడీతో కేసులు పెట్టించి వేధించడం ద్వారా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ విమర్శించారు. పార్టీ అగ్రనేతలపై ఈడీ కేసులకు నిరసనగా రెండో రోజైన మంగళవారం విశాఖలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై కూర్చుని పార్టీ నాయకులు తమ నిరసన తెలియజేశారు. అనంతరం శైలజానాథ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసి బీజేపీ నేతల వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నారు. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సలు కాంగ్రెస్‌ పార్టీపై కుతంత్రాలు పన్నుతున్నాయని, అందులో భాగంగానే ఈడీ నోటీసులు జారీ చేసిందన్నారు. ఐపీఎల్‌లో గుజరాత్‌ టీమ్‌ గెలిచిందని, దీనిపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని, ఈ వ్యవహారంపై సిట్‌ వేయాలన్నారు.

*పోలీస్‌ శాఖ స్థలం వైసీపీకా?: వర్ల
‘తిరుపతి నగరాన్ని ఆనుకొని ఉన్న చంద్రగిరిలో పోలీస్‌ శాఖ స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి రహస్యంగా ఇచ్చారు. పోలీస్‌ శాఖకు కేటాయించిన స్ధలాన్ని వైసీపీకి ఇవ్వడం ఏమిటి? అక్కడ ఒక ఎకరం ఖరీదు రూ. 30 కోట్లు ఉంటుంది. చీకటి జీవోలతో విలువైన స్ధలాలను వైసీపీ కొట్టేస్తోంది’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. మంగళవారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తక్షణం ఈ కేటాయింపును రద్దు చేసి భూమిని తిరిగి పోలీస్‌ శాఖకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

*పాఠశాలల విలీనం పేరుతో పోస్టులు రద్దు చేస్తారా?: జవహర్‌
ఆంధ్రప్రదేశ్‌లో టీచర్‌ పోస్టుల భర్తీకి దిక్కులేక నిరుద్యోగులు తెలంగాణ దారి పట్టాల్సి వస్తోందని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఏటా భర్తీ చేస్తామని జగన్‌ రెడ్డి పాదయాత్రలో పదే పదే చెప్పారు. ఇప్పుడు ఆ విషయమే గుర్తు లేన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలల విలీనం పేరుతో ఖాళీ పోస్టులు మొత్తం రద్దు చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. తెలుగు మాధ్యమం కూడా ఉంటే టీచర్లు ఎక్కువ మంది కావాలని తెలుగు మీడియాన్నే ఎత్తేశారు. ప్రాధమిక పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయునితో సరిపెడుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టులు తీసేస్తున్నారు. పాఠశాలలు ఎటు పోయినా ఫర్వాలేదన్నట్లుగా ఆయన వ్యవహారం ఉంది’ అని జవహర్‌ ఆరోపించారు.

*పాలేరు నుంచి షర్మిల పోటీ
వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారని పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి బీరవెల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తున్నందున ఈనెల 19న నేలకొండపల్లిలో పాలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా పాలేరు నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రె్‌సకు పట్టున్న స్థానం. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం నాయకులదే ఆధిపత్యం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్‌ రెడ్డి గెలుపొందారు. గిరిజన ఓటు బ్యాంకు అధికంగా ఉండడం.. ఆయా గ్రామ రాజకీయాలు రెడ్డి సామాజికవర్గం నేతల చేతిలో ఉండడం, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రె్‌సకు కంచుకోటగా ఉండడం, రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం కాంగ్రె్‌సకు బలమైన నాయకుడు లేకపోవడం లాంటి అంశాలు తమకు కలిసొస్తాయన్న ఉద్దేశంతో షర్మిల పాలేరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి తోడు టీఆర్‌ఎ్‌సలోని వర్గ విభేదాలు కూడా తమకు లాభిస్తాయని షర్మిల పార్టీ భావిస్తోంది.

*బీఆర్ఎస్‌తో కేసీఆర్‌కు వీఆర్ఎస్: తరుణ్ చుగ్
బీఆర్ఎస్‌తో కేసీఆర్‌కు వీఆర్ఎస్ తప్పదని బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. మోదీకి ప్రత్యామ్నాయంగా తనకు తాను కేసీఆర్ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. ‘‘ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కనటంలో తప్పు లేదు. మమత, పవార్ , ములాయం లాంటి వారి జాబితాలో కేసీఆర్ చేరక తప్పదు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. బీజేపీ అధికారంలోకి రావటం‌ ఖాయం. 119 నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులు రెడీగా ఉన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత తెలంగాణలో పరిస్థితులు వేగంగా మారతాయి.’’ అని చెప్పారు.

*మూడేళ్లలో ఒక్కసారైనా నిర్వహించారా?: Ex minister Jawahar
మాజీ మంత్రి జవహర్‌ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మాట తప్పను… మడమ తిప్పను అన్న జగన్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాడని విమర్శించారు. మూడేళ్లలో డీఎస్సీ ఒక్కసారి కూడా నిర్వహించలేదన్నారు. గతంతో పోలిస్తే పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. ఈ ఉత్తీర్ణతను గుజరాత్‌‌తో పోల్చుకోవడం అవివేక మన్నారు. తక్కువ వచ్చిన వారి కంటే ఎక్కువ వచ్చిన వారితో పోల్చుకోవాలన్నారు. కొన్ని స్కూళ్లు హెడ్‌ మాస్టర్, పీఈటీ లేకుండా నడుస్తున్నాయన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 4,672 పోస్టులను రద్దు చేశారని, ఉపాధ్యాయ సంఘాలు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి జగన్‌పై పోరాడాలని సూచించారు.

*Jagan పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది: Tulasi Reddy
జగన్ మూడేళ్ల పాలనలో నవరత్నాలు నకిలీ రత్నాలుగా, రంగు రాళ్లుగా, గులక రాళ్ళుగా, గుండ్రాళ్ళుగా మారాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ మూడేళ్ల పాలనలో మంజూరైన ఇళ్లు 15.60 లక్షలు కాగా.. పూర్తి అయినవి కేవలం 60,783 మాత్రమేనని విమర్శించారు. మద్యం ద్వారా రాబోవు 12 ఏళ్లకు వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 9.62 శాతం వడ్డీతో రూ.8,300 కోట్లు అప్పు తీసుకుందన్నారు. దీంతో సమీప భవిషత్తులో కూడా మద్యపాన నిషేదం ఉండదని తేలిపోయిందన్నారు. ఇది మాట తప్పడం, మహిళలను నమ్మించి మోసగించడమేనన్నారు. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందన్నారు. ఆరోగ్య శ్రీ డబ్బులు రోగుల ఖాతాల్లో వేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశం మరిన్నీ చిక్కులు తెస్తుందన్నారు. రోగులు ముందుగా బిల్లులు చెల్లిస్తే తప్ప ఆసుపత్రులు అడ్మిట్ చేసుకోవని, దీని వల్ల సకాలంలో వైద్యం అందక రోగులు చనిపోతారన్నారు. పేద రోగుల పట్ల సీఎం జగన్ యమధర్మరాజుగా మారడం శోచనీయమని తులసి రెడ్డి అన్నారు.