DailyDose

50% పెరిగిన నల్లధనం – స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంకు లెక్కిది

50% పెరిగిన నల్లధనం – స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంకు లెక్కిది

‘బీజేపీ అధికారంలోకి వస్తే, స్విస్‌ బ్యాంకుల్లో మూలుగుతున్న లక్షల కోట్ల నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతీ భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తాం. దేశంలో నల్లధనమే లేకుండా చూస్తాం’
– 2014, జనవరి 9న ఓ ఎన్నికల సభలో ప్రధాని మోదీ ప్రగల్భాలు ఇవి.

ప్రధాని వాగ్దానం బూటకమని స్పష్టమైపోయింది. నల్లధనాన్ని స్వదేశానికి తెచ్చే మాట దేవుడెరుగు.. కానీ, అదే స్విస్‌ బ్యాంకులో మన వాళ్ల నల్లధనం నిరుడు ఒక్క ఏడాదే 50 శాతం పెరిగి రూ. 30 వేల కోట్లకు చేరుకున్నది. స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ గణాంకాలతో ఈ విషయం రుజువైంది. ఇది కేవలం నిరుడు పెరిగిన లెక్క స్విస్‌ బ్యాంకులో భారీగా డిపాజిట్లు.

ఎన్నికలకు ముందు గొప్ప మాటలు మాట్లాడటంలో మోదీని మించిన వారు లేరు.. ఉండరు కూడా. యూపీఏ హయాంలో స్విస్‌ బ్యాంకులోకి కుప్పలు తెప్పలుగా నల్లధనం తరలివెళ్లిందని ఆ మొత్తాన్ని వెంటపడి తెచ్చి.. ఒక్కో బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేసేస్తామని ఎన్నికల ప్రచారంలో ఎక్కిన ప్రతి వేదికమీదా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక జన్‌ధన్‌ ఖాతాలు ప్రారంభించాలని పిలుపునిస్తే.. ఆ పదిహేను లక్షల కోసమేనేమోనని అంతా పొలోమని క్యూలు కట్టి మరీ ఖాతాలు ఓపెన్‌ చేశారు. తీరాచూస్తే.. బ్యాంకులో ఒక్కరూపాయి వెయ్యకపోగా డిజిటల్‌ చెల్లింపులంటూ.. పోపుల పెట్టెల్లో కూడా డబ్బులు లేకుండా చేశారు. పెద్దనోట్లను రద్దుచేస్తే.. నల్లధనం పోగొట్టడానికే అనుకొన్నారు.

కానీ, ఇవాళ స్విస్‌ బ్యాంక్‌ వెల్లడించిన లెక్కలు చూసి భారతదేశమే కాదు.. యావత్‌ ప్రపంచమే అవాక్కయింది. స్విస్‌బ్యాంకుల్లోకి మన వాళ్ల సొమ్ము గతంలో కంటే వేగంగా తరలిపోతున్నది. మన దేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు స్విస్‌ బ్యాంక్‌ల్లో ఉంచిన డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతర పత్రాల విలువ 2021లో 3.83 బిలియన్ల స్విస్‌ ఫ్రాంక్‌లకు (రూ.30,500 కోట్లు) చేరినట్టు స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంక్‌ గురువారం విడుదల చేసిన వార్షిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈ మొత్తం 14 ఏండ్ల గరిష్టం. 2020లో 2.55 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లున్న (రూ.20,700 కోట్లు) ఈ సొమ్ము నిరుడు భారీగా 50 శాతం పెరగడం గమనార్హం. 2006లో రికార్డుస్థాయిలో 6.5 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌ల నిధులు నమోదైన తర్వాత క్రమేపీ తగ్గుముఖం పడుతూ, 2017, 2020, 2021 సంవత్సరాల్లో పెరుగుతూ వచ్చినట్టు స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎన్‌బీ) డాటా ద్వారా వెల్లడవుతున్నది.

సేవింగ్స్‌ ఖాతాల్లో రూ.4,800 కోట్లు
స్విస్‌ బ్యాంక్‌ల్లోని పొదుపు, డిపాజిట్‌ ఖాతాల్లో భారతీయ ఖాతాదారులు దాచుకున్న సొమ్ము ఏడేండ్ల గరిష్ఠం రూ.4,800 కోట్లకు పెరిగింది. 2021 ముగిసేనాటికి స్విస్‌ బ్యాంక్‌లు వాటి భారతీయ ఖాతాదారులకు 3,831.91 మిలియన్‌ ఫ్రాంక్‌ల మొత్తం చెల్లించాల్సి ఉందని, అందులో 602.03 మిలియన్‌ ఫ్రాంక్‌లు కస్టమర్‌ డిపాజిట్లుకాగా, ఇతర బ్యాంక్‌ల ద్వారా కలిగిఉన్న డబ్బు 1,225 మిలియన్‌ ఫ్రాంక్‌లు, ట్రస్టుల ద్వారా దాచుకున్న 3 మిలియన్‌ ఫ్రాంక్‌లు ఉన్నాయి. స్విస్‌లో భారతీయులు దాచిన సంపదలో అత్యధికంగా బాండ్లు, సెక్యూరిటీలు, వివిధ ఫైనాన్షియల్‌ పత్రాల రూపంలో ఉంది. వీటి విలువ 2,002 మిలియన్ల స్విస్‌ ఫ్రాంక్‌లు.

ఇవి అధికారిక లెక్కలు మాత్రమే
స్విట్జర్లాండ్‌ బ్యాంక్‌లు ఎస్‌ఎన్‌బీకి అందించిన అధికారిక గణాంకాల ప్రకారం మాత్రమే రూ. 30,500 కోట్ల సొమ్ము భారతీయుల ఖాతాల్లో ఉంది. కానీ ఆ దేశంలో భారతీయులు భారీగా పోగేసిన నల్లధనంపై వివరాలు కాదు. థర్డ్‌ కంట్రీ సంస్థల పేర్లతో భారతీయులు, ఎన్నారైలు, ఇతరులకు ఉన్న సొమ్ము ఈ డాటాలో వెల్లడి కాలేదు.