DailyDose

అభినయ చైత్రం!

అభినయ చైత్రం!

ఆ నాట్యాన్ని వీక్షిస్తే మయూరాలు సిగ్గుతో ముడుచుకుపోతాయి. ఆ ముఖారవిందం కోటి భావాలకు అద్దం పడుతుంది. ప్రతి ప్రదర్శనా ఓ అబ్బురమే. పసి ప్రాయంలోనే కూచిపూడి నృత్యం మీద మక్కువ పెంచుకుని, నాట్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నది చైత్రారెడ్డి. ఓ వైపు శ్రద్ధగా చదువుకుంటూనే నాట్య సాధన చేస్తున్నది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చింది. అత్యుత్తమ ప్రతిభకు మూడుసార్లు గిన్నిస్‌ రికార్డులకెక్కింది.

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన పవన్‌కుమార్‌రెడ్డి, శిల్ప.. చైత్రారెడ్డి తల్లిదండ్రులు. అక్కడే, గురువు వంగీపురం నీరజాదేవి నేతృత్వంలో కూచిపూడి మెలకువలు తెలుసుకున్నది చైత్ర. ఆ కళాభినయాన్ని చూసి ప్రవాస భారతీయురాలు వైజయంతి చైత్రారెడ్డికి సింహనందిని నృత్యం నేర్పించారు. నాట్యం చేస్తూనే సింహ రూపానికి ప్రాణంపోయడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. మూడేండ్లుగా యామిని యశోద వద్ద శిక్షణ తీసుకుంటున్నది చైత్ర. కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ను సైతం అందుకున్నదీ నృత్యకారిణి. సిలికానాంధ్ర ప్రదర్శనలో భాగంగా చేసిన నృత్యానికి మూడుసార్లు గిన్నిస్‌ రికార్డు అందుకున్నది. ‘డాక్టర్‌ కావాలన్నదే నా కల. అందుకే ఇంటర్మీడియట్‌ శ్రద్ధగా చదువుతున్నాను. స్టెతస్కోప్‌ పట్టుకున్నా, నృత్యాన్ని దూరం చేసుకోను. కన్నవారికి, నృత్యం నేర్పిన గురువులకు రుణపడి ఉంటాను’ అంటున్నప్పుడు చైత్ర స్వరంలో చైత్రపు కోయిల మాధుర్యం.