DailyDose

‘కాశీ’ నిర్మాణానికై జోలె పట్టిన మాలవీయ

1916 జనవరి 4న వసంత పంచమి రోజున కాశీ హిందూ విశ్వవిద్యాలయానికి వైస్రాయి హార్డింగ్ శంకుస్థాపన చేశారు. విద్యార్థుల మొదటి జట్టు 1918లో పరీక్ష రాసింది. భారతదేశానికి గర్వకారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖాత్యమైన ఈ విశ్వవిద్యాలయం వ్యవస్థాపనలో మదనమోహన్ మాలవీయ (1861–1946) కనపరచిన నిష్ఠ, కార్యదీక్షను అనీబీసెంట్ ఇలా ప్రశంసించారు: ‘మాలవీయ మొత్తం తన ప్రాపంచిక జీవితాన్ని, శక్తిని, ప్రబలమైన తన వక్తృత్వ కళను, అంతెందుకు, స్వయంగా తననూ, తన ఆరోగ్యాన్ని ఈ గొప్ప హిందూ విశ్వవిద్యాలయం కోసం అర్పించారు’.

భారత జాతీయోద్యమ నిర్మాతలలో సంస్థా నిర్మాణ దక్షులు పలువురు ఉన్నారు. వారిలో అగ్రగణ్యుడు మదనమోహన్ మాలవీయ. ఆయన సంకల్ప బలం అసమానమైనది. అది విద్యారంగంలో కాశీ హిందూ విశ్వవిద్యాలయంగా కార్యరూపం దాల్చింది. విశ్వవిద్యాలయ స్థాపనకు మాలవీయ నిధులు సేకరించిన విధం గురించి ఆయన జీవిత చరిత్రకారుడు సీతారాం చతుర్వేది ఇలా రాశారు: మాలవీయ ఎల్లప్పుడు కాశీ హిందూ విశ్వవిద్యాలయ భవనాల రేఖా చిత్రాలు వెంట తీసుకుని తిరుగుతూ తగిన వ్యక్తులు తటస్థపడినప్పుడు ‘భారతదేశ వాసుల నుంచి ఐదు కోట్ల రూపాయల చందా ప్రోగు చేయడం కూడా కష్టమేనా? ఐదేసి లక్షల రూపాయలిచ్చే పదిమంది ధనవంతులు కూడా దొరకరా? ఒక్కో లక్ష ఇచ్చే వందమంది వ్యక్తులు కూడా దొరకరా?’ అని ఆయన ప్రశ్నించేవారు. ఈ విధంగా ఆయన ఐదు కోట్ల రూపాయలు సేకరించే ప్రణాళిక తయారు చేసుకున్నారు. డబ్బు వసూలు చేయకుండా ఆయన ఎవరినీ వదలిపెట్టేవారుకాదు. కాశీ హిందూ విశ్వవిద్యాలయం కోసం ఆయన ఎంతో కొంత డబ్బు సేకరించిన మనిషి అప్పట్లో ఎవరూ లేరని కూడా చెప్పవచ్చు. మొత్తం ఈ ప్రణాళికలో మాలవీయ, పండిత్ సుందర్ లాల్ ఒకరికొకరు పూరకంగా ఉండేవారు. విరాళం ఇస్తామని ధనవంతుల నుంచి వాగ్దానం చేయించుకోవడం మాలవీయ వంతైతే ఆ డబ్బు వసూలు చేయడం పండిత్ సుందర్ లాల్ వంతుగా ఉండేది. మొత్తం దేశం ఉదారంగా ఒక కోటి, నలభై మూడు లక్షల రూపాయలు జోలెలో వేసింది’.

మాలవీయ విరాళాలు సేకరించిన పద్ధతికి సంబంధించిన కథలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. చతుర్వేది మాటల్లో చూద్దాం: ‘ప్రతిరోజు మాలవీయ సేకరించదలచిన డబ్బు లక్ష్యాన్ని నిర్ధారించుకొని, అంత డబ్బు లభించేవరకు భోజనం చేయకూడదనే వ్రతం పూని ఇంట్లో నుంచి బయలుదేరేవాడు. ఒక రోజు అమృత్‌సర్‌లోని ఒక ప్రసిద్ధ వ్యాపారి వద్దకు మధ్యాహ్నం తర్వాత ఆయన చేరారు. మాలవీయ వెంట ఉన్న వారంతా ఆకలితో నకనకలాడి పోతున్నారు. ఆ వ్యాపారి వారందరి కోసం దివ్యమైన ఫలహారం ఏర్పాటు చేశాడు. కానీ మాలవీయ ఏమీ ముట్టుకోలేదు. కారణం అడిగినప్పుడు ఆయన ఎంత డబ్బు పొందాలని సంకల్పించుకొని వచ్చారో అంత డబ్బు లభించే వరకు ఏ ఆహారం తీసుకోలేరని చెప్పారు. ఆ వ్యాపారికి ఆ ధనరాశి ఎంతో చెప్పగానే అతడు చెక్ బుక్ తీసి మొత్తం డబ్బు ఇచ్చేశాడు. ఆ వ్యాపారి నుంచి అంత డబ్బు లభిస్తుందని మాలవీయ ఆశించలేదు.

‘అదే విధంగా మరోసారి ఆయన హిందూ విశ్వవిద్యాలయం కోసం ఒక్క పైసా ఇవ్వడానికి ఇష్టపడని ఒక నవాబు వద్దకు వెళ్ళాడు. మాలవీయ ఎట్టి పరిస్థితులలోనూ వెనక్కు తగ్గేవాడు కాదు కదా! ఆయన వెంటనే తన ఉత్తరీయం చెరగు చాచి పట్టుకుని ‘‘ఇందులో మీరు ఏమి వేసినా సరే, అదే తీసుకుని వెళ్లిపోతాను’’ అని అన్నారు. నవాబుగారికి చాలా కోపం వచ్చి తన బూటు ఒకటి తీసి ఆయన చెరగులో వేశాడు. మాలవీయ పరమ గౌరవభావంతో ఆ దానం స్వీకరించి ఫలానా నవాబుగారు దయతో ఒక బూటు దానంగా ఇచ్చారని, దాన్ని ఫలానా రోజున వేలం వేయడం జరుగుతుందని వార్తా పత్రికల్లో ప్రకటన వేయించారు. ఈ విషయం తెలిసి నవాబుగారు చాలా సిగ్గుపడి తగినంత డబ్బు ఇచ్చి తన బూటు వెనక్కు తెప్పించుకున్నాడు.

మరోసారి ఒక కోటీశ్వరునికి వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. ఆ విపత్తులో ఆశీర్వాదం పొందడానికి, సలహా తీసుకోవడానికి ఆయన మాలవీయ వద్దకు వచ్చాడు. మాలవీయ నవ్వుతూ ఆయనతో ‘‘మీరు హిందూ విశ్వవిద్యాలయం కోసం ఐదు లక్షలు విరాళంగా ఇచ్చేసేయండి’’ అని అన్నారు. విని ఆ కోటీశ్వరుడు ఎంతో ఆశ్చర్యంతో మాలవీయ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. వ్యాపారం మొత్తం పాడై పోయి దివాలా తీసే పరిస్థితి ఏర్పడి ఉండింది కాబట్టి. కానీ ఆయనకు ధైర్యం చెబుతూ మాలవీయ ‘‘మీరు సలహా తీసుకోవడానికి వచ్చి, నా సలహాను అంగీకరించరెందుకు?’’ అని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే ఐదు లక్షలకు చెక్కు రాసి ఇచ్చేశాడు. మరుసటి రోజు ఆ విషయం వార్తా పత్రికల్లో ప్రచురింపబడగానే ఆయన పరపతి ఎంతగానో పెరిగిపోయి దివాలా తీసే పరిస్థితి తప్పిపోయింది’.