NRI-NRT

H-1B వీసాల సంఖ్య పెంచాల్సిందే!

H-1B వీసాల సంఖ్య పెంచాల్సిందే!

కరోనా, ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం తదితర కారణాల వల్ల అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్భణం పెరుగుతోంది. నిత్యావసర సరుకులు, పెట్రోలు, రవాణా చార్జీలు పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో యూఎస్ కాంగ్రెస్ మాజీ సభ్యురాలు మియా లవ్.. సెనేట్ జ్యూడీషియరీ కమిటీ ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. H-1B వీసాల సంఖ్య పెంపు ప్రాముఖ్యతను ఆమె వెల్లడించారు.

అమెరికా ఆర్థిక అభివృద్ధిలో విదేశీ నిపుణులు కీలక పాత్ర పోషించారని అభిప్రాయపడ్డారు. దాదాపు గత 20ఏళ్లుగా ఏటా 85వేల H-1B వీసాలను మాత్రమే ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా విదేశీ నిపుణులకు జారీ చేస్తున్న హెచ్1బీ వీసాల సంఖ్యను ప్రస్తుత అవసరానికి అనుగుణంగా పెంచాలని సూచించారు. H-1B వీసాల సంఖ్యను పెంచడం ద్వారా ఎక్కువ మొత్తంలో నిపుణులు అమెరికాకు తరలివచ్చేందుకు అవకాశం ఉంటుందని.. దీంతో ఆర్థిక వృద్ధి జరుగుతుందని అన్నారు. అమెరికన్ వ్యాపారాలు మరింత విస్తరిస్తాయని చెప్పారు. దీంతో అమెరికన్లకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. విదేశీ నిపుణులను అధిక మొత్తంలో అమెరికాలోకి అనుమతించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని పలు నివేదికలు కూడా చెబుతున్నట్టు అమె పేర్కొన్నారు.

అమెరికాలో పెరుగుతున్న నిత్యావసర ధరలకు కార్మికుల కొరత కూడా ఓ కారణమని ఆమె అన్నారు. విదేశీ నిపుణులతో పాటు ఇతర వలస కార్మికులను కూడా పెద్ద ఎత్తును అమెరికాలోకి అనుమతించడం ద్వారా కార్మికుల కొరత కారణంగా జరుగుతున్న నష్టానికి అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఇదిలా ఉంటే.. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారు అమెరికాలో పనిచేసేందుకు గానూ అమెరికా ప్రభుత్వం ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో హెచ్‌-1బీ వీసాను జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రతిఏటా కొత్తగా దాదాపు 65వేల వీసాలతోపాటు అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ కోసం మరో 20వేల వీసాలను కేటాయిస్తుందన్న విషయం తెలిసిందే.