DailyDose

21 మంది ప్రభుత్వ అధికారుల నివాసాలపై ఏసీబీ దాడులు

21 మంది ప్రభుత్వ అధికారుల నివాసాలపై ఏసీబీ దాడులు

ఒకేసారి 21 మంది ప్రభుత్వ అధికారుల నివాసాలపై ఏసీబీ దాడులు..భారీగా నగలు..నగదు స్వాధీనం. కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో కర్ణాటక ప్రభుత్వం అధికారులపై కొరడా ఝళిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేపట్టింది. ఒకేసారి ఒకరు కాదు ఇద్దరు కాదు 21మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా నగదు,నగలు విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది ప్రభుత్వ అధికారుల నివాసాలపై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 80 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో300 మంది అధికారులు పాల్గొన్నారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ముదుగల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ ఉదయ్ రవి తల్లిదండ్రుల ఇంట్లో భారీగా, నగదు,నగలు స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో ఉడిపిలో చిన్న నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ హరీష్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అతని ఇంట్లో భారీగా నగలు లభ్యమయ్యాయి. 2 కేజీలకు పైగా బంగారం, దాదాపు రూ.5 లక్షల నగదు..ఖరీదైన వాచీలు, మూడు వాహనాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. బంగారంలో ప్లేట్లు..ట్రేలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 15కు పైగా బంగారు కంకణాలు, 30 నెక్లెస్‌లు, గొలుసులు, కంకణాలు, అమ్మవారి విగ్రహాలు లభ్యమయ్యాయి. వస్తువులు, సంబంధిత పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం రాకపోవడంతో కాంగ్రెస్‌, మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే కూటమిలో చీలిక రావడంతో ఏడాది కాలంలోనే ఆ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం యెడియూరప్ప సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే అవినీతి ఆరోపణలు రావడంతో బీజేపీ అధినాయకత్వం ఆయనను పదవినుంచి తొలగించి బస్వరాజ్‌ బొమ్మైని ముఖ్యమంత్రిని చేసిన విషయం తెలిసిందే.