DailyDose

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆడిట్‌ అధికారి- TNI నేర వార్తలు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆడిట్‌ అధికారి- TNI  నేర వార్తలు

*ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ అధికారులు దాడులు విస్తృతం చేస్తున్నారు. వారంరోజుల్లో నలుగురు అధికారులు, ఉద్యోగులను పట్టుకోవడం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆడిట్‌ కార్యాలయంపై ఇవాళ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీనియర్‌ ఆడిటర్‌ శ్యామ్‌ప్రసాదరావు రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. జిల్లాలోని ఒక వీఆర్వో రిటైర్డు అనంతరం చనిపోయాడు. అతడి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ కోసం బాధితుడు సీనియర్‌ ఆడిట్‌ అధికారి శ్యామ్‌ ప్రసాదరావును సంప్రదించగా రూ. 10వేల లంచం డిమాండ్‌ చేశాడు.

*బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి ఆర్బీకే అగ్రికల్చర్ అసిస్టెంట్ హరిబాబు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. పంట నష్టపరిహారం అందలేదని కొందరు రైతులు హరిబాబును నిలదీశారు. దీంతో మనస్థాపం చెందిన హరిబాబు.. మార్టూరు వ్యవసాయశాఖ అధికారులతో జరిగిన విషయం చెప్పాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించాడు. గమనించిన వ్యవసాయశాఖ సిబ్బంది.. హరిబాబును చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు.

*అసోంలో వరద బాధిత ప్రజలను తీసుకెళుతున్న పడవ బోల్తా పడటంతో ముగ్గురు చిన్నారులు తప్పిపోయారు.అసోం రాష్ట్రం వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ఏడాది అసోంలోని 28 జిల్లాల్లో 18.95 లక్షల మంది ప్రజలు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. హోజాయ్‌లోని 47 సహాయ శిబిరాల్లో 29,745 మంది ఆశ్రయం పొందారు. హోజాయ్ జిల్లాలో వరద బాధిత ప్రజలను తీసుకెళ్తున్న పడవ బోల్తా పడడంతో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారని, మరో 21 మందిని రక్షించామని అధికారులు శనివారం తెలిపారు.24 మంది గ్రామస్థుల బృందం శుక్రవారం అర్థరాత్రి ముంపునకు గురైన ఇస్లాంపూర్ గ్రామం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా రైకోటా ప్రాంతంలో పడవ ఇటుక బట్టీని ఢీకొట్టి బోల్తా పడింది. వరదనీటిలో పడిపోయిన వారిలో 21 మందిని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది రక్షించారు.

*మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ కుంటుంబాన్ని పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయలుదేరారు. కాగా ఘట్‌కేసర్‌లో రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

*ఏలూరు: జిల్లాలో రెండు టోల్ గేట్లు వద్ద పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని పట్టుకున్నారు. కలపర్రు టోల్ గేటు వద్ద రూ. 46. 30 లక్షల విలువచేసే 463 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అలాగే ఉంగుటూరు టోల్ ప్లాజా వద్ద రూ. 50 లక్షల విలువచేసే 506 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి లారీని సీజ్ చేశారు.

*నవ వధువు నాలుగు నెలల గర్భవతి కావడంతో భర్త అత్తమామలు షాక్‌కు గురైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో నవ వధువు నాలుగు నెలల గర్భవతి అని తెలియడంతో అత్తమామలు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.నవ వధువు కడుపునొప్పి గురించి ఫిర్యాదు చేయడంతో వైద్యులకు చూపించగా ఆమె నాలుగు నెలల గర్భిణీగా తేలింది. నవ వధువుకు పెళ్లయి ఒకటిన్నర నెలలు మాత్రమే అయింది. కడుపునొప్పి రావడంతో నవవధువుకు సోనోగ్రఫీ పరీక్షలు చేయగా ఆమె గర్భిణీ అని ఆమె అత్తమామలకు తెలిసింది.దీంతో వారు కోడలిని ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరించారు.నవ వధువు భర్త పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

*భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఆవేశంతో మొదటి భార్య ఇంటికి నిప్పు పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వేకోడూరు ఎస్‌ఐ వెంకటనరసింహం వివరాల మేరకు…. పట్టణంలోని రంగనాయకుల పేటకు చెందిన స్వామి నాయక్‌కు లక్ష్మీభాయితో వివాహమైంది. వీరికి ఒక బాబు ఇద్దరు కూతుళ్లు. స్వామి నాయక్‌కు భార్యపై అనుమానంతో తరుచూ గొడవ పడేవాడు. గతంలో ఇద్దరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. స్వామినాయక్‌కు కుటుం బం విషయంలో మనస్పర్ధలు రావడంతో ఇరువురు వేరే కాపురం ఉంటున్నారు. పిల్లలు ముగ్గురు తండ్రి వద్ద ఉంటున్నారు. ఇటీవలే స్వామి నాయక్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య లక్ష్మీభాయి భర్త మీద కోపంతో గురువారం అర్ధరాత్రి ఇంటో నిద్రిస్తున్న భర్త స్వామినాయక్‌ అతని రెండో భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టింది. ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. తండ్రి వద్ద నిద్రి స్తున్న బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పరిస్ధితి విషమించడంతో ముగ్గురిని తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

*అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో పరువు హత్య కలకలం రేపింది. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన కురబ చిట్రా మురళి( ని దుండగులు గొంతు కోసి అతి దారుణంగా హత్యచేశారు. తన తల్లే ఈ హత్యకు కారణమని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాప్తాడు మండలం లింగనపల్లి శివార్లలో శుక్రవారం వెలుగుచూసిందీ ఘటన. హతుడి భార్య వీణ ఫిర్యాదు మేరకు.. కనగానపల్లికి చెందిన కురుబ మురళి వీణ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు. పెద్దలకు ఇష్టం లేకపోయినా ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. గురువారం మురళి కియ పరిశ్రమకు వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్నాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి మురళిని బలవంతంగా తీసుకువెళ్లి లింగనపల్లి శివారు పొలాల్లో గొంతు కోసి చంపి పడేశారు. భర్త తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన వీణ పెట్రోలు బంకు వద్దకు వెళ్లింది. ద్విచక్రవాహనం అక్కడే ఉన్నా భర్త ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా తన భర్తను తన తల్లే చంపించిందని హతుడి భార్య వీణ మీడియాకు తెలిపింది. కులాంతర వివాహం మా అమ్మకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తను వదిలి ఇంటికి రమ్మని బలవంతం చేసింది. ఇంటికి రాకపోతే మురళిని చంపేస్తానని బెదిరించింది. మా అమ్మే ఇంత దారుణం చేయించింది అని వీణ కన్నీటి పర్యంతమైంది.

* దళితులపై అర్ధరాత్రి వైసీపీ మద్దతుదారుడు దాడికి తెగబడ్డాడు. తన అనుచరులతో కలిసి కర్రలు, రాడ్లు, కత్తులు, బీరు బాటిళ్లు తీసుకుని దళిత కాలనీపై విరుచుకుపడ్డాడు. భీతావహ వాతావరణం సృష్టించాడు. ఈ దాడిలో 13 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన ఎస్సై బాధితులపైనే లాఠీ ఝుళిపించారు. దీంతో వారంతా రోడ్డుపై బైఠాయించారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకూ జరిగిన ఈ ఆందోళనతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో నివాసితులందరూ దళితులే. ఈ నెల 14న రాత్రి కాలనీలో వివాహ వేడుక జరిగింది. ఆ సమయంలో కాలనీకి ఎదురుగా రోడ్డుకు ఆవలివైపు నివాసముంటున్న మువ్వా రామిరెడ్డి కుమారుడు సాయిరెడ్డి బైక్‌పై కాలనీలోకి వచ్చి ఫీట్లు చేశాడు. స్థానిక యువకులు అతనిని వారించే క్రమంలో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీన్ని మనసులో పెట్టుకొన్న సాయిరెడ్డి గురువారం రాత్రి తన అనుచరులతో పాత సింగరాయకొండలో కాలనీవాసులైన తిరుపతి పవన్‌కుమార్‌, మేడికొండ సాయిపై బీరు బాటిళ్లతో దాడికి చేశాడు. గాయపడిన ఇద్దరూ ప్రాథమిక చికిత్స చేయించుకొని ఇంటికి చేరుకున్నారు.

* అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం మాడగడ గ్రామంలో ఈ నెల 15న నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణపై దాడి చేసేందుకు యత్నించారనే అభియోగంపై శుక్రవారం ఐదుగురు గిరిజనులను అరెస్టు చేసినట్టు సీఐ జేడీ బాబు తెలిపారు. ఈ కేసులో గోమంగి మధుసూదనరావు(50), గోమంగి అడ్డి(43), గోమంగి బుద్దు(30), గోమంగి శారద(33), గోమంగి గాసి(32)లను అరెస్టు చేశామన్నారు. వీరిని రిమాండ్‌కు కూడా తరలించినట్టు ఆయన చెప్పారు.

*పంటల బీమా పరిహారం మంజూరులో అన్యాయం జరిగిందని ఆందోళన చేసిన రైతులపై ప్రభుత్వం శుక్రవారం కేసు నమోదు చేసింది. అనంతపురం జిల్లా డీ హీరేహాళ్‌ మండలం నాగలాపురం రైతు భరోసా కేంద్రం వద్ద గురువారం పెద్దఎత్తున రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రానికి తాళం వేశారు. దీనిపై సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ ఆంజనేయులునాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన విధులకు ఆటంక పరచి, ఆర్బీకేకి తాళం వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో టీడీపీ ఎంపీటీసీ మొండి మల్లికార్జున, రైతులు రాజశేఖర్‌, మల్లికార్జున, తిమ్మయ్య, హనుమంతప్ప, గంగిరెడ్డి, గోవిందు తదితరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.

*ఆయిల్‌ ట్యాంకర్‌, ఒక వాహనం ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు బాలురతో సహా ఆరుగురు మరణించారు. ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నో సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. హరౌని-మోహన్ రోడ్‌లో డీజే పరికరాలతోపాటు 12 మంది ప్రయాణిస్తున్న మినీ ట్రక్‌ను ఎదురుగా వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ లారీ ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలోని ఆరుగురు చనిపోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మృతులను శైలేంద్ర (35), రామధర్ (15), పురుషోత్తం (23), జైకరణ్ (16), సభంబర్ (13), రాహుల్ (13)గా గుర్తించారు. గాయపడిన వారిని ట్రామా సెంటర్‌లో చేర్పించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీస్‌ అధికారి ఠాకూర్ తెలిపారు. మృతులు, గాయపడిన వారంతా హర్దోయ్ జిల్లా వాసులని చెప్పారు.

*అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పరవాడపాలెంలో విషాదం నెలకొంది. దుస్తులు
ఉతకడానికి చెరువువద్దకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు ప్రమాదవాశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. వీరిలో అక్క పడాల తిరుమల(18) మృతదేహాన్ని వెలికితీయగా చెల్లెలు పడాల యమున(12) కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.