Movies

జెనీలియా రీ ఎంట్రీ మూవీలో రోల్ ఇదేనా..?

జెనీలియా రీ ఎంట్రీ మూవీలో రోల్ ఇదేనా..?

బొమ్మరిల్లు’ సినిమాలో హాసినిగా నటించి టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ తెచుకున్నారు జెనీలియా . ఆ తర్వాత ‘ఢీ’, ‘రెడీ’, ‘సై’, ‘హ్యాపీ’, ‘ఆరెంజ్’, ‘నా అల్లుడు’, ‘సాంబ’ లాంటి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. శంకర్ లాంటి అగ్ర దర్శకుడు రూపొందించిన ‘బాయ్స్’ సినిమాలో నటించి హాట్ టాపిక్ అయ్యారు. తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళంలో కూడా హీరోయిన్‌గా నటించారు. అయితే, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇటీవల మళ్ళీ ఆమె సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి.

ఎట్టకేలకు ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. తెలుగులోనే జెనీలియా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన గాలి జనార్థన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాతోనే జెనీలియా మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సినిమాలో కిరీటికి జంటగా పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తుంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వారాహి చలనచిత్ర పతాకంపై నిర్మిస్తున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో పాత్రలో జెనీలియా కనిపించబోతుందట. ఈ రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. హీరోయిన్‌గా సత్తా చాటిన ఆమె ..రీ ఎంట్రీలో మాత్రం బలమైన పాత్రలనే ఎంచుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కాగా, తెలుగు – కన్నడలో రూపొందుతున్న ఈ సినిమా ను ఇదే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. జెనీలియా నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. మరి జెనీలియా రీఎంట్రీకి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఎలా ఉంటుంది అనేది చూడాలి.