Food

స్టీల్ ప్లేటులో వ‌డ్డించ‌డం ఓల్డ్ మోడ‌ల్‌..

స్టీల్ ప్లేటులో వ‌డ్డించ‌డం ఓల్డ్ మోడ‌ల్‌..

స్టీలు ప్లేటులో తినడం, గాజు కప్పులో తాగడం, ప్లాస్టిక్‌ స్పూన్‌ వాడటం.. పాత ట్రెండే. ఇప్పుడు కాఫీ కప్పు, చక్కెర స్పూను, పాల లోటా, పాయసం గిన్నె.. ఏదైనా కొబ్బరి చిప్పతోనే. సంపన్నుల నివాసాల నుంచి అధునాతన రెస్టారెంట్లు వరకు.. ప్రతి డైనింగ్‌ టేబులు మీదా చిప్పలే హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిలోనే అందంగా వడ్డిస్తున్నారు.

‘కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు’ అంటాం కానీ, కొబ్బరి చిప్ప దొరికితే కోతులే కాదు, అంతకన్నా ఎక్కువ సంతోషించే మనుషులూ ఉన్నారు. వంటల్లో కొబ్బరి రుచే వేరు! అయితే, కొబ్బరి తిన్నాక.. ఆ చిప్పను ఏం చేస్తాం? ఎంచక్కా గోడవతల విసిరేస్తాం. కానీ ఆ చిప్పలతో కూడా తినేందుకు, తాగేందుకు, వంటింట్లో వాడేందుకు.. రకరకాల వస్తువుల్ని తయారు చేస్తున్నారు నవతరం వ్యాపారులు. జనం అసలే ఎకో ఫ్రెండ్లీ వస్తువులను ఇష్టంగా కొంటున్నారు కాబట్టి.. అమెజాన్‌లో వీటి అమ్మకాలు జోరందుకున్నాయి.

అచ్చంగా ఆర్గానిక్‌…
కొబ్బరి చిప్పలను అందమైన వస్తువులుగా మార్చే ప్రక్రియలో ఎక్కడా రసాయనాలను వాడరు. యంత్రాలనూ పెద్దగా ఉపయోగించరు. నూరుశాతం సంప్రదాయ పద్ధతిలో.. అదీ చేతులతోనే కొకొనట్‌ బౌల్సూ, స్పూన్లలాంటివి చేస్తారు. వీటి తయారీ కోసం కొబ్బరి చిప్పల నుంచి నూనెను తీసే ఫ్యాక్టరీలతో ఒప్పందం చేసుకుంటారు. అక్కడ కొబ్బరి తీసేసిన చిప్పల్లో మంచి సైజులో, ఆకృతిలో ఉన్న వాటిని ఎంచుకుంటారు. వాటిని తెచ్చి మరింత శుభ్రపరచి, ఏ వస్తువు చేయాలనుకుంటున్నారో ఆ ఆకారంలో కట్‌చేస్తారు. చిప్పపైభాగాన్ని గీకి నున్నగా చేశాక కొబ్బరి నూనెతో పాలిష్‌ చేస్తారు.

కొద్ది రోజులపాటు వరుసగా పాలిష్‌ చేయడం వల్ల ఈ ఉత్పత్తులన్నీ నునుపుగా మారిపోతాయి. మెరుస్తూ కనిపిస్తాయి. వీటిమీద కావాలనుకున్న డిజైన్లు చెక్కి అందంగా తీర్చిదిద్దుతారు. అచ్చం చెక్క వస్తువుల్లా పనిచేస్తాయి కాబట్టి, వీటిలో మనం ఎంచక్కా కావలసిన ఆహార పదార్థాలని వడ్డించుకొని తినొచ్చు. కాఫీటీలు తాగొచ్చు. సాధారణంగా ఈ తరహా గిన్నెల్లో 200 ఎంఎల్‌ వరకూ ద్రవాలు పడతాయి. కాస్త పెద్దవి అయితే అర లీటరు దాకా పడతాయి. మరీ పెద్దవి తయారు చేసేందుకు బాలి, వియత్నాంలాంటి దేశాల నుంచి భారీభారీ కొబ్బరి చిప్పలను దిగుమతి చేసుకుంటున్నారు. కొబ్బరి చిప్పలతో గిన్నెలు, గ్లాసులు, కప్పులు, స్పూన్లు, గరిటెలు, డబ్బాలు, టీ కెటిళ్లలాంటివెన్నో రూపొందిస్తున్నారు. రకరకాల రంగులతో డిజైన్లు అద్దినవీ వస్తున్నాయి. మీకూ నచ్చాయా.. అయితే వంటింట్లో కొబ్బరి చిప్పలకు కాస్త చోటివ్వండి మరి!