DailyDose

అగ్నిపథ్ నిరసనలు – దామెర రాకేశ్: ‘ఆందోళన చేస్తే కాల్చి చంపుతారా?’ – కన్నీరుమున్నీరైన దబ్బీర్‌పేట

అగ్నిపథ్ నిరసనలు – దామెర రాకేశ్: ‘ఆందోళన చేస్తే కాల్చి చంపుతారా?’ – కన్నీరుమున్నీరైన దబ్బీర్‌పేట

అగ్నిపథ్ పథకం వ్యతిరేక ఆందోళనల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి.వరంగల్ నుంచి స్వగ్రామం దబ్బీర్‌పేట్‌కు ర్యాలీగా తీసుకువచ్చి రాకేశ్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక నేతలు, గ్రామస్థులు, స్నేహితులు పాల్గొన్నారు.

రాత పరీక్ష కోసం ఎదురు చూపులు
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దబ్బీర్‌పేట్‌కు చెందిన దామెర రాకేశ్ (24) కరోనా ముందు నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో శారీరక ధారుడ్య, మెడికల్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు.రాతపరీక్ష కోసం రెండేళ్లకు పైగా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. పరీక్షల కోసం బాపట్ల వెళ్లి శిక్షణ కూడా తీసుకున్నారు.
మరోవైపు, తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ కానిస్టేబుల్ పరీక్ష కోసం హన్మకొండలోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న ఉచిత తరగతులకు గత మూడు నెలలుగా హాజరవుతున్నారు.

చదువు, వ్యవసాయం, ఆర్మీలో చేరాలన్న కల
దబ్బీర్ పేట్ గ్రామం నుంచి ఆర్మీ, సీఆర్పీఎఫ్ లాంటి బలగాల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు. స్వయంగా రాకేశ్ అక్క రాణి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్( బీఎస్ఎఫ్) లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.రాకేశ్ అన్నయ్య రామరాజు గతంలో ఆర్మీ ఎంపిక పరీక్షలకు హాజరయ్యారు. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లకు గాయాలవ్వడంతో ఆ ప్రయత్నాలు మానేశారు. ఆర్మీలో చేరాలనే రాకేశ్‌ను తన అన్న, అక్క ప్రోత్సహించారు.రాకేశ్ మరణం గ్రామస్థులను కలిచివేసిందని దబ్బీర్ పేట్ మాజీ సర్పంచ్ బానోత్ రాజు అన్నారు.’అగ్నిపథ్ ప్రకటనతో ఇక తమకు ఉద్యోగాలు రావనుకుని రైల్ రోకో చేద్దామని వెళ్లినట్లున్నాడు. ఆ విషయం గ్రామంలో ఎవరికీ తెలియదు. మా గ్రామం నుంచి ఆందోళనల్లో పాల్గొన్నది రాకేశ్ ఒక్కడే. తను హన్మకొండలో ఉంటున్నాడు. ఎవరి పిలిస్తే వెళ్లాడో తెలియదు కానీ అక్కడ బుల్లెట్ తగిలి చనిపోయాడు. మా గ్రామం నుంచి ఆర్మీ, ఇతర సాయుధ బలగాల్లో పనిచేసేవారి సంఖ్య ఈ మధ్య కాలంలో పెరిగింది. గతంలో ఎప్పుడూ కూడా మా ఊరు ప్రజలు ఎవరూ ఇలా కాల్పుల్లో చనిపోలేదు” అని బీబీసీతో బానోత్ రాజు బీబీసీతో అన్నారు.రాకేశ్ కుటుంబానికి 5 ఎకరాల పోడు వ్యవసాయ భూమి ఉంది. తండ్రి, అన్నలకు వ్యవసాయ పనుల్లో రాకేశ్ సహాయపడేవారు. అయితే దబ్బీర్ పేట్ ఏజన్సీ ప్రాంతం పరిధిలో ఉండటంతో ఆ భూమికి పట్టాలు లేవు.

ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉండేవాడు’
రాకేశ్‌కు వరుసగా పెదనాన్న అయ్యే వెంకటయ్య ఆయన మరణం పట్ల కలత చెందారు.‘‘భూములకు పట్టాలు లేక పంటలు పండక మేం బాధపడుతున్నాం. వాళ్లు చదువుకొని ఉద్యోగాలు చేయాలని చదువుల వెంట పడ్డారు. కానీ, చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ మధ్య ఓ ఫంక్షన్‌లో నా క్షేమసమాచారాలు అడిగి, నా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్పాడు. ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉండేవాడు. శుక్రవారం మధ్యాహ్నం టీవీల్లో వార్తలు చూస్తే చనిపోయాడని తెలిసింది” అని వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

‘తన వేగంతో పోటీ పడలేకపోయేవాళ్లం’
దబ్బీర్ పేట్ గ్రామ సమీపంలోని అశోక్ నగర్‌లో ఉన్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ సైనిక్ స్కూల్ వరకు ప్రతీరోజూ 6 కిలో మీటర్లు రాకేశ్ రన్నింగ్‌కు వెళ్లేవాడని ఆయన స్నేహితుడు బొల్లు రాకేశ్ అన్నారు. అతని వేగంతో పోటీ పడలేకపోయేవాడినని చెప్పారు.”సైనిక్ స్కూల్ గ్రౌండ్‌లో సాధన చేస్తూ ఫిట్‌నెస్ కాపాడుకునేవాడు. చాలా కసిగా ప్రాక్టీస్ చేసి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఉత్తీర్ణత సాధించాడు. రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నాడు. త్వరలోనే యూనిఫాంలో చూడాల్సిన రాకేశ్‌ను ఇలా చూస్తామనుకోలేదు. దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. నిన్న మొన్నటి వరకు మా మధ్య తిరిగిన వాడికి ఇలా జరగడం బాధ కలిగించింది” అని ఆయన అన్నారు.

గ్రామస్థుల ఆవేదన

ఇరుగు పొరుగు వారికి రాకేశ్ సహాయంగా ఉండేవాడని, ఎలాంటి గొడవల్లో తలదూర్చేవాడు కాదని తన పనేదో తాను చేసుకుంటూ పోయే రకం అని గ్రామస్తులు అతని జ్ఞాపకాలను తలచుకుంటున్నారు.”ఏదైనా పని చెబితే కాదనకుండా చేసేవాడు. అతని అన్నకు యాక్సిడెంట్ అయితే ఇంటికి పెద్ద దిక్కుగా మారాడు. రాకేశ్ వ్యవసాయం చేసుకుంటే బావుండేది. ఆందోళన చేసినప్పుడు వేరే మార్గంలో అదుపుచేసి ఉండాల్సింది. ఒక దెబ్బ వేసి ఉండాల్సింది. కానీ, కాల్చి చంపేస్తే కన్నవారి పరిస్థితి ఏంటి? ఒక ప్రాణం తీస్తే ఏమొచ్చింది వారికి” అని రాకేశ్ పక్కింట్లో నివసించే 70 ఏళ్ల గడ్డలోల్ల ఎల్లమ్మ వాపోయారు.పోలీసులు కావాలనే చంపారు అని రాకేశ్ బంధువు ఆకారపు చంద్రకళ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.