DailyDose

ఫుల్లుగా తాగేశారు… 34 లక్షల బాటిళ్లు ఖాళీ

ఫుల్లుగా తాగేశారు… 34 లక్షల బాటిళ్లు ఖాళీ

భూములు, ఇళ్లు, ఐటీ, పారిశ్రామిక ఉత్పత్తుల్లోనే కాదు మద్యం అమ్మకాల్లోనూ జిల్లా దూసుకుపోతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే.. ఇక్కడ మద్యం విక్రయాలు అత్యధికంగా జరిగాయి. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం జిల్లా నుంచే సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి జూన్‌ 15 వరకు 2,33,69,322 బీర్లు అమ్ముడు పోగా, ఇందులో కేవలం జిల్లా వాసులే 51,51,058 బీర్లు తాగేశారు. తెలంగాణ వ్యాప్తంగా 1,65,10,978 ఫుల్‌ బాటిళ్లు ఖాళీ కాగా కేవలం జిల్లాలోనే 34,72,932 ఫుల్‌ బాటిళ్లు అమ్ముడుపోయాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాకి ఇప్పటి వరకు రూ.15,235 కోట్ల ఆదాయం సమకూరగా, కేవలం జిల్లా నుంచే రూ.3,354 కోట్లకుపైగా రావడం గమనార్హం.

విందేదైనా మందు ఉండాల్సిందే
నగరానికి చేరువలో ఉండడం.. అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడు మెజార్టీ ఔటర్‌ రింగ్‌రోడ్డు జిల్లాలో ఉండడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు దేశవిదేశాలకు చెందిన ఐటీ అనుబంధ సంస్థలు, అంతర్జాతీయ పరిశ్రమలు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి. అనేక మంది ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నారు. వీరిలో చాలా మంది ఇక్కడే స్థిరపడేందుకు ఇష్టపడుతున్నారు. ఇళ్లు, భూములు కొనుగోలు చేస్తున్నారు.

ఫలితంగా ఇక్కడి భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. భూ క్రయవిక్రయాల ద్వారా రైతులు, వ్యాపారులు అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు సైతం రూ.లక్షల్లో ఉన్నాయి. చేతినిండా డబ్బులు ఉండటంతో పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలు, విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నారు. శుభకార్యాలు, అశుభకార్యాలు ఇలా ఏదైనా వచ్చిన బంధువులకు మద్యం, మాంసం తప్పనిసరైంది.

శంషాబాద్‌ నుంచే అత్యధికం
జిల్లాలో 234 మద్యం దుకాణాలు ఉండగా, వీటిలో శంషాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలో వంద, సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ కార్యాలయం పరిధిలో 134 ఉన్నాయి. శంషాబాద్‌ ఎక్సైజ్‌ కార్యాలయం పరిధిలోనే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాతి స్థానంలో సరూర్‌నగర్‌ జోన్‌ నుంచి సమకూరడం విశేషం. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెంట ఉన్న దుకాణాల్లోనే అమ్మకాలు ఎక్కువ జరగడం విశేషం.