DailyDose

లాస్ వేగాస్‌లో కూడా ఈఫిల్ ట‌వ‌ర్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా !!

లాస్ వేగాస్‌లో కూడా ఈఫిల్ ట‌వ‌ర్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా !!

పుణ్యం చేసినవారు స్వర్గానికి, పాపం చేసినవారు నరకానికి వెళ్తారని నానుడి. అయితే.. ఆ నగరం మాత్రం.. పాపపుణ్యాలతో సంబంధం లేకుండా.. ‘స్వర్గమిక్కడే ఉన్నది’ అని అంటున్నది. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ సకల మర్యాదలతో ఆనందపు అనుభూతుల అంచులకు తీసుకెళ్తున్నది. అదే.. అమెరికా నెవాడా రాష్ట్రంలోని ‘లాస్‌ వేగాస్‌’. విందులు, వినోదాలు, విలాసాలకు కేరాఫ్‌ అడ్రస్‌!

అమెరికాలోని లాస్‌ వేగాస్‌ నగరం పర్యాటకులకు భూతల స్వర్గమే. ఆ విలాసాల నగరంలో మూడు రోజులపాటు విహరించాం. అట్లాంటా నుంచి నాలుగు గంటల విమాన ప్రయాణం తర్వాత ‘లాస్‌ వేగాస్‌’లో ల్యాండ్‌ అయ్యాం. 1905లో శంకుస్థాపన చేసుకున్న ఈ నగరం.. 1911లో అధికారికంగా గుర్తింపు పొందింది. ‘వెగాస్‌’ అంటే స్పానిష్‌ భాషలో పచ్చికబయలు అని అర్థం. 1935లో ‘హూవర్‌ డ్యామ్‌’ నిర్మాణం పూర్తయిన తర్వాత, ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగింది.
las-vegas1
జూదక్రీడల చిరునామా
జూదక్రీడలకు, విలాసాలకూ ‘లాస్‌ వేగాస్‌’ కేరాఫ్‌ అడ్రస్‌. 1931లోనే అధికారిక ‘జూదక్రీడ’కు చట్టసభ ఆమోదం తెలిపింది. ఇక్కడ గ్యాంబ్లింగ్‌ చట్టబద్ధం. దీంతో ప్రపంచం నలుమూలల నుంచీ ఎంతోమంది క్యాసినో ఆడేందుకు లాస్‌ వేగాస్‌లో వాలిపోతుంటారు. జూదంలో కోట్లు కుమ్మరిస్తుంటారు. జూదగాళ్ల కోసం సకల విలాసాలతో హోటళ్లు వెలిశాయి. ఫలితంగా పర్యాటకంగానూ నగరం అభివృద్ధి చెందింది. రాత్రీపగలు భేదం లేకుండా వెలుగుజిలుగుల్లో సాగే జూదాలతో నగరం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఇరవై నాలుగు గంటలూ సందడే. విజేతల మొహాల్లో గెలిచామన్న ఆనందం. సొమ్ము పోగొట్టుకున్నవారి మొహాల్లో డబ్బు పోతేనేం.. ఆనందం దక్కిందన్న సంతృప్తి. షాపింగ్‌ ప్రియులకు కూడా ‘లాస్‌ వేగాస్‌’ ఓ స్వర్గధామం.

ఎటు చూసినా ఆనందమే
ఈ నగరంలో ఎటు వెళ్లినా ఆకర్షణీయమైన నిర్మాణాలే. నగరమంతా వ్యాపించిన బహుళ అంతస్తుల నిర్మాణాలు ఆకాశంతో పోటీపడుతుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిచెందిన వంటకాలెన్నో ఇక్కడ నోరూరిస్తాయి. ‘సీజర్స్‌ ప్యాచెస్‌’లో ప్రపంచంలోనే అతిపెద్ద ‘చాక్లెట్‌ ఫౌంటెయిన్‌’ను చూసి మేమంతా తన్మయత్వానికి లోనయ్యాం. అవి శ్రాంతంగా జాలువారే ఈ ‘చాక్లెట్‌ ఫౌంటెయిన్‌’.. నిజంగా ఓ అద్భుతం! రాత్రి వేళల్లో లైటింగ్‌ వెలుగులతో విరజిమ్మే నీటి ధారలతో ‘బెల్లాజియో’ హోటల్‌ ఏర్పాటుచేసిన ‘వాటర్‌ ఫౌంటెన్‌ షో’ ఎంతో ఉల్లాసం కలిగించింది. దానికి సమీపంలోనే ఉన్న ‘మీరజ్‌’లో ‘ఫైర్‌ షో’ కళాత్మక చమత్కారం. మంటలు ఎగిసిపడే ఆ ప్రదర్శనను చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
las-vegas3
upload a photo
అంతా చట్టబద్ధమే!
‘లాస్‌ వేగాస్‌’లో వ్యభిచారం చట్టబద్ధమైనది. పెద్దపెద్ద వాహనాలు, ‘కాల్‌ గర్ల్స్‌’ పోస్టర్లతో, ఫోన్‌ నెంబర్లతో బోర్డులను తగిలించుకొని ప్రచారం చేస్తూ ఉంటాయి. పర్యాటకులకు పాంప్లెట్స్‌ కూడా పంపిణీ చేస్తుంటారు. అంతా బహిరంగమే.. ఎక్కడా దాపరికం ఉండదు. ఇక్కడున్న ప్రతి క్షణాన్నీ పరిపూర్ణంగా ఆస్వాదించి, అంతులేని అనుభూతులను గుండెల్లో నింపుకొని తిరుగు ప్రయాణమయ్యాం.

హాట్‌హాట్‌ హోటల్స్‌
లాస్‌ వేగాస్‌లోని హోటల్స్‌ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడి ఒక హోటల్‌ పేరు ‘ఈఫిల్‌ టవర్‌’. దీని భవనం ప్యారిస్‌ నగరంలోని ‘ఈఫిల్‌ టవర్‌’కు మక్కికి మక్కీలా ఉంటుంది. మిగతా హోటళ్లు కూడా ఆయా పేర్లకు తగిన రీతిగా ఉంటాయి. మేం విడిది చేసిన హోటల్‌ పేరు ‘సర్కస్‌ సర్కస్‌’. ఇది నిర్మాణశైలిలో పెద్ద సర్కస్‌ను తలపిస్తుంది. ఆయా హోటళ్లలో పాటలు, నృత్యాలు, హాస్య ప్రదర్శనలు, సాహస విన్యాసాలు లాంటివి నిత్యకృత్యం. ఇక్కడి నైట్‌క్లబ్బులన్నీ ఎప్పుడూ కిక్కిరిసి ఉంటాయి. ఇక ‘బ్యాలీస్‌’ ప్రదర్శనలు సర్వసామాన్యం.