Agriculture

రెడ్‌ మ్యాంగో @ కొత్తూరు

రెడ్‌ మ్యాంగో @ కొత్తూరు

సాధారణంగా మామిడి ఏ కలర్‌లో ఉంటుంది? కాయ అయితే పచ్చగా.. పండు అయితే ముదురు పసుపు కలర్‌లో ఉంటుంది. కానీ, ఈ ఎర్రమామిడి ఏంటని ఆశ్చర్యపోతున్నారా..! ఇది కొత్త రకం! చూస్తేనే తినాలనిపించే రెడ్‌ మ్యాంగో రుచిలో అమోఘంగా ఉంటుంది. మార్కెట్లోనూ మంచి ధర పలుకుతున్నది. ఈ ఎరుపువర్ణ మామిడిని జూలపల్లి మండలం కొత్తూరులో రైతు నెర్వట్ల రాయమల్లు సాగు చేస్తున్నాడు. ఈ యేడాది 2క్వింటాళ్ల దిగుబడి తీసి మంచి లాభాలు గడించాడు.

జూలపల్లి మండలం కొత్తూరుకు చెందిన రైతు నెర్వట్ల రాయమల్లు తన నాలుగు ఎకరాల భూమిలో 28 ఏళ్లుగా బెంగన్‌పల్లి, దసేరి, హిమాయత్‌, కొబ్బరి మామిడి రకాలను సాగు చేస్తున్నాడు. ఎంత కష్ట పడ్డా.. ఎంత పంట పండించినా చివరకు మిగిలే లాభం కేవలం రూ. 10 వేలు మాత్రమే. అయితే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన తన కుమారులు నెర్వట్ల జయప్రకాశ్‌నారాయణ, విజయ్‌కుమార్‌ నాన్న కష్టాన్ని చూసి అందుకు తగ్గ ఫలితం దక్కేలా వినూత్నంగా ఆలోచించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌కు చెందిన ఓ రైతు పండిస్తున్న ఎర్ర మామిడి గురించి తెలుసుకున్నారు. మార్కెట్‌లో ఎర్ర మామిడికి ఉండే డిమాండ్‌తో పాటు పంట సాగు విధానాలు. మొక్కల అందుబాటు గురించి తెలుసుకున్నారు. అక్కడి నుంచే రెండు సంవత్సరాల వయస్సు ఉన్న 117 మొక్కలను రెండేళ్ల క్రితం తీసుకువచ్చారు. శ్రద్ధతో పెంపకం చేపట్టగా ఒక్కో చెట్టుకు 15 నుంచి 20 కాయలు కాశాయి. ఒక్కో కాయ 300 నుంచి 400గ్రాముల బరువు కలిగి ఉన్నది. రెండేళ్ల వయస్సున్న మొక్కలు, నాటిన రెండేళ్లు కలుపుకొని నాలుగేళ్ల వయస్సులో ఈ ఏడాది 2క్వింటాళ్ల వరకు మామిడి దిగుబడి లభించగా సాధారణ మామిడి రకమైన బంగన్‌పల్లి ఒక టన్ను పంట దిగుబడికి సమానమైన లాభాలు రావడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎర్ర మామిడితో లాభాలు ఎక్కువ..
సాధారణంగా మామిడిలో బంగెన్‌పల్లి, కొబ్బరి, దసేరి, హిమాయత్‌లతో పోలిస్తే ఎర్ర మామిడికి బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నది. హైదరాబాద్‌, ముంబై, బెంగళూర్‌ మార్కెట్లలో అధిక రేటు పలుకుతున్నది. హైదరాబాద్‌లో రూ. 500లకు కిలో డిమాండ్‌తో అమ్ముతుండగా ముంబై, బెంగళూర్‌లలో ఒక్కో కాయకు రూ. 200 వరకు ధర పలుకుతున్నది. 28 ఏళ్లుగా రాయమల్లు సాధారణ రకాలు పండిస్తుండగా, సీజన్‌లో ఎకరాకు టన్ను నుంచి టన్నున్నర వరకు దిగుబడి వచ్చింది. అన్ని ఖర్చులు పోనూ రూ. 10 వేలే మిగిలేవి. రెండేండ్ల ఎర్ర మామిడి చెట్లకు రెండు క్వింటాళ్ల దిగుబడి రాగా, అన్ని ఖర్చులు పోను రూ. 10 వేల ఆదాయం లభించింది.

పోషకాలు ఎక్కువ..అందుకే మక్కువ..
సాధారణ మామిడి రకాలతో పోలిస్తే ఎర్ర మామిడిలో పుష్కలమైన పోషకాలు కలిగి ఉన్నాయి. హేవీ ఫైబర్‌, వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండడంతో పాటు షుగర్‌ కంటెంట్‌ తక్కువగా ఉన్నది. దీంతో వినియోగదారులు ఎర్ర మామిడిని ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. పసుపు రంగులో కాకుండా కనువిందుగా, ఎరుపు మామిడిపండ్లు దర్శనమిస్తుండడంతో సమీప గ్రామాల ప్రజలు రాయమల్లు మామిడి తోటకు వచ్చి ఇష్టంగా కొనుగోలు చేయడం కనిపిస్తున్నది.

ఇవీ ప్రత్యేకతలు…
ఎర్రమామిడి నాటిన ఏడాదిన్నర కాలం నుంచే కాత మొదలవుతుంది. మొదటిసారి 15 నుంచి 20 కాయలు కాస్తాయి. పూర్తిగా ఎరుపు వర్ణంలో ఉండి సుమారు 300 నుంచి 400 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. కోసిన కాయలు 20 రోజుల వరకు తాజాగా ఉంటాయి.టేబుల్‌ రకానికి చెందిన పచ్చి కాయలు ఎక్కువ తీపిగా, పండ్లు సాధారణ తీపిగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా మితంగా తీసుకోవచ్చు.ఎకరానికి 420 మొక్కలు నాటుకోవచ్చు. చెట్టు జీవిత కాలం 25 నుంచి 30 ఏళ్లు ఉంటుంది. చెట్టు ఏడాదికి మీటరు ఎత్తు చొప్పున ఎదుగుతుంది. నాలుగేళ్ల వయసుకు 12 అడుగు ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఒక్కో చెట్టు దాదాపు 400 నుంచి 500 కాయలను ఇస్తుంది.
చెట్టుకు రోగ నిరోధకత ఎక్కువ.పిందెలు 70 శాతం వరకు నిలబడుతాయి.
ts
మహారాష్ట్ర నుంచి ఫోన్లు వస్తున్నాయి..
నేను మా గ్రామంలో మొట్టమొదటి మామిడి రైతును. మధ్యలో నాకు సింగరేణి ఉద్యోగం వచ్చింది. సెలవు దొరికినప్పుడల్లా తోటకాడికి వచ్చి మామిడి మొక్కలను పెంచేది. అయితే ఆదాయం అంతంతే ఉండేది. మా పిల్లలు సిద్ధిపేట దగ్గర ఒక రైతు ఎర్ర మామిడి పంటను చూసి వచ్చి మన తోటలో పెడదామని చెప్పగానే ఒప్పుకుని పంట వేసిన. రెండేండ్లకు 20 కిలోల పంట అచ్చింది. ఈ యేడు 2 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎర్ర మామిడి కావాలని మహారాష్ట్ర నుంచి కూడా ఫోన్లు వస్తున్నయి.–నెర్వట్ల రాయమల్లు, రైతు