Health

అ..అమ్మపాలు!

Auto Draft

ఆరోగ్యకర జీవనం మనిషికి ఎంతో ప్రధానం. అది సమాజ పురోగతిని, ప్రజల జీవనస్థాయిని ప్రతిబింబిస్తుంది. శిశువు గర్భంలో పడకముందే బిడ్డ ఆరోగ్యానికి పునాది వేస్తుంది. ఇది తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ఆహారపు అలవాట్లపైనా ఆధారపడి ఉంటుంది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు, జన్మించాక మొదటి కొన్ని సంవత్సరాల పాటు.. పిల్లలకు ప్రత్యేకమైన శారీరక, మానసిక అవసరాలు ఉంటాయి. వాటిని తప్పకుండా తీర్చాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యమైనది ఆహారం. పోషకాహార లోపాలు, అంటువ్యాధులు పిల్లల మరణానికి, పెరుగుదల లోపాలకు ప్రధాన కారణం అవుతున్నాయి.

పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు చేసింది. తల్లిపాలు తాగించడం, ఏడాది దాటకముందే టీకాలన్నీ వేయించడం, బిడ్డకూ బిడ్డకూ మధ్య మూడేండ్ల ఎడం పాటించడం, అతిసార వ్యాధితో బాధపడుతున్నప్పుడు లవణ జలపానీయం తాగించడం.. వీటిలో ప్రధానమైనవి. పుట్టిన ప్రతి శిశువుకు సాధ్యమైనంత కాలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. మానవుడు పదివేల సంవత్సరాలుగా పాలిచ్చే జంతువులను మచ్చిక చేసుకుంటూ వస్తున్నాడు. కానీ గత 70 సంవత్సరాలుగా మాత్రమే శిశువుకు ఆవుపాలు తాగించే ధోరణి బాగా పెరిగిపోయింది. తల్లిపాలు కాకుండా, శిశువులకు ఆవుపాలిచ్చే పద్ధతిని ‘మనిషి ఆరోగ్యం విషయంలో అతిపెద్ద అనవసర ఆవిష్కరణ’గా భావిస్తారు. ఈ అనర్థదాయకమైన ‘ఆవుపాల పిచ్చి’ ఆరోగ్య సేవల కొరత ఉన్న దేశాలలో మరింత ప్రమాదకరంగా పరిణమిస్తున్నది.

18వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ఆవుపాలు తాగుతూ అనాథాశ్రమంలో పెరిగిన 130 మంది పిల్లలలో, ఒక సంవత్సరం వరకూ బతికున్నవారు 13 మంది మాత్రమే. వారు కూడా రోగాల బారినపడి తర్వాతి కాలంలో మరణించారు. చిలీ దేశంలో జరిపిన ఒక పరిశీలన ప్రకారం.. ఒక సంవత్సరం వరకూ తల్లిపాలు తాగినవారితో పోలిస్తే, తాగని వారిలో మరణాలు 2-3 రెట్లు ఎక్కువ. యెమెన్‌లో జరిపిన మరొక పరిశీలన ప్రకారం.. తల్లిపాలు తాగిన బిడ్డలతో పోలిస్తే, సీసా పాలు తాగిన వారిలో ఆహార లోపాలు ఎనిమిది రెట్లు ఎక్కువని తేలింది. తల్లిపాలు 6 నెలల కన్నా తక్కువ కాలం తాగిన వారిలో మొదటి 6 నెలల్లో మరణించే అవకాశం 5-10 రెట్లు అధికమని దక్షిణ అమెరికా దేశాల అనుభవం చెబుతున్నది. అదే విధంగా అమెరికాలో ఆసుపత్రి పాలైన పిల్లల్లో ఎక్కువ భాగం తల్లిపాలు తాగనివారే. భారతీయ గ్రామీణ ప్రాంతాలలో అమ్మలంతా తల్లిపాలు తాగిస్తున్నా, పట్టణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి ఏమంత ప్రోత్సాహకరంగా లేదు. ఒక సంవత్సరం వరకు పాలు తాగించే స్త్రీల సంఖ్య.. కలకత్తాలో 90 శాతం, ముంబైలో 85 శాతం, చెన్నైలో 70 శాతం మాత్రమే. ఎంత దురదృష్టకరం!