DailyDose

తోటలోకి దూసుకొచ్చి.. ఆరుగురు రైతులపై ఎలుగుబంటి దాడి! – TNI నేర వార్తలు

తోటలోకి దూసుకొచ్చి..  ఆరుగురు రైతులపై ఎలుగుబంటి దాడి!  – TNI  నేర వార్తలు

*శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ లో దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. పేస్ట్ రూపంలో నీక్యాప్స్‌లో బంగారం అక్రమంగా తరలించారు. 1022 గ్రాములు 53.77లక్షల విలువైన గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

* ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండవలసిన ఓ పోలీసు అక్రమాలకు పాల్పడి కటకటాలపాలైన వైనం కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లా ఏపీ ఎస్పీ బెటాలియన్‌లో పనిచేసి సస్పెన్షన్‌లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటసుబ్బయ్య ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడితో పాటు మరొకరని అరెస్టు చేసిన పోలీసులు వారిద్దరీని రిమాండ్‌కు తరలించారు. వీరివద్ద నుంచి 200 కిలోల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

*శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులో ఎలుగు బంటి బీభత్సం సృష్టించింది. జీడి, కొబ్బరి తోటల్లో పని చేస్తున్న 8 మంది రైతులపై ఎలుగుబటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న వజ్రపుకొత్తూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రెండురోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి ఆదివారం రైతుపై దాడి చేసి గాయపరిచింది. సోమవారం రోజు స్థానికులు అప్రమత్తతో ఉన్నప్పటికీ మరోసారి దాడి చేసి గ్రామస్తులను గాయపరిచింది. భయంతోనే పొలం పనులకు గుంపులుగా వెళ్లిన గ్రామస్తులపై ఒక్కసారిగా పొదల నుంచి వచ్చిన ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎలుగు బంటి సంచారం నేపథ్యంలో అటవీ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

*మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వారి తలపై మొత్తంగా రూ. 30 లక్షల రివార్డు ఉన్నట్టు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. మృతి చెందిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు చెప్పారు. బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల్లోని హాక్ ఫోర్స్‌కు, రెబల్స్‌కు మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు మంత్రి పేర్కొన్నారు.మృతి చెందిన మావోలను డివిజనల్ కమిటీ సభ్యుడు నగేష్, కమాండర్లు మనోజ్, రామేగా గుర్తించారు. నగేష్ తలపై రూ. 15 లక్షల రివార్డు ఉండగా, మనోజ్, మహిళా కమాండర్ రామేలపై చెరో రూ. 8 లక్షల రివార్డు ఉన్నట్టు మంత్రి నరోత్తమ్ తెలిపారు.

*భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని కొత్తగూడెం.. లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు గ్రామంలో విషాదఘటన చోటుచేసుకుంది. మాదిగప్రోలులో పురుగుల మందు తాగి భార్య, భర్తల అనుమానస్పద మృతి చెందారు. మృతులు కంగాల వేంకటేష్, (33) కంగాల రాణి, (30)గా గుర్తించారు. మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన లక్ష్మిదేవిపల్లి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

*‘రోడ్డు ప్రమాదంతో ఏడాది కాలంగా చికిత్స పొందుతున్నా. వైద్య బిల్లులు చెల్లించలేకపోతున్నాను. నేను ఆత్మహత్య చేసుకునేందుకు అవకాశం ఇవ్వండి’’ అని కోరుతూ ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌కు ట్వీట్‌ చేశాడు. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన శ్రీరామ్‌జీ శర్మ అనే వ్యక్తి రాయ్‌పూర్‌లో ఇంటీరియర్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. నిరుడు తన స్నేహితుడిని విమానం ఎక్కించేందుకు స్కూటీపై రాయ్‌పూర్‌ విమానాశ్రయానికి వెళ్లారు. తిరిగి వెళ్తున్న సమయంలో వాహనం జారిపడడంతో శర్మ గాయపడ్డారు. ఆయన కాలు, చేయి ఫ్ర్యాక్చర్‌ అయ్యాయి. బాధితుడు రాయ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కొద్ది కాలానికే ఆయన కాలు, చేయి పనిచేయడం ఆగిపోయింది. దీంతో స్నేహితుల సలహా మేరకు హైదరాబాద్‌ నగరానికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. గాయాలైన చోట ఎముకలు దెబ్బతిన్నట్లు తేలడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ క్రమంలో కిడ్నీ సమస్య కూడా రావడంతో దానికీ బాధితుడు చికిత్స తీసుకుంటున్నారు.

* దొర్నిపాడు మండలం డబ్ల్యు.కొత్తపల్లె గ్రామానికి చెందిన ఎల్లాల బాలలింగారెడ్డి(65) ఆస్తి తగాదాలో తమ్ముడు ఎల్లాల వెంకటరామిరెడ్డి చేతిలో ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు. గత రెండెళ్ల నుంచి వీరి మధ్య పొలం విషయంలో తరచూ గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలో డబ్ల్యు.కొత్తపల్లెలో ఇంటి వద్ద చోటుకున్న గొడవలో వెంకటరామిరెడ్డి, ఆయన కుమారుడు లోకేష్‌రెడ్డి ఎల్లాల బాలలింగారెడ్డిపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. హతుడి కుమారులు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డి, లోకేష్‌రెడ్డిలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు దొర్నిపాడు ఎస్‌ఐ తిరుపాలు చెప్పారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించిట్లు ఆయన తెలిపారు.

* వ్యవసాయం కలిసిరాక ఓ కౌలు రైతు కుటుంబం అప్పులపాలైంది. కుటుంబ పోషణ భారమై ఆ రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం వంకాయలపాడు గ్రామానికి చెందిన బాలినేని వినోద్‌కుమార్‌రెడ్డి (40) ఎనిమిది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది మిర్చి వేయగా పూర్తిగా దెబ్బతింది. దీంతో తిరిగి శనగ వేశాడు. అయినా కలిసిరాక నష్టాలపాలయ్యాడు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగడంతో సుమారు రూ.20 లక్షల వరకూ అప్పులు అయినట్లు సమాచారం. గ్రామంలో ఉన్న సొంత స్థలం అమ్ముకున్నా అప్పులు తీరలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై ఆదివారం ఉదయం వినోద్‌కుమార్‌రెడ్డి, భార్య అపర్ణ ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చాలాసేపటి తర్వాత.. ఆడుకోవడానికి వెళ్లి ఇంటికి వచ్చిన పిల్లలు తల్లిదండ్రుల పరిస్థితిని చూసి పొరుగున ఉన్నవారికి సమాచారమిచ్చారు. వారు వచ్చి చూసే సరికే వినోద్‌కుమార్‌రెడ్డి మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న అపర్ణను ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీఆర్వో కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

* అశ్వారావుపేట పట్టణంలోని అంబేడ్కర్ నగర్ (దొంతికుంట)లో దాసరి శాంతి కుమారి(20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఆమె సూసైడ్ చేసుకుంది. వరుడికి అంగవైకల్యం ఉందని తెలిసి యువతి ఆత్మహత్యకి పాల్పడినట్లు సమాచారం. వివాహం ఆగితే కుటుంబం పరువుపోతుందని ఇంట్లో ఎవరూలేని సమయంలో శాంతి కుమారి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*సంగారెడ్డి: జిల్లాలోని సదాశివపేట బైపాస్ రోడ్ వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్, బస్సు ఢీకొన్న ప్రమాదంలో చెట్లు నాటుతున్న కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సామెల్(55), భార్య రత్నమ్మ (50) మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*సూర్యాపేట: జిల్లాలోని మద్దిరాల మండలం పోలుమల్లలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం వ్యాను, బైక్ ఢీకొన్న ప్రమాదంలో వృద్ధురాలు జటంగి రాములమ్మ(50) దుర్మరణం పాలైంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నా. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

*భూవివాదం నేపథ్యంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇందుకు అధికార పార్టీ నాయ కుడు, పోలీసులే కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేతలు రాస్తారోకో చేశారు. ఈ సంఘటన మండలంలోని చింతకుంటరామయ్యపల్లిలో ఆదివారం సాయం త్రం చోటుచేసుకుంది.

*కశ్మీరులోయలో ఆదివారం నలుగురు ముష్కరులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఉగ్రవాది షౌకత్‌ అహ్మద్‌ షేక్‌ని అరెస్టు చేసిన తర్వాత కుప్వారాలో ముమ్మర సోదాలు చేపట్టారని ఐజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో పోలీ్‌సలు ఎదురు కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో పాకిస్థాన్‌కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారన్నారు. అలాగే, కుల్గాంలో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయన్నారు.

*నందిగాం మండలం పెద్దతామరపల్లిలో వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మందికి తీవ్రగాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు వలస కార్మికులతో పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*బిహార్‌లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. బిహార్‌లో పిడుగులకు 17 మంది దుర్మరణం చెందారు. ఆయా ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఉరుములు, పిడుగులతో కురిసిన వర్షానికి భాగల్‌పూర్‌లో ఆరుగురు, వైశాలి జిల్లాలో ముగ్గురు, ఖగారియాలో ఇద్దరు, బంకాలో ఇద్దరు, కతిహార్‌లో ఒకరు, సహర్సాలో ఒకరు, మాధేపురాలో ఒకరు, ముంగేర్‌లో ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని సీఎం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

*డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా బస్సు బోల్తా పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరాపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన పలువురు విహారయాత్ర కోసం టూరిస్ట్ బస్సులో కేరళకు బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరాపల్లి సమీపంలోకి రాగానే డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకుని.. జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొట్టాడు. దీంతో బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది.

*విశాఖపట్నం: నగరంలోని సబ్బవరం జాతీయ రహదారి పక్కన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
రక్తపుమడుగులో వ్యక్తి మృతదేహం పడిఉంది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గొంతు కోసి హతమార్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హతుడు కేబుల్ ఆపరేటర్ సింహాచలంగా గుర్తించారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు మృతి చెందారు. పోలీసులు వివరాల మేరకు.. బెంగళూరు నుంచి గుంటూరుకు రొయ్యల దాన బస్తాలు తీసుకెళ్తున్న లారీ రాత్రి 10 గంటలకు గువ్వల చెరువుకు చేరింది. ఘాట్ రోడ్లోని నాలుగో మలుపు వద్దకు రాగానే.. లారీ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. దాదాపు వంద అడుగుల లోతులోకి లారీ దూసుకెళ్లడంతో.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్యాబిన్లో చిక్కుకున్న క్లీనర్ను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. లారీ నుంచి అతికష్టం మీద మృతదేహాన్ని పోలీసులు పైకి తీసుకొచ్చారు.

*పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. శ్రీకాకుళం నుంచి 50 మంది ప్రయాణికులతో విజయవాడ వెళ్తున్న ఎస్వీడీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు సిమెంటు దిమ్మెను ఢీకొని కాలవ గట్టుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం పాములేరు వద్ద విషాదం చోటుచేసుకుంది. వాగులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కొల్లూరు గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు మారేడుమిల్లి పర్యాటక అందాలను సరదాగా తిలకించేందుకు వచ్చారు. అనంతరం స్నానాలు చేసేందుకు పాములేరు వాగులో దిగగా.. కాళిదాసు సందీప్ (20), దాన అరుణ్ కుమార్ (22) అనే ఇద్దరు యువకులు మునిగిపోయారు.

*విజయవాడ బాసలికా చర్చిలో ప్రసాదరావు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందటం కలకలం రేపుతోంది. ఈ ఉదయం చర్చిలో పనిచేసే సిబ్బంది ఆయన ఉరేసుకొని ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ప్రసాదరావు సీఎస్ఐలో అటెండర్‌గా పనిచేసే వాడని తెలిసింది. నిన్న రాత్రి నందిగామ వెళుతున్నానని ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తెల్లారేసరికి శవమై కనిపించటంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటం, చర్చిలో రక్తపు మరకలు కనిపించటం పలు అనుమానాలకు తావిస్తోంది.