NRI-NRT

యూకేలో.. బామ్మ వంట హిట్‌

యూకేలో.. బామ్మ వంట హిట్‌

మంజూస్‌ రెస్టారెంట్‌కి వెళ్లారనుకోండి. ఎన్నో గుజరాతీ వంటకాలు మెనూలో కనిపిస్తాయ్‌. దానిలో కొత్తేముంది? ఏ గుజరాతీ రెస్టారెంట్‌కి వెళ్లినా ఇవే ఉంటాయ్‌.. అంటారా! అయితే అది ఉన్నది యూకేలో.. దాన్ని నిర్వహిస్తోంది.. 85 ఏళ్ల బామ్మ. ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలనుందా? అయితే చదివేయండి.

బామ్మ పేరు మంజూ. పుట్టింది భారత్‌లోనే. కానీ ఆమె అమ్మా నాన్న బతుకుదెరువు కోసం ఉగాండాలో స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ ఈమె తన అమ్మమ్మ వాళ్లింటికి వస్తుండేది. వాళ్లమ్మ కూడా వంట బాగా చేస్తుంది. దీంతో బామ్మకీ చిన్నతనం నుంచీ వంటలపై ఆసక్తి ఏర్పడింది. బాగా నేర్చేసుకుంది కూడా. తనకు 12 ఏళ్ల వయసులో వాళ్ల నాన్న చనిపోయారు. కుటుంబాన్ని వాళ్లమ్మే నడిపేది. తనకు 14 ఏళ్లు వచ్చేప్పటికి వాళ్లమ్మకి సాయంగా చిన్న హోటల్‌ పెట్టి, గుజరాతీ వంటలను అమ్మేది. స్పందన బాగుండటంతో బతుకు దెరువుకు ఢోకా లేదు. ఈమెకీ పెళ్లై, ఇద్దరు పిల్లలు పుట్టారు. 1972లో కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా ఉగాండా వదలాల్సి వచ్చిందీమెకు. బంధువులు సాయం చేస్తాం యూకేకి రమ్మంటే పిల్లలతో సహా వెళ్లి, అక్కడ ఓ ఎలక్ట్రిక్‌ ఫ్యాక్టరీలో చేరింది.

వంట చేయడంలో తన ప్రేమని మాత్రం మరచిపోలేదామె. తన పిల్లలకు గుజరాతీ వంటల్నే వండిపెట్టేది. తనకు 65 ఏళ్లు వచ్చే వరకూ ఫ్యాక్టరీలో చేస్తూనే ఉంది. వంటపై అమ్మకున్న ప్రేమ కొడుకులకూ తెలుసు. వాళ్లు కొంచెం నిలదొక్కుకున్నాక ఆమె కోసం 2017లో బ్రైటన్‌లో ఓ పాత కేఫ్‌ను కొని రెస్టారెంట్‌గా మలిచారు. ‘సొంతంగా రెస్టారెంట్‌ నిర్వహించాలన్నది నా కల. ఎప్పటికైనా పెట్టాలని తపించేదాన్ని. దాన్ని నా పిల్లలు గమనించారని ఎప్పుడూ అనుకోలేదు. పూర్తిగా భారతీయ సంప్రదాయంలో దాన్ని తీర్చిదిద్ది ‘మంజూస్‌ రెస్టారెంట్‌’ అని నా పేరే పెట్టి బహుమతిగా ఇచ్చారు. ఆ ఆనందాన్ని మాటల్లోనే చెప్పలేను. ఆకలి విలువ నాకు తెలుసు. ఇద్దరు చిన్నపిల్లల్ని చంకనేసుకుని ఎన్నో ఇళ్లు మారా. అందుకే ఎవరైనా ఆకలితో ఉన్నా, ఇల్లు లేకుండా ఉన్నా తట్టుకోలేను. వచ్చిన వాళ్లు కడుపు నిండుగా తిని ఆనందంగా వెళ్లేలా చూస్తా’ అంటుందీ బామ్మ. ఈమె వయసు 85. అయినా ఉదయం ఏడు నుంచి రాత్రి వరకూ కోడళ్లతో కలిసి రెస్టారెంట్‌లో వంటకాల్ని సిద్ధం చేస్తుంది. మూడు నెలల్లోనే రెస్టారెంట్‌కు ఆదరణ పెరిగిపోయిందట. ఎంతగా అంటే… ఇప్పుడు అక్కడ తినాలంటే రిజర్వేషన్‌ తప్పనిసరి. భారతీయులే కాదు.. విదేశీయులూ ఆమె వంటలకు లొట్టలేస్తున్నారని బోసి నవ్వుతో మురిసిపోతోందీ బామ్మ.