DailyDose

పరిమితిలోనే తెలంగాణ అప్పులు

Auto Draft

రాష్ర్ట అప్పులు.. పరిమితికి లోబడే ఉన్నట్టు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా నివేదికలో మరోసారి నిర్ధారించింది. ఆర్బీఐ విడుదలచేసిన జూన్‌ నివేదికలో.. తెలంగాణ చేసిన అప్పు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడే ఉన్నట్టు వెల్లడించింది. తెలంగాణ కన్నా దాదాపు 13 పెద్ద రాష్ర్టాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఎప్పుడో దాటేశాయి. అయినప్పటికీ యూపీ, పశ్చిమబెంగాల్‌, పంజాజ్‌, ఏపీ వంటి రాష్ర్టాలు ఈ ఏడాది రుణాలు తీసుకోవడానికి సైతం కేంద్రం అంగీకరించింది. పరిమితికి లోబడే ఉన్న తెలంగాణకు మాత్రం అడ్డుపడుతున్నది. బీజేపీ సర్కారు తన రాజకీయ ప్రయోజనంకోసమే తెలంగాణ రుణ సమీకరణను అడ్డుకొంటున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

నిబంధనల ప్రకారం రాష్ట్ర అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలోపు ఉంటే కొత్తగా రుణాలు చేసేందుకు కేంద్రం అడ్డు చెప్పరాదు. ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం జీఎస్డీపీ విలువలో 25% వరకు రుణాలు తీసుకొనే అవకాశం రాష్ర్టానికి ఉంటుంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ అప్పు 2019-20 నాటికి 23% మాత్రమే. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరాల అంచనాలు సైతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటలేదు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పు చేయకుండా కేంద్రం ఆటంకాలు సృష్టిస్తున్నది. తెలంగాణ కంటే ఎక్కువ అప్పు చేసిన రాష్ర్టాలకు అదనంగా అప్పుచేసేందుకు అనుమతిచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం కొత్త రుణ సమీకరణలకు అడ్డుచెప్పడం ద్వారా రాష్ర్టాన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయాలన్న దురుద్దేశం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి దాటి అప్పులు చేసిన రాష్ర్టాలలో బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాలతోపాటు అనేక పెద్ద రాష్ర్టాలున్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఆయా రాష్ర్టాల అప్పులు ఐదేండ్ల అనంతరం ఎలా ఉంటాయో ఆర్బీఐ అంచనావేసింది. దీని ప్రకారం తెలంగాణ అప్పు 13 పెద్ద రాష్ర్టాల కంటే తక్కువే ఉంటుందని పేర్కొన్నది. 2026-27 నాటికి తెలంగాణ అప్పు 29.8% ఉండవచ్చని తెలిపింది.