Food

బాణలి బామ్మలు!

బాణలి బామ్మలు!

సంపాదించే పిల్లలు, తరగని ఆస్తులు ఉంటే చాలు.. కాలుమీద కాలేసుకుని కూర్చుని బతుకుతున్నామని గొప్పలు పలికే రోజులివి. ఆమె మాత్రం కూర్చుని తినేవాళ్ల కోసం పాతకాలపు పిండివంటలు వండిపెడుతూ క్షణం తీరికలేకుండా పనిచేస్తున్నారు. పసందైన పల్లె రుచులను పట్నం వాసులకు వడ్డిస్తున్నారు ‘బాణలి’ ఉష పెన్మత్స. తోబుట్టువు సీతారాజేశ్వరితో కలిసి ఆరుపదుల వయసులో ఆంత్రప్రెన్యూర్‌ అవతారం ఎత్తారు.

కొడుకు అమెరికాలో. తాను వైజాగ్‌లో.ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయారు ఉష. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న బిడ్డకు దగ్గరగా ఉందామని ఇక్కడికి వచ్చేశారు. కొన్ని రోజులకు అక్క సీతారాజేశ్వరి కూడా నర్సాపురం నుంచి హైదరాబాద్‌కు మారిపోయారు. ఇద్దరూ బోయిన్‌పల్లిలో ఉంటారు. ఇద్దరికీ అరవై పైబడ్డాయి. పిల్లలు బాగానే సంపాదిస్తున్నారు. హాయిగా కూర్చుని తినొచ్చు. కానీ మనిషి చివరి వరకూ శక్తి మేరకు పని చేయాల్సిందే అనే ఫిలాసఫీతో శక్తికి మించి పనిచేస్తారు ఉష, రాజేశ్వరి. ఇంటినే ప్రయోగశాలగా మార్చుకుని పాక శాస్త్రంలో రకరకాల ప్రయోగాలు చేశారు ఇద్దరూ.అందరి కోసం ఎంతైనా పాతకాలపు మనుషులు కదా! ఇంట్లో సంతోషాన్ని నాలుగిళ్లకు పంచడం అలవాటు.
IMG-20220622-WA01
ఉష స్వీట్స్‌ బాగా చేస్తారు. గోర్‌ మిట్టీలు, బెల్లం పూతరేకులు, కోవా బిళ్లలు, బెల్లం గవ్వలు, బూందీ లడ్డూలు, చిట్టి కాజాలు.. ఒక్కసారి తిన్నవాళ్లు మొహమాటం లేకుండా మళ్లీ అడగాల్సిందే. వీలైతే, పొట్లం కట్టివ్వమని బతిమాలాల్సిందే. సాంబారు పొడి, పల్లీ పొడి, వెల్లుల్లి కారం, కరివేపాకు పొడి, కాకరకాయపొడి, మునగాకు పొడి రుచుల ఖజానాలే. చేపలతో చాలా వంటలే వండుతారు. రొయ్యలు, కొర్రమీనులు, పండుగప్పలతో గొప్ప రుచులకు ప్రాణం పోస్తారు. మిఠాయిల నుంచి మీనాల వరకూ.. ఎక్కడా తగ్గేదే లే! మాకూ వండిపెట్టమని బంధువులు, తెలిసినవాళ్లు అడగడం, కాదనలేక వీళ్లూ వండిపెట్టడం నిత్యకృత్యం అయిపోయింది. అంతలోనే కొవిడ్‌ వచ్చింది. అన్నీ మూతపడ్డాయి. అదే సమయంలో దగ్గరి బంధువు
ఆర్‌ఎస్‌ రాజు ఓ ఐడియా ఇచ్చారు.

‘హోమ్‌ మేడ్‌ ఫుడ్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. మీరు సిద్ధం కండి. నేను మార్కెటింగ్‌ చేస్తాను’ అని ప్రోత్సహించారు. ఈస్ట్‌ మారేడ్‌పల్లిలో కిచెన్‌ కూడా ఏర్పాటు చేశారు. బాణలి లేకపోతే.. వంట చేయలేం! డాక్టర్‌కు స్టెతస్కోప్‌ లాంటిది.. పాక నిపుణులకు బాణలి. కాబట్టి, ఆ పేరే ఖరారు చేశారు. కమ్మని రుచుల కోసమే కాదు.. అమ్మను, అమ్మమ్మను గుర్తు చేసుకునేందుకు కూడా చాలామంది ఆర్డర్‌ చేస్తున్నారు! ‘బాణలి’లో ఏ పదార్థమూ షోకేస్‌లో సిద్ధంగా ఉండదు. ఆహారాన్ని వృథా చేయకూడదన్నది అక్కాచెల్లెళ్ల సిద్ధాంతం. ఆర్డర్‌ ఇస్తే.. 24 నుంచి 48 గంటల లోపు ఇంటికి పంపిస్తారు.
IMG-20220622-WA02
ఏడాదిలోపే..
సరిగ్గా ఉగాది నాడు ప్రారంభమైంది.. బాణలి. జనానికి ఆ పేరు నచ్చింది. రుచులూ నచ్చాయి. ఆనోటా, ఈనోటా బాణలి గురించి విన్నవాళ్లు సంప్రదాయ రుచుల కోసం ఫోన్‌ చేసి ఆర్డర్‌ ఇస్తున్నారు. ఒక అపార్ట్‌మెంట్‌లో ఒకరు ఆర్డర్‌ చేస్తే, నెల తిరిగే సరికల్లా పది ఆర్డర్లు వస్తున్నాయి. ఇలాంటి వాళ్ల కోసమే బాణలి గేటెడ్‌ కమ్యూనిటీల్లో స్టాల్స్‌ నిర్వహిస్తున్నది.‘వాట్సాప్‌లో వంటకాలు, వాటి ధరలు ముందు రోజు పంపిస్తే, ఆ గేటెడ్‌ కమ్యూనిటీ అడ్మిన్‌ అందరికీ చేరవేస్తారు. కావలసిన వాళ్లు వచ్చి కొంటున్నారు’ అని చెబుతారు గేటెడ్‌ కమ్యూనిటీస్‌లో ‘బాణలి’ స్టాల్స్‌ పర్యవేక్షించే సుధాకర్‌.

‘బాహుబలి’ రుచులు..
ప్రభాస్‌కు స్వీట్స్‌ అంటే చాలా ఇష్టం. ‘బాణలి’ బామ్మల తీపిరుచుల గురించి ఆయన చెవిన పడింది. వెంటనే కాజూ పకోడీ, మరికొన్ని స్వీట్స్‌ తెప్పించుకున్నారు. అంతే, ఆ రుచికి ఫిదా అయిపోయారు. మళ్లీ మళ్లీ ఆర్డర్‌ ఇచ్చారు. ప్రభాస్‌ సిఫారసుతో రాజమౌళి కుటుంబమూ కస్టమర్స్‌ జాబితాలో చేరింది. దర్శకుడు రాఘవేంద్రరావు కూడా బంధువుల ద్వారా తెలుసుకుని ‘బాణలి’ పచ్చళ్లు, పొడులు తెప్పించుకున్నారట. ఇదంతా ఏడాది కాలంలో సాధించిన విజయం. వ్యాపారమంటే పెద్దగా ఆసక్తి లేకున్నా, వంటల పట్ల ఇష్టమే ఆ తోబుట్టువులను ఆరుపదుల వయసులో ఫుడ్‌ప్రెన్యూర్స్‌గా మార్చేసింది.