NRI-NRT

ఇది… అమెరికా కుంకుమపువ్వు!

ఇది… అమెరికా కుంకుమపువ్వు!

కిలో కుంకుమపువ్వు ధర… సుమారు మూడు లక్షల రూపాయలు. అలాగని దాన్ని ఎక్కడంటే అక్కడ పండించేస్తున్నారనో దాని ధర అమాంతం పడిపోయిందనో అనుకుంటే పొరబాటే. ఎందుకంటే ఇదీ పువ్వే, కానీ కుంకుమ కాదు, కుసుమ పువ్వు… డూప్లికేట్‌ శాఫ్రాన్‌. దీని మరోపేరే అమెరికన్‌ శాఫ్రాన్‌. ఈ మొక్క పూరేకులూ ఆకులూ గింజలూ కూడా అమృతతుల్యమే. అందుకే ఎందరో రైతులు ‘సుమం… కుసుమం’ అంటున్నారు. కుంకుమపువ్వుకి కేసరాలే ప్రాణం. పొద్దుతిరుగుడుకి గింజలే ధనం. గోంగూరకి ఆకులే రుచి. తేయాకుకి చిగురాకే ఔషధం. కుంకుమ కేసరాలు ఓ అద్భుత సుగంధద్రవ్యమైతే, పొద్దుతిరుగుడు గింజలు ఆరోగ్యకరమైన వంటనూనె వనరులు. గోంగూర ఆకులు అద్భుత పోషకనిల్వలు. తేయాకులో చిగురాకులే శక్తిమంతమైన తేనీరు. వీటన్నింటి సుగుణాలూ పుణికి పుచ్చుకున్నదే కుసుమ మొక్క. దీని పూరేకులు కుంకుమపువ్వుకి ప్రత్యామ్నాయం(నకిలీ సుగంధద్రవ్యమే కావచ్చు)కాగా, గింజల నుంచి తీసే నూనె కూడా ఆరోగ్యప్రదమైనదే. ఆకులూ కాడలూ అన్నీ ఆహారంలో వాడుకోగలిగినవే. అందుకే ఈ మొక్కే ఓ అద్భుత ఔషధం అని శాస్త్రవేత్తలు అంటే, ఇది ఎంతో లాభదాయకమైన పంట అంటున్నారు భారతీయ రైతులు. ఒకప్పుడు కేవలం గింజలకోసం కర్ణాటక, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాల్లో ఎక్కువగా పండించే కుసుమని, ఇప్పుడు మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో కూడా పండించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయుర్వేద వైద్యవిద్యను మధ్యలో వదిలేసిన జలగావ్‌ జిల్లాకి చెందిన సందేశ్‌, తనకున్న అర ఎకరంలో పూలకోసం దీన్ని పండించి సుమారు ఐదున్నర లక్షల లాభం పొందాడట. దాంతో అనేకమంది ఈ పంటవైపు చూస్తున్నారు.

**తొలి స్థానం మనదే!
నిజానికి ఇది చాలా పురాతన పంట. ప్రాచీన ఈజిప్టు, గ్రీకు నాగరికతల్లోనూ వీటి ప్రస్తావన ఉంది. మనదగ్గర కూడా ఒకప్పుడు బాగానే పండించేవారు. ఆ తరవాత రకరకాల నూనెలు వాడుకలోకి రావడంతో దీని వాడకం తగ్గింది.
ఇటీవల జరిగిన పలు పరిశోధనల్లో కుసుమ నూనె ఆరోగ్యానికి మంచిదని తేలడంతో మళ్లీ ఈ పంటకి ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా ఈ పూరేకుల్ని ఫుడ్‌కలర్‌గానూ ఔషధాల తయారీలోనూ వాడుతున్నారు. ఎండిన మొక్కలు బలవర్ధకమైన పశుగ్రాసం కూడా. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన నింబకర్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దీనిమీద అనేక పరిశోధనలు చేసి, పొడి వాతావరణంలో కూడా పండేలా ఆకులకీ కాడలకీ ముళ్లు లేని హైబ్రిడ్‌ వెరైటీలను రూపొందించింది. దాంతో ఏటా అత్యధికంగా రెండు లక్షల టన్నుల కుసుమల్ని పండిస్తూ తొలిస్థానంలో నిలిచిన ఘనత మనదే.కుంకుమ… కుసుమ..!

రూపంలో పోలికలున్నా ఈ రెండు మొక్కలూ ఒక జాతి కాదు. ఒక రకం కాదు. కానీ ఎండిన కుసుమపూల రేకులు చూడ్డానికి అచ్చంగా కుంకుమపువ్వులానే ఉండటంతో షెఫ్‌లు దీన్ని వంటలో పసుపు రంగుకోసం వాడుతున్నారు. నిశితంగా చూస్తే ఈ రెండింటికీ తేడా తెలుస్తుంది. కుంకుమపువ్వు చూడ్డానికి చాలా సున్నితంగా ఎరుపురంగులో ఉంటే, కుసుమపువ్వు బరకగా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. అది పువ్వులోని కేసరాలు, ఇది పూరేకులు. కుంకుమపువ్వు ఒకటి రెండు రేకులు వేసినా రంగు వస్తుంది. వాటితో పోలిస్తే వీటిని ఎక్కువగానే వేయాలి. కుసుమపూలకి కుంకుమపువ్వు అంత ఘాటైన వాసన కూడా ఉండదు. కుంకుమపువ్వు తేనె ఫ్లేవర్‌తో ఉంటే కుసుమ తియ్యని చాకొలెట్‌ రుచిని కలిగి ఉంటుంది. కుంకుమపువ్వుని భారత, ఇటాలియన్‌ షెఫ్‌లు ఎక్కువగా పాయసాలూ స్వీట్లూ రిజెట్టోల తయారీలో వాడితే; మధ్యతూర్పు, తూర్పు, లాటిన్‌ అమెరికా దేశాల్లోని షెఫ్‌లు సాస్‌లూ టీలూ ఆమ్లెట్లూ సూపుల తయారీలో కుసుమ పూరేకుల్ని వాడుతుంటారు.

* కుంకుమపువ్వులాగే, కుసుమపువ్వుకీ ఆరోగ్య శోభ ఉండనే ఉంది. ఈ పూల టీ అనేక ఔషధగుణాల్నీ పరిమళిస్తుంది. జీర్ణకోశాన్ని శుభ్రం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. విరిగిన ఎముకలకి ఈ టీ మంచిదని చైనా సంప్రదాయ వైద్యం పేర్కొంటోంది.

* ఈ పూలల్లో నియాసిన్‌ ఎక్కువ. దాంతో ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా హృద్రోగాలను నియంత్రిస్తుంది. పొంగు, దురదలు, ఇంకా చర్మ సంబంధిత అలర్జీల చికిత్సలో ఈ పువ్వుని మందుగా వాడుతుంటారు.ఆకులూ పోషకనిల్వలే!

కుసుమ మొలకల్లో యాంటీఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. మెంతి, పాలకూరల్లో కన్నా వీటిల్లో యాంటీఆక్సిడెంట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని కూరల్లోనూ సలాడ్లలోనూ వాడతారు. లేత ఆకులూ కాడల్లో విటమిన్‌-ఎ, ఫాస్ఫరస్‌, కాల్షియంలు అధికంగా ఉంటాయి.

* ఈ ఆకులతోనూ టీ చేసుకుని తాగుతారు. వీటితో కూరా, పప్పూ కూడా వండుకోవచ్చు. వీటిల్లో ఐరన్‌, కాల్షియం వంటి ఖనిజాలతోబాటు, ఎ, సి- విటమిన్లూ, ఫైటోకెమికల్సూ సమృద్ధిగా ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణవ్యవస్థ బాగుంటుంది. కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.

* మధుమేహం, హృద్రోగాలు, క్యాన్సర్లు… వంటివి రావన్న కారణంతో చైనీయులూ ఈ ఆకులతో చేసిన టీ తాగుతుంటారు. ఈ టీ ఆడవాళ్లలో వంధ్యత్వాన్నీ అబార్షన్లనూ నివారిస్తుందట. రెండు రోజులకి ఓసారి ఒక అరకప్పు లేదా కప్పు చొప్పున తాగినా మనసు ప్రశాంతంగా అనిపిస్తుందట.

* ఈ టీని ఉదయం భోజనానంతరం, రాత్రి భోజనానికి ముందు- ఇలా రోజూ రెండుసార్లు తాగితే పొట్టలో పేరుకున్న హానికర పదార్థాలన్నీ తొలగిపోతాయి. సొరియాసిస్‌తో బాధపడేవాళ్లకీ ఈ టీ చాలా మంచిది.గింజలూ నూనెలూ అన్నీ మేలే!

ఇరవయ్యో శతాబ్దం ప్రారంభం వరకూ ఈ నూనెను పెయింట్లూ వార్నిష్‌ల తయారీలోనే ఎక్కువగా వాడేవారు. కానీ ఇటీవల వంటల్లోనూ దీని వాడకం పెరిగింది. కుసుమ గింజల నుంచి మోనో అన్‌శాచ్యురేటెడ్‌ (ఓలీయక్‌), పాలీఅన్‌శాచ్యురేటెడ్‌(లినొలీయక్‌) అని రెండు రకాల నూనెల్ని తీస్తారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే. మొదటిది అధిక ఉష్ణోగ్రత దగ్గర వండే వేపుళ్లకి మంచిదయితే, రెండోది సలాడ్ల వంటి వాటికి బాగా పనికొస్తుంది. ఈ నూనెలు హృద్రోగాలు, పక్షవాతం, మధుమేహం… వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. నెలసరి నొప్పితో బాధపడేవాళ్లు ఆహారంలో ఈ నూనె వాడటం వల్ల దాని తీవ్రత చాలావరకూ తగ్గుతుందట. కొవ్వుని కరిగించడం ద్వారా ఊబకాయాన్నీ తగ్గిస్తుంది. మొత్తంగా రోగనిరోధకశక్తిని పెంచే ప్రొస్టాగ్లాడిన్ల తయారీకి తోడ్పడుతుంది.

* కీళ్లూ కండరాల నొప్పులకీ ఈ నూనెతో మసాజ్‌ చేస్తే త్వరగా తగ్గుతుందట. రక్తం ఎక్కువగా గడ్డకట్టుకుపోయే లక్షణాలు ఉన్నవాళ్లకీ ఇది మంచిది. ఈ నూనె రక్తాన్ని పలుచగా చేస్తుంది. అందుకే శస్త్రచికిత్సల అనంతరం మాత్రం దీన్ని ఎక్కువగా వాడకూడదు.

**సుందర కుసుమ!
విటమిన్‌-ఇ ఇందులో సమృద్ధిగా ఉండటంతో ఆలివ్‌ నూనె మాదిరిగానే కుసుమ నూనె చర్మ, కేశ సౌందర్యానికీ దోహదపడుతుంది. కుదుళ్లకు దీన్ని పట్టించడం వల్ల అవి ఆరోగ్యంగా పెరగడంతోబాటు జుట్టు మెరుస్తూ ఉంటుంది. పూర్వం చైనా మహిళలు జుట్టు మెరిసేందుకు ఈ నూనెతో బాగా మర్దన చేయించుకునేవారట. అలాగే ఈ నూనెను ఒంటికి పట్టించడంవల్ల ఇది చర్మ రంధ్రాలు తెరచుకునేలా చేస్తుంది. తద్వారా మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌… వంటి సమస్యల్నీ మచ్చల్నీ తగ్గించి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే ఇప్పుడు అంతా కుండీల్లోనయినా కుసుమ మొక్కల్ని పెంచేందుకు ఉత్సాహపడుతున్నారు. మరి మీరూ పెంచండి..!