NRI-NRT

దేశాన్ని వదిలేస్తున్న కుబేరులు

దేశాన్ని వదిలేస్తున్న కుబేరులు

మన దేశానికి చెందిన అపర కుబేరులు దేశం వదలి పోతున్నారు. ఎందుకు వీరంతా దేశం వదిలిపోతున్నరన్న దానిపై ఇంత వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వివరణ రాలేదు. అపర కుబేరు మన దేశం పెట్టుబడులకు, వ్యాపారాలకు , నివసించేందుకు అంత సురక్షితం కాదని భావిస్తున్నారా…? దీనికి సమాధం అవుననే నిపుణులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 8 వేల మంది ధనవంతులు దేశం విడిచి వెళ్లిపోయారు. 2018లో వెలువడిన ఒక నివేదిక ప్రకారం 2014 నుంచి 2018 వరకు 23 వేల మంది అపర కుబేరులు మన దేశం నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడ్డారు. ఇటీవల కాలంలో వలస వెళ్లినవారిపై గ్లోబల్‌ వెల్త్‌ ఇమిగ్రేషన్‌ రివ్యూ రిపోర్టు ప్రకారం 2020లో 5 వేల మంది ఇలా వెళ్లారు.

దేశం మొత్తంలో ఉన్న అపర కుబేరుల్లో ఇది 2 శాతమని ఈ రిపోర్టు పేర్కొంది. కోవిడ్‌ కాలంలో ఈ వలసలు ఎక్కువగా జరిగాయని నివేదకలు చెబుతున్నాయి. హెంట్లీ అండ్‌ పార్టనర్స్‌( హెచ్‌ అండ్‌ పి) ప్రకారం భారత్‌కు చెందిన కుబేరులు ఇక్కడ ఉండే కంటే తమ వ్యాపారాలను, జీవనాన్ని గ్లోబలైజ్‌ చేసుకోవాలని భావిస్తున్నారని తెలిపింది. డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో క్లయింట్‌కు సేవలు అందించేందుకు ఈ సం స్థ గత సంవత్సరం మన దేశంలో తన ఆఫీస్‌ను ప్రారంభించింది. ఒక దశాబ్దం క్రితం పంజాబ్‌ వంటి రాష్ట్రాల నుంచి పేద రైతులు, కూలీలు మెరుగైన జీవనం కోసం చాలా దేశాలకు వలసలు వెళ్లారు. తరువాత కాలంలో ఇండియా నుంచి వృత్తి నిపుణులు, ఐటీ రంగానికి చెందిన వారు వలసలు వెళ్లారు.ఇది మూడో వేవ్‌ వలసలుగా ఉన్నాయని కెనడా-ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ మేయిన్‌ స్ట్రీట్‌ ఈక్విటీ కార్పోరేషన్‌కు చెందిన బాబ్‌ ధిల్లన్‌ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఇండియా నుంచి అపర కుబేరులు పెద్ద సంఖ్యలో దేశం విడిచిపోతున్నారని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని చెబుతున్న ఇండియాకు ఇలాంటి వలసలు ఆందోళన కల్గించేవేనని ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశం వీడుతున్న వారు వారి మొత్తం సంపదను ఇక్కడి నుంచి తరలించకపోయినప్పటికీ ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇది అంత క్షేమకరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా దేశాలు వారి దగ్గర పెట్టుబడులు పెట్టే వారికి పర్మినెంట్‌ రెసిడెన్షీ , పౌరసత్వం ఇస్తున్నాయి. అపర కుబేరులు దేశం విడిచిపోవడం వల్ల పన్నుల రూపంలో మన దేశం తీవ్రంగా నష్టపోతున్నది. ఇలా దేశం విడిచిపోతున్న వారిలో ప్రధానంగా ఇన్వెస్ట్‌ మెంట్‌ కంపెనీలకు చెందిన వారు, అంతర్జాతీయంగా బిజినెస్‌ చేస్తున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు.

ఇక్కడ పన్నుల నుంచి తప్పించుకునేందుకే వీరు దేశం విడిచిపోతున్నారని భావిస్తున్నారు. దేశంలో వ్యక్తిగత పన్నులు కూడా ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది పన్నుల భారం లేని యూనైటెడ్‌ అరబ్‌ ఎమరేట్స్‌, సింగపూర్‌ వంటి దేశాల్లో స్థిరపడేందుకు ఎక్కవ ఆసక్తి చూపిస్తున్నారు. వీటితో పాటు ఎక్కువ మంది అమెరికా, బ్రిటన్‌, కెనడా, యూరోపియన్‌ దేశాల్లో స్థిపడుతున్నారు. డిజిటల్‌ రంగంలో ఉన్న సంస్థల అధిపతులు ఎక్కువ సింగపూర్‌లో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దుబాయి ఇస్తున్న గోల్డెన్‌ వీసాలు కూడా మన కుబేరులను బాగా ఆకర్షిస్తోంది. ఇండియాలో సంపదపై 30 శాతం ఆదాయపన్ను, దానిపై 37 శాతం సర్‌ఛార్జ్‌ ఉంటుందని, కనీసంగా పన్ను 42.74 శాతం ఉందని దీని వల్లే ఎక్కువ మంది పన్నులు చెల్లించకుండా విదేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని డిలైట్‌ ఇండియా నిపుణులు అంచనా అభిప్రాయపడ్డారు.