NRI-NRT

భారతీయుడికి ప్రతిష్ఠాత్మక ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్..!

భారతీయుడికి ప్రతిష్ఠాత్మక  ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్..!

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు అనేక రంగాల్లో తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటూ అగ్రగాములుగా నిలుస్తున్నారు. తాజాగా.. వ్యాపార రంగంలో దూసుకుపోతున్న మరో భారతీయ సంతతి వ్యక్తికి ఓ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ప్రముఖ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై) ఏటా ప్రకటించే ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్‌ (ఈస్ట్ సెంట్రల్) అవార్డుకు ఈసారి ఓహాయో రాష్ట్రానికి చెందిన గతి ఎనలిటిక్స్ వ్యవస్థాపకుడు వంశీ కోరా ఎంపికయ్యారు. సృజనాత్మకత, ధైర్యస్థైర్యాలతో వ్యాపారరంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న మేటి వ్యాపారవేత్తలను ఈవై సంస్థ ఈ అవార్డుతో సత్కరిస్తుంటుంది. వెస్ట్రన్ పెన్సిల్వేనియా, వెస్ట్ వర్జీనియా, నార్త్ఈస్ట్ అండ్ సెంట్రల్ ఓహాయో, కెంటకీ రాష్ట్రాల్లోని వ్యాపార ప్రముఖుల్లో అగ్రగాములు ఏటా ఈ అవార్డును దక్కించుకుంటారు. 2022కి గాను ఈ అవార్డు దక్కించుకున్న పది మందిలో వంశీ కోరా ఒకరు.

తనకు ఈ అవార్డు దక్కడం పట్ల వంశీ కోరా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది నిజంగా అద్భుతం. 45 ఏళ్ల వయసులో గతి సంస్థను ప్రారంభించగా ఆ తరువాత 50 నెలలకే గతి ఎనలిటిక్స్‌ను ఎపెక్సాన్‌ సంస్థ ఎక్వైర్ చేసింది. ఇక గతీ ఎనలిటిక్స్ సంస్థను స్థాపించడం, అభివృద్ధి చేయడం ఓ గొప్ప అనుభవం. ఈ ప్రయాణంలో నాకు కుటుంబం, స్నేహితులు, సాటి ఉద్యోగులు ఎంతో తోడ్పాటునందించారు’’ అని వంశీ కోరా వ్యాఖ్యానించారు. ఎపెక్సాన్‌లో గతి ఎనలిటిక్స్ విలీనమయ్యాక.. ఎపెక్సాన్ సంస్థ 600 మందికి పైగా ఉద్యోగులతో అద్భుత ప్రగతి సాధిస్తోందని చెప్పారు. డాటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంలో కస్టమర్లకు సహాయపడటమే తమ లక్ష్యమన్నారు. ఇక.. ఈవై ప్రాంతీయ అవార్డులకు ఎంపికైన వారు.. జాతీయ స్థాయిలో ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ నేషనల్ అవార్డు కోసం పోటీపడతారు. న్యాయనిర్ణేతల ప్యానెల్ ఎంపిక చేసిన వ్యాపారవేత్తకు నవంబర్‌లో జాతీయ బహుమతి ప్రదానం జరుగుతుంది.