NRI-NRT

గల్ఫ్‌లో తెలుగు వెలవెల.. మాతృభాషపై ఆసక్తి చూపని తెలుగోళ్లు

గల్ఫ్‌లో తెలుగు వెలవెల.. మాతృభాషపై ఆసక్తి చూపని తెలుగోళ్లు

విదేశీ గడ్డపై ఉంటూ మాతృభాషపై మమకారం ప్రదర్శించే తెలుగు భాషా సంఘాలు… ఆచరణలో మాత్రం పిల్లలకు తెలుగు బోధనపై ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లోని ప్రవాసీ తెలుగు సంఘాలకు భాషా పరిరక్షణ విషయంలో చిత్తశుద్ధి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ బోర్డుకు అనుబంధంగా గల్ఫ్‌ దేశాల్లో మొత్తం 193 పాఠశాలలు నడుస్తున్నాయి. వేలాదిమంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వీటిలో విద్యనభ్యసిస్తున్నారు. ద్వితీయ భాషగా తెలుగు లేదా ఇతర ప్రాంతీయ భాష లేదా అరబిక్‌, ఫ్రెంచ్‌ భాషలను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంది. స్కూళ్లలో చేరినవారిలో ఆయా మాతృభాషలు మాట్లాడే విద్యార్ధుల సంఖ్య ఆధారంగా ఈ భాషలను బోధిస్తున్నారు. మళయాళం, తమిళం, ఉర్దూ భాషలను బోధించే స్కూళ్లు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు విద్యార్థుల నుంచి స్పందన నిరాశాజనకంగా ఉండటంతో కొన్ని చోట్ల మాత్రమే దీన్ని బోధిస్తున్నారు.

పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు ఉన్న దుబాయి నగరంలో 30కిపైగా సీబీఎస్‌ఈ స్కూళ్లు ఉన్నాయి. కానీ ఒక్క చోట కూడా తెలుగును బోధించడం లేదు. తెలుగు భాషా పరిరక్షణ పేరుతో పుట్టగొడుగుల్లా అనేక సంఘాలు వస్తున్నప్పటికీ… వారెవరూ కూడా స్థానికంగా తెలుగు భాషను బోధించడం పట్ల ఆసక్తి చూపడం లేదు. ఇతర రాష్ట్రాల విద్యార్థుల మాదిరిగా స్కూళ్లలో మాతృభాషను ఎంచుకోవడం లేదు. ఎక్కడో అమెరికా నుంచి తమ పిల్లలకు తెలుగును నేర్పిస్తున్నట్టు ఆర్భాటంగా ప్రచారం చేసుకొంటున్నారు. స్కూళ్లలో మాత్రం ఫ్రెంచ్‌ లేదా సంస్కృతం భాషలను ఎంచుకుంటున్నారు. కొన్ని ఇతర దేశాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. సౌదీ అరేబియా, ఖతర్‌, బహ్రెయిన్‌ దేశాల్లో అనేక చోట్ల తెలుగును ద్వితీయ భాషగా భోదిస్తున్నారు. కానీ విద్యార్థుల సంఖ్య ఆశించిన విధంగా లేదు.