Business

డాలరు మారకంలో దిగజారుతున్న రూపాయి విలువ

డాలరు మారకంలో దిగజారుతున్న రూపాయి విలువ

దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి రోజురోజుకి క్షీణిస్తూ బుధవారం మరో కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. గ్లోబల్‌ మార్కెట్ల ఒడిదుడుకులు, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పుంజుకోవడంతో పాటు భారతదేశ కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణం ఆందోళలు, తదితర కారణాల రీత్యా రూపాయి డాలర్‌తో బుధవారం 78.40 వద్ద ఆల్‌ టైం కనిష్టానికి చేరింది. ఇంట్రా-డేలో గరిష్టంగా 78.13 కనిష్ట స్థాయి 78.40 మధ్య కదలాడింది. 78.13 వద్ద నిన్న(మంగళవారం) కనిష్ట స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.

ఎఫ్‌ఐఐల అమ్మకాలు జోరు, దేశీయ ఈక్విటీలలో నష్టాల కారణంగా బుధవారం 27 పైసలు క్షీణించిన రూపాయి 78.40 (తాత్కాలిక) వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. 2011 తర్వాత మొదటిసారిగా 3శాతం దిగువకు పడిపోయింది. ఓవర్సీస్‌లో బలమైన గ్రీన్‌బ్యాక్ కూడా రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఆరు కరెన్సీల గ్రీన్‌బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.05 శాతం బలపడి 104.48కి చేరుకుంది.

ఇదిలా ఉంటే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు గత వరుసగా ఎనిమిదో నుంచి తొమ్మిది నెలల నుంచి దేశం నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం కూడా దేశీయ కరెన్సీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. జూన్‌లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు రూ. 38,500 కోట్లను వెనక్కి తీసుకున్నారు. జూన్ 10, 2022తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 4.59 బిలియన్ డాలర్లు క్షీణించి 596.46 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ డేటా వెల్లడించింది.