DailyDose

ఈమె గుజరాత్‌లోని 300 గ్రామాల దాహం తీర్చింది

ఈమె గుజరాత్‌లోని 300 గ్రామాల దాహం తీర్చింది

గుజరాత్‌లోని కొండ ప్రాంతాలైన నర్మద, డాంగ్‌, భరూచ్‌ జిల్లాల్లో నీటి కష్టాలు చాలా ఎక్కువ. ఎండాకాలం వచ్చిందంటే చుక్కనీటి కోసమూ కటకటే. ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యాములు ఉన్నా రకరకాల కారణాలతో అవి శిథిలమయ్యాయి. దీంతో రైతులు ఒక్క పంటకే పరిమితమయ్యారు. ఈ కష్టాలను చూసి తనవంతుగా మహిళల్ని చైతన్యవంతుల్ని చేశారు రూరల్‌ స్టడీస్‌లో పట్టా పొందిన నీతా పటేల్‌.

గ్రామ పంచాయతీల్లో నీటి కమిటీలను ఏర్పాటుచేశారు. అందులో చుట్టుపక్కల పల్లెల్లోని 2,900 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వివిధ ఎన్జీవోల సాయంతో వీళ్లంతా కలిసి అక్కడి నదుల మీద చెక్‌డ్యాములు నిర్మించుకున్నారు. పాడైన వాటిని బాగుచేసుకున్నారు. చేతి పంపులూ బావుల అనుసంధానం, పూడికతీత, నీటి కుంటల ఏర్పాటు తదితర పనులు చేశారు. రోజూ స్కూటర్‌ మీద ఎనభై తొంభై కిలోమీటర్లు ప్రయాణించి ఆదివాసీ గ్రామాల పరిస్థితులు తెలుసుకుంటారు నీతా. అలా వెళ్లినప్పుడు ఎత్తయిన ప్రాంతాల నుంచి నీరు వడివడిగా కిందికి దూకడం చూసి.. నీటిని పట్టి ఉంచేలా చుట్టూ చెట్లను పెంచితే బాగుంటుందని భావించారు. దీనికోసం కాల్వల చుట్టుపక్కల ఉన్న సుమారు 700 ఎకరాల్లో గ్రామస్తులు అటవీ శాఖ సాయంతో 90 వేల మొక్కలు నాటారు. ఈ చర్యల ఫలితంగానే ఇప్పుడు జలాశయాలు కళకళలాడుతున్నాయి. భూగర్భ మట్టమూ పెరిగింది. సౌర విద్యుత్తుతో నడిచే నీటి పంపుల ద్వారా దాదాపు రెండున్నర వేల ఎకరాల భూమి సాగవుతున్నది. తద్వారా 300 పల్లెల్లోని దాదాపు 30వేల మంది నీటి కష్టాల నుంచి బయటపడ్డారు. ఈ కృషికి గాను, దేశంలోని వివిధ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధి పట్ల అవగాహన కల్పిస్తున్న 41 మంది మహిళల్లో ఒకరిగా నీతా పటేల్‌నూ గుర్తించింది ఐక్యరాజ్య సమితి.