DailyDose

మరోసారి వార్తల్లోకి విజయ్‌ మాల్యా

మరోసారి వార్తల్లోకి విజయ్‌ మాల్యా

భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ‘‘సూపర్ ఫ్రెండ్‌షిప్, బెస్ట్ అక్విజిషన్” అం‍టూ వెస్టిండీస్ క్రికెటర్‌ క్రిస్ గేల్‌తో ఉన్న ఫోటోను తాజాగా ట్వీట్‌ చేయడం విశేషంగా నిలిచింది. ‘‘క్రిస్టోఫర్ హెన్రీ గేల్ @హెన్రీగేల్, ‘యూనివర్స్ బాస్‌’ను కలుసుకోవడం అదృష్టం. ఆర్సీబీకి తీసుకున్నప్పటినుంచి మంచి స్నేహితుడు” అని మాజీ ఆర్సీబీ యజమాని మాల్యా పేర్కొన్నాడు. ఆర్సీబీకి గేల్‌ను కొనుగోలు చేయడం ఎప్పటికీ బెస్టే అంటూ రాసుకొచ్చాడు. ఈ పిక్‌ ఇపుడు ఇంటర్నెట్‌లో వైరల్ కావడం మాత్రమే కాదు చర్చనీయాంశంగా మారింది.

దీంతో ‘లిక్కర్‌ కింగ్‌ విత్‌ యూనివర్స్‌ బాస్‌’ అంటూ కమెంట్‌ చేస్తున్నారు. వాస్తవానికి ఆర్‌సీబీకి 2011-2017 వరకు ఆడాడు క్రిస్‌ గేల్‌. ఈ సందర్భంగా గేల్‌ పరుగుల సునామీ గురించి ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కేవలం 30 బాల్స్‌లోనే సెంచరీ బాదిన మెమరబుల్‌ ఇన్నింగ్స్‌ను ఫ్యాన్స్‌ గుర్తు చేసుకుంటున్నారు

గేల్ 2011లో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చి, అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడిగా మారాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. 2009, 2010లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించిన గేల్‌ పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. అయితే, ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి దూరంగా ఉన్నాడు.

ఐపీఎల్‌లో 142 మ్యాచ్‌లు ఆడిన గేల్ 4965 పరుగులు చేశాడు. 148.96 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో లీగ్‌లో 39.72 సగటుతో ఉన్నాడు. 2013లో ఇప్పుడు ఆగిపోయిన పూణే వారియర్స్‌పై అజేయంగా 175 పరుగులతో సహా ఆరు సెంచరీలను నమోదు చేశాడు. టీ20లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.