DailyDose

‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే!

Auto Draft

ఇత్తడి.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది అజ్జరం. ఇత్తడికి పుట్టిల్లుగా ఈ గ్రామం జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరు గాంచింది. వివిధ ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి తమకు కావలసిన ఇత్తడి వస్తువులు తయారు చేయించుకుంటారు. ఇక్కడ తయారవ్వని వస్తువంటూ లేదు. పవిత్రమైన దేవాలయాల్లోను, సామాన్యుల ఇళ్లలోను, సినిమాల్లోనూ కనిపించే అరుదైన ఇత్తడి వస్తువులు అజ్జరంలో తయారైనవే.

బ్రిటిష్‌ వారి హయాం నుంచీ..
బ్రిటిష్‌ హయాం నుంచే అజ్జరంలో ఇత్తడి వస్తువులు తయారవుతున్నాయి. నాడు కేవలం చేతి పనిముట్ల సాయంతో వస్తువులు తయారు చేసేవారు. నేడు యంత్రాలతో తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన గంటలు దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలతో పాటు దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలకూ ఏదో ఒక వస్తువు ఇక్కడి నుంచే తయారై వెళ్లిందే.

‘దేవత’ బిందెలు.. ఆలయాల్లో గంటలు
‘దేవత’ సినిమాలో ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ అనే పాట కోసం వేసిన సెట్టింగ్‌లో వాడిన బిందెలన్నీ అజ్జరంలో తయారైనవే. అదొక్కటే కాదు ఎన్నో సినిమాల్లోని లెక్కలేనన్ని సన్నివేశాల్లో వాడిన ఇత్తడి వస్తువులు అజ్జరానివే. ఈ గ్రామ జనాభా 2,957 మంది. వారిలో ఇత్తడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారే 2,500 మంది. తాత ముత్తాతల కాలం నుంచీ గ్రామస్తులు ఈ పనిని కుటుంబ వారసత్వంగా భావిస్తున్నారు. 50 గ్రాముల నుంచి 500 కిలోల బరువు వరకూ గంటలు తయారు చేసి ఈ గ్రామస్తులు రికార్డు సృష్టించారు. అమెరికాలోని ప్రముఖ చర్చిలకు కూడ ఇక్కడ తయారైన గంటలను ఎగుమతి చేశారు. నాణ్యత, నమ్మకం కారణంగానే అజ్జరం ఇత్తడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది.