Sports

‘స్టార్ ఆటగాళ్లు లేకపోతేనేం.. ఈ కోచ్​ ఉన్నాడుగా.. ఛాంపియన్లను చేయడానికి’

‘స్టార్ ఆటగాళ్లు లేకపోతేనేం.. ఈ కోచ్​ ఉన్నాడుగా.. ఛాంపియన్లను చేయడానికి’

మధ్యప్రదేశ్​ రంజీ జట్టు.. స్టార్ ఆటగాళ్లు లేరు. అనామకులతోనే అద్భుత విజయాలను సాధిస్తోంది. ముంబయి లాంటి దిగ్గజ జట్టును మట్టికరిపించింది. చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. అయితే ఈ విజయం వెనుక ఓ ద్రోణాచార్యుడు ఉన్నాడు. ఆయనే చంద్రకాంత్ పండిట్. అనామక ఆటగాళ్లతో ఛాంపియన్​ జట్టును తయారు చేయడమే ఆయన పని. అదే ఆయన ప్రతిభ. రంజీల్లో తన కెప్టెన్సీలో చేయలేకపోయింది కోచ్​గా సాధించాడు చందూ!

“చంద్రకాంత్‌ పండిట్‌ మాయ మరోసారి పని చేసింది. దాదాపు పాతికేళ్ల నుంచి రంజీ ట్రోఫీ విజయానికి చేరువగా వచ్చి టైటిల్‌ సాధించడంలో విఫలమవుతున్న మధ్యప్రదేశ్‌ ఎట్టకేలకు చంద్రకాంత్‌ శిక్షణలో ఇప్పుడు ఫైనల్‌ చేరడమే కాక ట్రోఫీకి అందుకోబోతోంది. చందు ఏ జట్టుకు కోచ్‌గా వ్యవహరించినా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడు. విదర్భ అతడి శిక్షణలోనే ఒకటికి రెండుసార్లు రంజీ ట్రోఫీని సాధించింది. ఇరానీ ట్రోఫీ కూడా గెలిచింది. విదర్భ లాగే మధ్యప్రదేశ్‌ కూడా సూపర్‌స్టార్లను నమ్ముకున్న జట్టు కాదు. ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌, రజత్‌ పటిదార్‌, కుమార్‌ కార్తికేయ, కుల్‌దీప్‌ సేన్‌ మినహాయిస్తే పేరున్న ఆటగాళ్లు లేరు. వీరిలో వెంకటేశ్‌ భారత జట్టుతో పాటు ఉన్నాడు. ఫైనల్‌కు కుల్‌దీప్‌ సేన్‌ అందుబాటులో లేడు. ఒకవేళ వాళ్లు జట్టులో ఉన్నా పెద్దగా మార్పుండేది కాదేమో. అంతగా పేరు లేని ఆటగాళ్లతోనే ఆ జట్టు గొప్ప ప్రదర్శన చేస్తూ ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఇప్పుడు ట్రోఫీ కూడా అందుకోబోతోంది. ఇలా అనామకులైన ఆటగాళ్లతో ఛాంపియన్‌ జట్టును తయారు చేయడం ద్వారానే చందు దేశవాళీ క్రికెట్లో పేరుమోసిన కోచ్‌గా మారాడు. తెలివిగా క్రికెట్‌ ఆడేలా, ఏ స్థితిలోనూ వెనుకంజ వేయని విధంగా ఆటగాళ్లను అతను తీర్చిదిద్దుతాడు. క్రికెటర్‌గా కూడా అతడి తీరు అలాగే ఉండేది. కొన్నిసార్లు ప్రత్యర్థులను భలేగా బోల్తా కొట్టించేవాడతను.

ఛాంపియన్లుగా మధ్యప్రదేశ్​1985-86లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినపుడు కిరణ్‌ మోరె రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ కాగా.. చంద్రకాంత్‌ను బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి తీసుకున్నారు. మోరె గాయపడి మైదానాన్ని వీడడంతో చందు వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో బూన్‌ సెంచరీ పూర్తి చేసుకుని, ఇంకా ఎక్కువ పరుగులు చేయాలనే తపనతో కనిపించాడు. కపిల్‌ బౌలింగ్‌లో బంతి అతడి ప్యాడ్‌కు తాకి లెగ్‌ సైడ్‌ వెళ్లింది. చందు కావాలనే కొంచెం నెమ్మదిగా బంతి వైపు కదిలాడు. అది చూసి బూన్‌ తాపీగా అవతలి ఎండ్‌ వైపు వెళ్లాడు. ఇంతలో చందు ఒక్కసారిగా వేగం పెంచి బంతిని అందుకుని గ్లోవ్‌ తీసి నాన్‌ స్ట్రైక్‌కు విసరగా.. బూన్‌ రనౌటైపోయాడు. అసలేం జరిగిందో అర్థం కాని అయోమయంతో బూన్‌ పెవిలియన్‌ వైపు కదిలిన తీరు నాకింకా గుర్తుంది. చందు శైలి అందరికీ నచ్చకపోవచ్ఛు కానీ అతను మంచి ఫలితాలు రాబడతాడన్నది వాస్తవం. అందరికీ కావాల్సింది అదే కదా. చందునే కాదు లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ కూడా మంచి కోచ్‌. అతడి శిక్షణలోనే భారత జట్టు దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ను సాధించింది. కానీ ఇలాంటి కోచ్‌లను ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు గుర్తించవు. వారికి బాగా పేరున్న సహాయ సిబ్బంది కావాలి.

ముంబయి విషయానికి వస్తే..
సెరెనా విలియమ్స్‌లా తయారైంది వారి పరిస్థితి. ఆమె కూడా వీరి లాగే చాలా టోర్నీల్లో ఫైనల్‌ దాకా వస్తోంది. కానీ మరో విజయం సాధించి మార్గరెట్‌ కోర్ట్‌ పేరిట ఉన్న అత్యధిక టైటిళ్ల రికార్డును మాత్రం సమం చేయలేకపోతోంది. ముంబయి కూడా ఫైనల్‌ దాకా చక్కటి ప్రదర్శన చేసి చివరి మెట్టుపై బోల్తా కొడుతోంది. ముంబయి ఆటగాడు సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ సెంచరీల మీద సెంచరీలు కొట్టి భారత జట్టులో చోటు కోసం గట్టి పోటీదారుగా మారాడు. టెస్టు జట్టులో రహానె చోటు కోల్పోవడం, పుజారా కూడా చివరగా ఓ అవకాశం అందుకోవడంతో త్వరలోనే సర్ఫ్‌రాజ్‌ టీమఇండియాకు ఆడతాడనుకుంటున్నా. భారత జట్టు ఆడే తర్వాతి టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు తనను ఎంపిక చేసి తీరాల్సిన పరిస్థితిని సర్ఫ్‌రాజ్‌ కల్పించాడు. రజత్‌ పటిదార్‌ సైతం ఈ సీజన్లో చక్కటి ప్రదర్శన చేశాడు. ఇలాంటి ప్రతిభావంతులు వెలుగులోకి రావడం భారత్‌ చేసుకున్న అదృష్టం. ఇలాంటి వాళ్ల వల్ల సీనియర్లు ఎంతమాత్రం ఉదాసీనంగా ఉండడానికి అవకాశం లేకుండా పోతోంద”ని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్​ వ్యాఖ్యానించారు.