DailyDose

గోల్కొండ నవాబుల గ్రామం ‘షేర్ మహమ్మద్ పురం’

గోల్కొండ నవాబుల గ్రామం ‘షేర్ మహమ్మద్ పురం’

విశాఖ నుంచి జాతీయ రహదారిపై వెళ్తూ శ్రీకాకుళం చేరుకునే ఏడు కిలోమీటర్ల ముందు షేర్ మహమ్మద్ పురం కనిపిస్తుంది.ఇక్కడ నుంచి గ్రామం లోపలకు 1.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే గోల్కొండను గుర్తుతెచ్చే నిర్మాణ శైలిలో ఉండే ఒక పెద్ద స్వాగత ద్వారం కనిపిస్తుంది.ఆ ద్వారం నుంచి లోపలకి వెళ్తే అక్కడ ఒక పెద్ద రాతి బావి కనబడుతుంది. దానితో పాటు ఉన్న కోట, ఇతర నిర్మాణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే 400 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన గోల్కొండ నవాబుల చరిత్ర, పరిపాలన అనవాళ్ల గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి.అప్పటి కళింగాంధ్రలో ఉన్న రాజరిక సంస్థానాలపై 1599లో ముస్లిం పాలకులు దాడి చేసి ఈ ప్రాంతంపై జెండా ఎగరేశారు. ఈ ప్రాంతాన్ని గోల్కొండ నవాబుల దూతలుగా ముస్లిం జనరల్స్ పాలించేవారు. వీరి అరాచకాలు ఎక్కువ కావడంతో అయిదేళ్లలోనే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందని ఏయూ హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ బీబీసీకి చెప్పారు.

“ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ముస్లిం రాజులు హస్తగతం చేసుకున్న సమయంలో షేర్ మహమ్మద్ పురాన్ని గుల్షానాబాద్ అనేవారు. గుల్షానాబాద్ కేంద్రంగా ముస్లిం జనరల్స్ పాలన సాగించేవారు. అయితే, వీరి పాలనపై తీవ్రమైన అసంతృప్తితో ఉండేవారు. ఆరాచకాలు ఎక్కువైపోయాయి. దాంతో ప్రజల నుంచి తిరుగుబాటు రావడం మొదలైంది. సుపరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చే గోల్కొండ రాజులు దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే అప్పటి గోల్కొండ రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా, 1604లో షేర్ మహమ్మద్ ఖాన్‌ని గుల్షానాబాద్ నవాబుగా నియమించారు. అతని పేరుతోనే ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని షేర్ మహమ్మద్ పురం అని పిలుస్తున్నారు” అని ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు.
V3
షేర్ మహమ్మద్ పురం, దీన్నే ఎస్ఎం పురం అని పిలుస్తారు. ఇది ఒక చిన్న గ్రామం. కానీ, ఒకప్పుడు ఇది చాలా పెద్ద పట్టణం. చుట్టుపక్కల ఉన్న అనేక పాలన కేంద్రాలకు హెడ్ క్వార్టర్. కళింగాంధ్రలో మంచి పాలన అందించిన గోల్కొండ నవాబుల పాలనకు ప్రధాన కేంద్రమే ఎస్ఎం పురమని ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు.”అప్పటి నవాబు షేర్ మహమ్మద్ ఖాన్, ఎస్ఎం పురం కేంద్రంగా పాలన అందించారు. గోల్కొండ నవాబులు ఎక్కువగా వ్యవసాయానికి తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. అందులో భాగంగానే రెండు కొండల మధ్య 198 ఎకరాల్లో ఈ ప్రాంతంలో పెద్ద చెరువును నిర్మించారు. ఆ చెరువు ఇప్పటికీ వినియోగంలోనే ఉంది. వ్యవసాయానికి అనుకూలంగా నీటిని వినియోగించుకునేందుకు ఈ చెరువుపై చెక్ డ్యాం వంటి నిర్మాణాలు ఆ కాలంలోనే చేపట్టారు” అని బీబీసీతో ప్రొఫెసర్ సూర్యనారాయణ చెప్పారు.

ఊరి నిండా నవాబుల అనవాళ్లు
షేర్ మహమ్మద్ పురంలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు నుంచి ముందుకు వెళ్తుంటే కనిపించేవన్నీ 400 ఏళ్ల క్రితం చరిత్రను చెప్పే గోల్కొండ నవాబుల నిర్మాణాలు, వారి పాలనకు సంబంధించిన అనవాళ్లు కనిపిస్తాయి.చెరువుతో పాటు ఏనుగులు, గుర్రాల సంరక్షణ శాలలు ఉంటాయి. వీటిని కూడా కోటల్లాగే నిర్మించారు. అక్కడ ఏనుగులుంటే ఏనుగుల దువ్వారం అని, గుర్రాలుంటే గుర్రాల దువ్వారం అని స్థానికులు పిలిచేవారు. ఇప్పటికీ వాటి పేర్లు అవేనని గ్రామస్థులు బీబీసీకి తెలిపారు. దువ్వారం అంటే ద్వారం అని అర్థం.”ఇప్పుడు ఊరు, రోడ్డుకు దగ్గరగా మారింది. కానీ అప్పట్లో ఊరు లోపలికే ఉండేది. అందుకే కోట కూడా పొలాల మధ్యలో కనిపిస్తుంది. ఈ కోటను విలాసవంతంగా నిర్మించారు. ఈ కోటలోనే షేర్ మహమ్మద్ ఖాన్ ఉండేవారు. ఈ కోట చూసేందుకు మా ఊరు ఏవరైనా వస్తే తీసుకెళ్తుంటాం. ఇది చూసిన వారు ఆశ్చర్యపోతుంటారు. ఈ గ్రామంలో ఇంత కోట ఉందా అని అంటారు. అయితే, ఇది బాగా పాడైపోయింది. కోట నిర్మాణం చూస్తే ఇటుకలు, రాళ్లతో నిర్మించినట్లు అర్థమవుతుంది. నిర్మాణం పాడైపోవడంతో రాళ్లు, ఇటుకలు బయటకు కనిపిస్తున్నాయి. రెండేసి రాళ్లను ఇనుప ఊచలతో ముడేసినట్లు కనిపిస్తున్నాయి. వీటిని చూస్తుంటే నాలుగు శతాబ్ధాలు వెనక్కి వెళ్లిపోయామా అనే భావన కలుగుతుంది” అని బీబీసీతో గ్రామానికి చెందిన గురుగుబిల్లి గోవిందరావు చెప్పారు.
V1
షేర్ మహమ్మద్ పురంలో ఎక్కువగా ఆకర్షించేవి నవాబులు నిర్మించిన బావులు. అన్నీ బావులకు మెట్లు ఉంటాయి. కోటకు సమీపంగా ఏడు బావులు నిర్మించారు. అన్నీ కూడా 50 అడుగుల లోతు వరకు ఉంటాయని వాటిలో సరదాగా ఈతకు దిగిన స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం రైతులు, ఈ బావులను వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకున్నారు.”మా చిన్నతనంలో స్నేహితులంతా కలిసి ఈ బావుల్లోనే ఈత కొట్టేవాళ్లం. అప్పట్లో వీటిని మంచినీళ్ల బావి, డొక్క బావి, డోలు బావి, పిల్లల బావి, రట్నాల బావి, గుర్రాల బావి, ఏనుగుల బావి అని పిలిచేవారు. మంచినీళ్ల బావిలోనే మేం ఆడుకునేవాళ్లం. ఇవన్నీ రాతి కట్టడాలే. నవాబులు నిర్మించిన రెండు కొండల మధ్యలోని అతి పెద్ద చెరువుకు సమీపంలో ఈ బావులన్నీ ఉండటంతో వీటిలో నీరు ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ చెరువుల నుంచి పొలాలకు, బావులకు నీటిని మళ్లించేందుకు సైతం ఏర్పాట్లు ఉన్నాయి” అని గ్రామానికి చెందిన రైతు సుందరరావు బీబీసీకి చెప్పారు.

అలాగే ఊరిలో ఉన్న మసీదు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా, అప్పట్లో కట్టించిన జామా మసీదు మాత్రం ఇప్పుడు జాతీయ రహదారి పక్కన ఉంది. సమీప గ్రామాల్లో ఉన్న పెద్ద మసీదు ఇదే. ఈ మసీదు నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లింలు ప్రార్థనలు చేసుకుంటున్నారు.కళింగరాజులపై విజయం సాధించి చేజిక్కించుకున్న గుల్షానాబాద్ ప్రాంతాన్ని, షేర్ మహమ్మద్ ఖాన్ రాక ముందు వరకు పాలించిన ముస్లిం జనరల్స్ ఆరాచకపాలన చేశారని చరిత్రకారులు చెప్తున్నారు. గోల్కొండ నవాబులు ఈ ప్రాంతంలో సుస్థిర పాలన తీసుకురావాలని షేర్ మహమ్మద్ ఖాన్‌ను ఇక్కడికి పంపించారు.

“షేర్ మహమ్మద్ ఖాన్ తన పాలనతో ప్రజల నుంచి మన్ననలు పొందారు. అలాగే ఈ ప్రాంతాన్ని గుల్షానాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేయటంతో అప్పట్లో ఇదొక పెద్ద పట్టణంగా వెలుగొందింది. షేర్ మహమ్మద్ ఖాన్ కాలంలో వ్యవసాయాభివృద్ధితో పాటు శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రాంతానికి గోల్కొండ నవాబులు చేసిన అత్యుత్తమ సేవగా దీన్ని చెప్పవచ్చు. ఇప్పుడంటే ఇది ఒక చిన్న గ్రామంగా మారిపోయింది కానీ, ఒకప్పుడు గుల్షానాబాద్ (షేర్ మహమ్మద్ పురం) పెద్ద పట్టణ కేంద్రంగా ఉండేది. గోల్కొండ నవాబుల పాలన ప్రజాభీష్టానికి అనుకూలంగా ఎలా ఉండేదో చెప్పడానికి ఎస్ఎం పురంలో ప్రస్తుతం కనిపిస్తున్న చెరువు, బావులే పెద్ద ఉదాహరణ” అని ప్రొఫెసర్ సూర్యనారాయణ తెలిపారు.

మా గ్రామానికి ఇంత చరిత్ర ఉందని, చారిత్రక అనవాళ్లు ఉన్నాయనే విషయం గత ఏడేనిమిదేళ్లుగానే ప్రచారంలోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఈ విషయం తెలుసుకున్న అప్పటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఇక్కడికి వచ్చి ఈ కట్టడాలను పరిశీలించారని స్థానికులు చెప్పారు. ఈ కట్టడాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకుని వచ్చే విధంగా కార్యక్రమాలు చేద్దామని కలెక్టర్ చెప్పారని, అయితే ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదని వారు వాపోయారు.”ఈ కోట చాలా భిన్నంగా ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఆసక్తికరంగా ఉంటుంది. దీన్ని అభివృద్ధి చేస్తే శ్రీకాకుళం జిల్లాకు మరో పర్యాటక ఆకర్షణ అవుతుంది. జాతీయ రహదారికి దగ్గరగా ఉండటం వల్ల దీన్ని చూసేందుకు కూడా పర్యాటకులకు ఇబ్బంది ఉండదు. ఇప్పటికే శిధిలావస్థకు చేరిన ఈ కట్టడాలను పట్టించుకుని పరిరక్షించాలి. లేకపోతే ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది” అని బీబీసీతో గ్రామానికి చెందిన అవినాష్ అన్నారు.
V2
షేర్ మహమ్మద్ పురం గ్రామాన్ని నవాబుల నుంచి మచిలీపట్నానికి చెందిన అప్పటి గోడె సంస్థానాధీశులైన గోడె పెద జగ్గారావు కొన్నారు. షేర్ మహమ్మద్ ఖాన్ నేతృత్వంలో మొదలైన సుపరిపాలనను తర్వాత వచ్చిన ముస్లిం జనరల్స్ కూడా కొనసాగించారు. ఇక్కడ అభివృద్ధిని చూసి ముచ్చటపడి 1802లో షేర్ మహమ్మద్ పురాన్ని గోడె జమీందార్లు కొనుక్కున్నారు. గోడె సంస్థానాధీశులు కొన్న మొట్టమొదటి సంస్థానం ఇదే. వారు దీన్ని రూ. 18,455 కొన్నారని, గ్రామం పేరును మార్చకుండా షేర్ మహమ్మద్ పురంగానే కొనసాగించారని ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ తెలిపారు. ఎంతో చరిత్ర ఉన్న బొబ్బిలి సంస్థానానికి కూడా షేర్ మహమ్మద్ ఖాన్ పేరే పెట్టుకున్నారని తెలిపారు.”మెఘలుల తరపున కొన్ని యుద్ధాలు చేసిన షేర్ మహమ్మద్ ఖాన్‌కు ఒక యుద్ధంలో వెంకటగిరి సంస్థానానికి చెందిన పెదరాయుడు సహకరించారని చెబుతుంటారు. దీంతో కళింగాంధ్ర ప్రాంతానికి చెందిన రాజాం ఎస్టేట్‌ను షేర్ ఖాన్ ద్వారా ఆయనకు మొఘలులు బహుమతిగా ఇచ్చారు. ఆ కృతజ్ఞతతో రాజాం ఎస్టేట్‌లో ఒక కోటను నిర్మించిన పెదరాయుడు దానికి పెద్దపులి (షేర్) అని పెట్టారు. కాల క్రమంలో ఇది పెబ్బులి, బెబ్బులి, ప్రస్తుతం బొబ్బిలిగా స్థిరపడింది” అని చెప్పారు.