Agriculture

తెలుగు నేలలో ఖర్జూర సాగు.. పల్నాడులో పంట పండుతోంది!

తెలుగు నేలలో ఖర్జూర సాగు.. పల్నాడులో పంట పండుతోంది!

ఖర్జూర సాగు అంటే.. దుబాయ్ లాంటి ఎడారి నేలల్లోనే సాగుతుంది. అయితే.. ఇప్పుడు తెలుగు నేలలోనూ ఆ పంట పండిస్తున్నారు. పల్నాడు జిల్లాలో రెండేళ్ల క్రితం మొదలు పెట్టిన సాగు.. ఇప్పుడు గెలలు వేసింది. మరి కొన్ని రోజులైతే మార్కెట్​కు తరలించడమే! మరి, ఆ సాగు వివరాలేంటో మీరూ చూసేయండి.

ఖర్జూర పండు.. పల్నాడు జిల్లాలో పండుతోంది. గుంటూరుకు చెందిన ముగ్గురు సోదరులు కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామ పరిధిలోని 15 ఎకరాల ఎర్ర ఇసుక నేలల్లో.. 2020లో ఖర్జూర మొక్కలు నాటించారు. ఈ ఏడాదే దిగుబడి ప్రారంభమైంది. ఇక్కడి వాతావరణానికి సరిపోయే బరీష్‌, మోట్‌జోన్‌, అజ్వ, సగారి, జమ్లి, కల్మి, మరీయం రకాలను ఎంచుకున్నారు. గుజరాత్‌లోని ఖచ్‌ కార్పొరేషన్‌ ల్యాబ్‌, రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని అతుల్‌ ల్యాబ్‌ నుంచి మూడున్నర ఏళ్ల వయసున్న 750 మొక్కలు తెచ్చారు. ఒక్కో మొక్కను రూ.5 వేలకు కొనుగోలు చేశారు. బిందు సేద్యంతో సంరక్షించగా.. ఈ ఏడాది తొలి కాపు మొదలైంది. పల్నాడు వాతావరణం ఖర్జూర తోటల సాగుకు అనుకూలమని రైతు ఎండీ బాషా తెలిపారు. ప్రస్తుతం ఎకరాకి యేటా లక్షల ఖర్చవుతోందని, దిగుబడి వచ్చేలోగా.. అంతర పంటలు వేస్తున్నట్లు వివరించారు.