Health

రోగాల పాలిట ‘రవి’డి !

రోగాల పాలిట ‘రవి’డి !

ఆ పోషకాన్ని వ్యాధుల పాలిట ‘రౌడీ’ అని పిలిచే బదులు… ‘రవిడి’ అని పిలిస్తే బాగుంటుంది. ఎందుకంటే… అది ‘రవి’ నుంచి లభిస్తుంది. అంటే సూర్యుడి నుంచి అన్నమాట. ఎండ తగలక పోవడం ఒక ప్పుడు గొప్ప విషయమేమో గాని ఇప్పుడు కాదు. ఎందుకంటే ఎండసోకని వాళ్లకు ఇప్పుడు ఆ పోషకం లోపించడంతో ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. ఎన్నో జబ్బులు చేస్తున్నాయి. వాటి నుంచి దూరంగా ఉండాలంటే దాన్ని తినడం ద్వారా తీసుకోవడం కంటే తిరగడం ద్వారా తీసుకోవడమే ఎక్కువ వీలవుతుంది. అందుకే ఎండలో కాస్త రవికాంతులకు ఎదురెళ్లండి. ఆ ‘రవి’-డీ బాడీలో రెడీ అవుతుంది. అది వ్యాధులను ‘ఢీ’ కొడుతుంది. ఆ పోషకం పేరే విటమిన్-డి. దాని ప్రాధాన్యాన్ని చెప్పేదే ఈ కథనం. విటమిన్-డి ఆహారంలో కంటే సూర్మరశ్మిలో ఎక్కువగా లభ్యమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సూర్యకాంతిలో తిరగడం వల్ల లభ్యమయ్యే 80% నుంచి 90% ఉంటే, మిగతాది మాత్రమే ఆహారం నుంచి లభ్యమవుతుందన్నమాట. ‘విటమిన్ డి’లో ప్రధానంగా దాదాపు పది రకాల వరకు ఉన్నా అందులో విటమిన్ డి2 (ఎర్గో క్యాల్సిఫెరాల్), విటమిన్ డి3 (కోలీ క్యాల్సిఫెరాల్) ముఖ్యమైనవి. ఇది సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్ కిరణాలు తాకినప్పుడు చర్మంలో ఉత్పత్తి అవుతుంది.

1.  ఎన్నో రకాల ఉపయోగాలు…
*మన శరీరంలోని జీవక్రియల నిర్వహణకు ‘డి’-విటమిన్ చాలా కీలకం. రికెట్స్ అనే ఎముకల వ్యాధి, ఎముకలు బలహీనపడే ఆస్టియోపోరోసిస్, ఎముకల్లో నొప్పిగా ఉండే ఆస్టియోమలేసియా, హైపోథైరాయిడిజమ్ వల్ల ఎముక బలహీనపడటం, ఆస్టియోజెనెసిస్ ఇమ్‌పర్‌ఫెక్టా వంటి జన్యుసంబంధమైన వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు… వీటన్నింటిలోనూ విటమిన్-డితో చికిత్స చేస్తారు. దీని లోపంతో పారాథైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే ఒక్కోసారి ఫిట్స్/కన్వల్షన్స్‌కు దారితీసే ప్రమాదమూ ఉంది. పెద్దవయసు వారు ప్రమాదవశాత్తూ పడిపోతే ఎముకలు విరిగిపోకుండా ఉండాలంటే విటమిన్-డి కావాల్సిందే. ఇక మూత్రపిండాల జబ్బు ఉన్నవారిలో క్యాల్షియం తగ్గి ఎముకల్లో బలహీనత రాకుండా ఉండాలంటే విటమిన్-డి చాలా అవసరం. పైన పేర్కొన్న వాటికి తోడు గుండె, రక్తప్రసరణ జబ్బుల విషయంలో, రక్తపోటు ఉన్నవారికి, హై కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి, డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి, మల్టిపుల్ స్క్లిరోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) ఉన్నవారికి, ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులకు, మహిళల్లో ప్రీ-మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్‌తో బాధపడేవారికి, పంటి, చిగుళ్ల వ్యాధుల నివారణకు కూడా విటమిన్-డి కావాలి. ఇక విటిలిగో, స్క్లిరోడెర్మా, సోరియాసిస్ వంటి చర్మరోగాలు ఉన్నవారికి కూడా విటమిన్-డి కావాలి. సోరియాసిస్ చికిత్సలోనైతే ‘క్యాల్సిట్రాల్’ లేదా ‘క్యాల్సిపోట్రిన్’ అని పిలిచే విటమిన్-డిని పూస్తారు.

 2.క్యాన్సర్ నివారిణి విటమిన్-డి
*అన్నిటికంటే కీలకమైన విషయం ఏమిటంటే… విటమిన్-డి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. క్యాన్సర్ కణాలను విటమిన్-డి నాశనం చేస్తుంది. అందుకే కొన్ని రకాల క్యాన్సర్ల చికిత్సలో ‘విటమిన్-డి’ని ఒక ఔషధంలా ప్రిస్క్రయిబ్ చేస్తారు. అంతేకాదు… ఇది సహజ వ్యాధినిరోధకశక్తిని ప్రేరేపించడం వల్ల ఒక్క క్యాన్సర్లనేగాక… చికిత్సకు వీలుకాని ఎన్నో రకాల ఆటోఇమ్యూన్ డిజార్డర్లనూ నివారిస్తుంది. అందుకే ‘విటమిన్-డి’ ఉపయోగాలు, వైద్యరంగంలో దీని ప్రాధాన్యం చర్చనీయాంశమైంది.

 3.కనుగొన్నదిలా…
*విటమిన్-డి ని కనుగొన్న తీరు చాలా ఆసక్తికరం. రికెట్స్ వ్యాధికి గురైన ఎముకలు తమ గట్టిదనం కోల్పోవడం వల్ల సహజాకృతిని కోల్పోవడమో, తేలికగా విరిగిపోవడమో జరుగుతుంది. 1918లో ఎడ్వర్డ్ మెలాన్‌బీ అనే శాస్త్రవేత్త – కాడ్‌లివర్ ఆయిల్‌లోని కొవ్వులో కరిగే ఒక పోషకం రికెట్స్ వ్యాధికి సమర్థమైన చికిత్స అని కనుగొన్నారు. ఆ తర్వాత 1924లో హెచ్. స్టీన్‌బాక్, ఆల్ఫ్రెడ్ ఫేబియన్ హెస్ అనే పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు సోకినప్పుడు కొన్ని జీవుల్లో కొవ్వు పదార్థం లాంటి పోషకం ఉత్పత్తి అవుతోందని, ఆ పోషకంలో రికెట్స్‌ను తగ్గించే గుణం ఉందని కనుగొన్నారు. అయితే అప్పటికి విటమిన్ ‘డి’ని ఇంకా ల్యాబ్‌లో ఐసొలేట్ చేయలేదు. అప్పటివరకూ ఆ పోషకాన్ని ‘వయొస్టెరాల్’ అని పిలిచారు. ఆ తర్వాత 1935 నాటికి ‘విటమిన్ డి’ని పూర్తిస్థాయిలో వేరు చేశారు. దాన్ని వైద్యపరిభాషలో ‘క్యాల్సిఫెరాల్’ అంటారు.

 4. లభ్యమయ్యేదిలా…
*ఆరుబయట నడవడం విటమిన్-డి గ్రహించడానికి చాలా సులభమైన, నమ్మకమైన మార్గం. ముఖం, చేతులు, భుజాలు లేత ఎండ కాంతికి ఎక్స్‌పోజ్ అయ్యేలా రోజులో మూడుసార్లు చొప్పున మొత్తం ఆరుగంటలు గడుపుతూ… ఇలా మూడు వారాలు కొనసాగిస్తే విటమిన్-డి లోపం ఉన్నవారిలో స్వాభావికంగానే అది చాలావరకు నయమవుతుంది. విటమిన్-డి లోపం ఉన్నవారు ఇలా ఎండకు ఎక్స్‌పోజ్ కావడం మొదలుపెట్టిన ఆరు రోజుల్లోనే గుణం కనిపిస్తుంది. ఇక ఆహారపదార్థాల విషయానికి వస్తే… ముఖ్యంగా చేపల కాలేయాల్లో లభ్యమయ్యే నూనెల్లో విటమిన్ డి దొరుకుతుంది. కాడ్, మాక్‌రెల్, సొరచేప (షార్క్), సార్‌డైన్, ట్యూనా వంటి చేపల కాలేయాలతో పాటు కొన్ని కాయధాన్యాలు, గుడ్డు, నెయ్యి, వెన్న వంటి ఆహార పదార్థాలలో కూడా ఇది లభ్యమవుతుంది.

5. మరికొన్ని ఉపయోగాలు…
*శరీరం క్యాల్షియమ్‌ను గ్రహించేందుకు విటమిన్ డి తోడ్పడుతుంది. ఫాస్ఫరస్ వంటి ఇతర పదార్థాలను గ్రహించేందుకు ఉపయోగపడుతుంది. రక్తంలోని క్యాల్షియమ్ సరైన పాళ్లలో ఉండేలా చూసేందుకు ఉపయోగపడే పారాథైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ డి ఎంతో అవసరం. గర్భిణులకు విటమిన్ -డి ఇవ్వడం – భవిష్యత్తులో పిల్లల ఆరోగ్య సంరక్షణకు, వాళ్ల వికాసానికి ఎంతగానో తోడ్పడుతుంది. మానసిక ఆరోగ్యానికి సైతం విటమిన్ డి ఎంతో అవసరం. ఎముకల విషయంలోనే కాదు… మానవ సంబంధాలు పటిష్టంగా ఉండటానికి విటమిన్-డి దోహదపడుతుందని కొన్ని ఆధునిక పరిశోధనల్లో తేలింది. ఒత్తై జుట్టు పెరగడం కోసం కూడా విటమిన్-డి తోడ్పడుతుంది. 

6. నిర్ధారణ ఇలా…
*రక్తపరీక్ష ద్వారా విటమిన్-డి ఉండాల్సిన పరిమాణాన్ని తెలుసుకుంటారు. అనుబంధ రుగ్మతల్లో చికిత్స కోసం… రికెట్స్‌లో చికిత్సకు, నివారణకు దీన్ని ఉపయోగిస్తారు. ఎముకలలో లోపాలు ఉన్నప్పుడు వైద్యపరంగా అవసరమైన మోతాదులు (ప్రతిరోజూ 25 మైక్రోగ్రాముల నుంచి 125 మైక్రోగ్రాముల వరకు) సూచిస్తారు. వ్యాధితీవ్రతను బట్టి ఈ మోతాదును నిపుణులు నిర్ణయిస్తారు. ఆర్థరైటిస్ చికిత్సలో: ఎముకలు పెళుసుగా మారిపోయి తేలిగ్గా విరిగిపోయే ‘ఆర్థరైటిస్’ వ్యాధి చికిత్సలో కూడా వైద్యులు ‘విటమిన్-డి’ ఇస్తుంటారు. అవసరాన్ని, వ్యాధి తీవ్రతను బట్టి రోజూ 125 మైక్రోగ్రాముల వరకు డాక్టర్లు సూచిస్తుంటారు.

 7. పంటి చికిత్స: 
  పన్ను ఏర్పడే ప్రక్రియలో పంటికి అవసరమైన పోషకాల్లో విటమిన్-డి ముఖ్యమైనదని మెలాన్‌బీ పరిశోధనల్లో తేలింది. తగినంత విటమిన్-డి ఇవ్వడం వల్ల పంటికి సంబంధించిన చాలా సమస్యలను నివారించవచ్చని కనుగొన్నారు. పన్ను బలంగా, పటిష్టంగా మారడానికి వైటమిన్-డి ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్‌ఫ్లుయెంజా: విటమిన్-డి ద్వారా శరీరానికి లభించే వ్యాధినిరోధకశక్తి వల్ల ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని తేలింది. అంతేకాదు మరెన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి విటమిన్-డి రక్షిస్తుంది.

 8. మోతాదు దాటితే…
*కాడ్‌లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ వంటివి తీసుకునే సమయంలో రోజుకు 125 మైక్రో గ్రాముల మోతాదు దాటితే వైటమిన్-డి వల్ల ఒక్కోసారి విపరీతంగా దాహం, కంట్లో కురుపులు, చర్మంపై దురదలు రావడం, వాంతులు, నీళ్లవిరేచనాలు వంటివి కనిపించవచ్చు. ఒక్కోసారి రక్తనాళాల్లోని గోడలపై క్యాల్షియమ్ పాళ్లు పెరగవచ్చు. రక్తనాళాలతో పాటు కాలేయంలో, ఊపిరితిత్తుల్లో, మూత్రపిండాల్లో, కడుపులో క్యాల్షియమ్ మోతాదులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో తిరగడం లేదా స్వాభావికమైన ఆహారం ద్వారా కాకుండా… ఇతరత్రా రూపాల్లో (కృత్రిమంగా) విటమిన్-డి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేవలం నిపుణుల సూచనల మేరకే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జబ్బుల నుంచి రక్షణఆస్తమా అథెరోస్క్లిరోసిస్ బ్లాడర్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ కొలోన్ క్యాన్సర్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ క్రోన్స్ డిసీజ్ ఒవేరియన్ క్యాన్సర్ డిప్రెషన్ ఎపిలెప్సీ ఫైబ్రోమయాల్జియా హార్ట్ ఎటాక్ హైపర్‌టెన్షన్ ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లెప్రసీ లివర్ డిసీజ్ మెటబాలిక్ సిండ్రోమ్ మల్టిపుల్ స్క్లిరోసిస్ మయోఫేషియల్ పెయిన్ సిండ్రోమ్ ఆస్టియోపోరోసిస్ పెరియోడాంటల్ డిసీజ్ ప్రి-ఎక్లాంప్సియా సోరియాసిస్ రెక్టల్ క్యాన్సర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సెనైల్ డిమెన్షియా స్ట్రోక్ (పక్షవాతం) టినైటస్ (చెవిలో గుయ్‌ఁ మనే శబ్దం) ట్యూబర్క్యులోసిస్ టైప్-2 డయాబెటిస్ అల్సరేటివ్ కొలైటిస్

9.  విటమిన్-డి విశేషాలు…
*విటమిన్-బీ కాంప్లెక్స్, విటమిన్-సి ల తరహాలో విటమిన్-డి… వంట సమయంలో ఆ వేడికి అంత తేలికగా నాశనం కాదు. ఆహారపదార్థాల ద్వారా దీన్ని తీసుకున్నప్పుడు ఇది చిన్నపేగుల్లోని ‘జిజినమ్’ నుంచి శరీరంలోకి ఇంకుతుంది. అయితే సూర్యరశ్మి ద్వారా చర్మం నుంచి ఉత్పత్తి అయినప్పుడు మాత్రం చర్మంలోని లోపలి పొర డెర్మిస్ ప్రాంతంలో తయారై రక్తప్రవాహంలోకి ప్రవేశించి, కాలేయానికి వెళ్తుంది.పపంచవ్యాప్తంగా ఒక బిలియన్ మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు.విటమిన్-డి లోపం వల్ల పట్టణ ప్రాంతపు పిల్లల్లో స్థూలకాయం వస్తోంది. ఇటీవల ఆడపిల్లలు తగిన వయసు రాకముందే చాలా త్వరగా రజస్వల అవుతున్నారు. ఇది తల్లులకు చాలా ఆందోళన కలిగిస్తున్న అంశం. విటమిన్-డి తగినంత లభించడం ద్వారా వారు 12-14 ఏళ్ల వయసులోనే రజస్వల అవుతారని, విటమిన్-డి లోపం వల్ల చాలా చిన్న వయసులో ఆ పరిణామం కనిపిస్తోందని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది.

***ఏయే పదార్థాలలో ఎంతెంత…?
*వాస్తవానికి ఆహారపదార్థాల ద్వారా లభ్యమయ్యేదాని కంటే సూర్యరశ్మికి తాకినప్పుడు చర్మం కింది పొరలో దీని ఉత్పత్తి ఎక్కువ. అయినప్పటికీ కొద్ది మోతాదుల్లో కొన్ని రకాల ఆహారపదార్థాల నుంచి అది లభిస్తుంది. అవి… ఆహారపదార్థం పరిమాణం (మైక్రోగ్రాముల్లో) కాడ్‌లివర్ ఆయిల్ 175 షార్క్ లివర్ ఆయిల్ 50 గుడ్లు 1.5నెయ్యి 2.5 వెన్న 1.0 (ఇవి 100 గ్రా. ఎడిబుల్ పోర్షన్‌లో లభించే మోతాదులు)
*విటమిన్-డి ప్రాధాన్యాన్ని గ్రహించి ఇకపై పెద్దలు ఆరుబయట తిరగడం, పిల్లలనైతే లేత ఎండపొడ తగిలేలా ఆరుబయట ఆడనివ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే తిన్న తర్వాత తిరగడం వాకింగ్ రూపంలోనైతే ఆరోగ్యాన్నీ, ఎండలోనైతే ఆరోగ్యభాగ్యాన్ని ఇస్తుంది.