NRI-NRT

ఆస్ట్రేలియాలో పెరిగిన ప్రవాస భారతీయుల సంఖ్య

ఆస్ట్రేలియాలో పెరిగిన ప్రవాస భారతీయుల సంఖ్య

తాజాగా విడుదలైన ఆస్ట్రేలియా జనాభా లెక్కల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విదేశాల్లో జన్మించి ఆస్ట్రేలియాలో నివసిస్తున్న వారిలో భారతీయులు సంఖ్యాపరంగా నెం.3 స్థానంలో నిలిచారు. చైనా, న్యూజీల్యాండ్‌ దేశాలను వెనక్కు నెట్టి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న 673,352 మంది తాము ఇండియాలో జన్మించినట్టు తెలిపారు. 2016 నాటి జనాభా లెక్కలతో పోలిస్తే ఇది దాదాపు రెండింతలు. ఇక ఇంగ్లండ్‌లో పుట్టి ఆస్ట్రేలియాలో ఉంటున్న వారు సంఖ్యాపరంగా రెండో స్థానంలో ఉన్నారు. గత సెన్సెస్‌తో పోలిస్తే.. వారి జనాభా 47.86 శాతం మేర పెరిగింది. తాము ఆస్ట్రేలియాలోనే జన్మించామంటున్న వారు సంఖ్యాపరంగా మొదటిస్తానంలో ఉన్నారు. ఆస్ట్రేలియా జనాభాలో దాదాపు సగం మంది.. తమ తల్లిదండ్రుల్లో ఒకరు విదేశాల్లో పుట్టినట్టు పేర్కొనడం గమనార్హం.

సెన్సెస్‌ ముఖ్యాంశాలు..
ఆస్ట్రేలియా జనాభాలో 27.6 శాతం మంది విదేశాల్లో పుట్టినవారే..ఆస్ట్రేలియాలో ప్రజలు తమ ఇళ్లల్లో అత్యధికంగా మాట్లాడే భాషల్లో మాండరిన్ తొలిస్థానంలో ఉంది. జనాభాలో 2.7 శాతం మంది తమ కుటుంబసభ్యులతో మాండరిన్‌లో మాట్లాడుతున్నట్టు పేర్కొన్నారు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా అరబిక్(1.7 శాతం), వియత్నమీస్(1.3 శాతం), కెంటోనిస్(1.2 శాతం), పంజాబీ(0.9 శాతం) భాషలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 38.9 శాతం మంది తాము ఏ మతాచారాలను పాటించమని చెప్పగా.. 20 శాతం మంది తమది కేథలిక్ సంప్రదాయమని, 8.6 మంది తాము ఆంగ్లికన్ క్రిస్టియన్లమని చెప్పారు. ఇస్లామ్‌ మతస్థులు 3.2 శాతం, హిందువులు 2.7 శాతంగా ఉన్నారు.

మునుపటి సెన్సెస్ నుంచి ఇప్పటివరకూ 1,020,007 మంది విదేశీయులు ఆస్ట్రేలియాకు వలసెళ్లారు. అంతేకాకుండా.. 33.0 శాతం మంది ఆస్ట్రేలియన్లు తమది ఇంగ్లిష్ వారసత్వమని తెలుపగా.. ఆస్ట్రేలియాకు చెందిన వారు 29.9 శాతంగా ఉన్నారు. ఇక ఐరిష్ సంతతి వారు 9.5 శాతం.. చైనా సంతతి వారు 5.5 శాతంగా ఉన్నారు. అయితే.. ఆస్ట్రేలియాలో భారతీయుల సంఖ్య పెరగడంలో ఆశ్చర్యమేమీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు. 2007 నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఆర్థిక, దౌత్య బంధాలు క్రమంగా బలపడుతున్నాయి. నాటి నుంచి ఆస్ట్రేలియాలో అధికారంలోకి వచ్చిన పలు ప్రభుత్వాలు భారతీయులకు రెడ్ కార్పెట్ పరిచి దేశంలోకి ఆహ్వానిస్తున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం.