Editorials

పీవీ నరసింహారావు బహుముఖీనత

పీవీ నరసింహారావు బహుముఖీనత

పీవీగా అభిమానంతో పిలువబడే పాములపర్తి వెంకట నరసింహారావు గారు భారతదేశానికి తొమ్మిదవ ప్రధాని! ఈ తెలంగాణ ముద్దుబిడ్డ – భారత ప్రధాని అయిన మొదటి తెలుగు వ్యక్తి మాత్రమే కాదు, తొలి దక్షిణ భారతీయ వ్యక్తి కూడా! వారు 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించారు. అంటే 4 సం. 330 రోజులపాటు ప్రధానమంత్రిగా కొనసాగారు.
పీవీ నరసింహారావుగారి (28 జూన్ 1921 – 23 డిసెంబర్ 2004) కంటే ముందు ఈ భారత ప్రజాస్వామ్యానికి ఎనిమిదిమంది ప్రధానమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విశ్వనాథ ప్రతాప సింగ్, చంద్రశేఖర్ వంటి దిగ్ధంతులున్నారు ఈ జాబితాలో! ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా రెండు పర్యాయాలు శ్రీ గుల్జారీ లాల్ నందా పనిచేశారు. నరసింహారావుగారు ప్రధానమంత్రి అయ్యేసరికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నాలుగు దశాబ్దాలు దాటిపోయింది. అప్పటిదాకా ఒక్క లాల్ బహదూర్ శాస్త్రిగారే కాంగ్రెస్ పార్టీ ద్వారా, నెహ్రూ కుటుంబం నుంచి కాకుండా ప్రధానమంత్రి అయిన చరిత్ర ఉంది.
నిజానికి, అది ఒక సంధి సమయం! అకస్మాత్తుగా ఎన్నికల పోలింగ్ దశల మధ్య రాజీవ్ గాంధీ హత్య కావడం పెద్ద మలుపు… కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ పెద్దగా రాలేదు. అటువంటి సంక్షోభాల సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంకత్తిమీద సామువంటిదే! అందుకే పీవీనరసింహారావుగారిని ‘అపరచాణక్యుడు’ అంటారు!
ఆ సమయంలో ప్రధానమంత్రికి సమాచార సలహాదారుగా, భారతప్రభుత్వానికి ఛీఫ్ స్పోక్స్ పర్సన్ గా పనిచేసిన ఎస్. నరేంద్రగారు ఇటీవల అప్పటి విషయాలు తెలియచేశారు. ఆ వివరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తను ప్రధాని కాగానే ఆర్థిక శాస్త్రవేత్త డా. మన్ మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖామంత్రిగా ఎంచుకుని, నచ్చజెప్పి కేబినెట్ లోకి తీసుకున్నారు. పరిశ్రమల శాఖను ప్రధాన మంత్రిగారే తనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నరసింహారావుగారు ప్రధాని అయి ఒక నెల గడిచింది.
అది జూలై 24, 1991.
ఆ రోజు నలభయ్యేళ్ళుగా సాగుతున్న లైసన్సుల శృంఖలాలు భళ్ళున తెగిపోయినాయి. నిజానికి పెద్ద హడావుడి లేదు, సంరంభం లేదు, ప్రచారపు ఆర్భాటం లేదు! IDRA అంటే ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ – 1951 చట్టం నిశ్శబ్దంగా రద్దు చేయబడింది. ఇది పీవీ నరసింహారావుగారి ఆర్థిక సంస్కరణలకు తొలి అడుగు. పారిశ్రామికంగా ఔత్సాహిక ప్రయత్నం ప్రారంభం కాగానే ఎదురయ్యే ఈ తొలి నిబంధన చాలా రకాల నిబంధనలకు మూలబిందువు లాంటిది. చాలా మౌనంగా పని చేసుకుపోవాలని వాంఛించే నరసింహారావు గారి వ్యవహార శైలికి దర్పణం ఈ సంఘటన. ఇప్పటి తరానికి, కాలానికి అప్పటి విషయాలు అసలు తెలియకపోవచ్చు. టెలిఫోన్ రావాలంటే ఆరునెలలూ, స్కూటర్ కొనాలంటే మూడు సంవత్సరాలు దాకా వేచివుండాల్సిన పద్ధతి అప్పుడు. ఇలాంటి విషయాలే అలా ఉన్నప్పుడు… ఒక పరిశ్రమ ప్రారంభించాలంటే ఎలా ఉంటుందో మనం ఇప్పటి కాలంలో ఊహించలేము. కేవలం ఆ చారిత్రక పరిణామాలు లోతుగా తెలుసుకుని అర్థం చేసుకోవాలి.
నరసింహారావు ప్రధాని కావడానికి ముందు నాలుగున్నర దశాబ్దాలకూ; తర్వాత మూడు దశాబ్దాలకు చాలా తేడాలున్నాయి. ఈ మార్పులు ఎలా వచ్చాయి, ఎందుకొచ్చాయి, ఎలాంటి పరిణామాలను తీసుకొచ్చాయి అని తెలుసుకోవాలి. ఈ విషయాలు బోధపడాలంటే వారి రాజకీయ పరిజ్ఞానం, చేసిన అధ్యయనం, సాధించిన అనుభవం, గడించిన పాండిత్యం… ఇలా చాలా విషయాలను మనం తెలుసుకోవాలి.

పీ అంటే … పనితనం … ఫలితమిచ్చే పనితనం
పీవీ అంటే… … వైవిధ్యం … బహు వైవిధ్యం … లోతైన వైవిధ్యం … ఉత్తమ ఫలితాలనిచ్చే వైవిధ్యం

సంస్కృతులనూ, ప్రాంతాలనూ, అధ్యయనం చేసిన వారు పరిశీలించిన విషయం ఏమిటో తెలుసా? వివిధ సంస్కృతులు, భాషలు సంగమించేచోట పెరిగిన వారిలో అద్భుతమైన వైవిధ్యం వెల్లివిరియటమే కాక, అనంతమైన సృజనకు దారితీస్తుందని! వరంగల్ ప్రాంతం నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించిన పీ.వీ. మూడేళ్ళ వయసులో దత్తత పోయారు. అప్పటి నుంచి కరీంనగర్ ప్రాంతం భీమదేవరపల్లి మండలం వంగరలో పెరిగారు. ప్రాథమిక విద్య కొంతకాలం బంధువుల ఇంట్లో సాగింది. 1930లో హైదరాబాదు సంస్థానంలో జరిగిన వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. కనుక సంస్థానం పై చదువులు సాగే వీలు లేకపోయింది.
పీవీ చదివిన కోర్సులు ఏమిటో తెలుసా? పూనాలో ఫెర్గుసన్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే బి.ఎస్సి., అలాగే నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి., ఇంకా హిందీలో సాహిత్యరత్న… మూడు డిగ్రీలు మూడు విభిన్న అంశాలు! తెలుగు, ఉర్దూ, మరాఠి, ఇంగ్లీషు, హిందీ, పార్సీ, స్పానిష్ భాషలు బాగావచ్చు. ఈ ఏడు మాత్రమే కాక మరో ఐదు భాషలు కన్నడం, పంజాబీ, ఫ్రెంచి, సంస్కృతం, భోజ్ పురి బాగా తెలుసు! ఇవి మొత్తం 12 భాషలు. అయితే ఆయనకు 13 భాషలు తెలుసు. 17 భాషలు తెలుసు అని కూడా అంటారు. ‘ది ఇన్ సైడర్’ మలయాళం భాషలోకి అనువదింపబడినపుడు, ఆ భాష ప్రూఫులు ఆయనే సరిచూసుకున్నారని చూసినవారు చెప్పిన విషయం. మూడు పాతికలు పై బడిన తర్వాత కంప్యూటర్ తెలుగు లిపి నేర్చుకోవడం వారి నిత్య అధ్యయనానికి, నిరంతర పట్టుదలకు మచ్చుతునక! తత్వశాస్త్రం, సంస్కృతి, సాహిత్యం అంటే చాలా ఇష్టం. విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్’ పేరిట హిందీలోకి అనువాదం చేశారు. అలాగే మరాఠీలో గొప్ప నవలగా కీర్తించబడే హరినారాయణ ఆప్టే గారి నవల ‘పాన్ లక్షత్ కోన్ ఘేటో’ను ‘అబల జీవితం’గా తెలుగులోకి అనువదించారు. తన కథను కాల్పనిక నవల ‘ఇన్ సైడర్’గా రచించారు. ‘అయోధ్య’ పేరుతో మరో వచన గ్రంథాన్ని వెలువరించారు.
సుమారు ఐదు దశాబ్దాలపాటు వారి రాజకీయ జీవితం విస్తరించి ఉంది. 1971లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి ముందే న్యాయశాఖ, జైళ్ళ శాఖ, దేవదాయ, ఆరోగ్యం, విద్య శాఖలను మంత్రిగా పర్యవేక్షించారు. అలాగే 1991లో భారతదేశ ప్రధానమంత్రి అయ్యేముందు విదేశాంగ వ్యవహారాలు, హోంశాఖ, రక్షణ శాఖ, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ మెంట్ శాఖలతో కేంద్రమంత్రిగా పని చేశారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానే కాదు ఆలిండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్ గా కూడా సేవలందించారు. ఇరవయ్యేళ్ళుగా ఎన్నికలు లేకుండా సాగిన కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత ఎన్నికలు జరిపించిన ప్రజాస్వామ్యవాది – పీవీ నరసింహారావు.
అందుకే పీవీ అంటే – … ఓ అధ్యయనం! … ఓ వైవిధ్యం! … హడావుడి లేని పనితనం! … పటాటోపం లేని ప్రయోజకత్వం!.

పీవీ సమాజాన్ని గమనించారు. అందులోని ఎగుళ్ళు, దిగుళ్ళనూ గుర్తించారు. అంతేకాదు వాటిలోని న్యాయాన్యాయాల తీరును కూడా అవగతం చేసుకున్నారు. ఆయనకు సైన్స్ తర్కాన్ని బోధపరచగా, న్యాయశాస్త్రం రాజ్యాంగస్ఫూర్తిని ఎరుకపరచింది. చదువుకున్న సాహిత్యం ఆదర్శాల విలువను సమున్నతంగా నిలిపింది. ప్రజలందరూ సమానం అని ప్రజాస్వామ్య భావన. దీని సాధనకు తయారైన వ్యవస్థ రాజ్యాంగం. ఒక్కరికోసం అందరూ కలవడం అనేది స్ఫూర్తి.
1992 డిసెంబరు 18న అల్పసంఖ్యాక వర్గాల హక్కులు, అవకాశాల కల్పన గురించి ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఇది చారిత్రాత్మక సందర్భం. జెండర్, మతం, కులం, భాష వంటి అవరోధాలు కల్పించే తారతమ్యాల సవరణే ఈ తీర్మానం లక్ష్యం. భారత దేశం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దిశలో సాగింది. తొలుత నేషనల్ కమీషన్ ఫర్ మైనారిటీస్ ఏర్పడింది. ఈ మైనారిటీ కమీషన్ ఏర్పడక ముందే 1992 జనవరి 31న నేషనల్ కమీషన్ ఫర్ ఉమన్ ఏర్పడింది. దీనికి సంబంధించిన చట్టం అంతకు ముందు రెండేళ్ళ క్రితం తయారైంది. పీవీ నరసింహారావు అధికారంలోకి రాగానే ఇది ఏర్పడింది. తర్వాత ఐక్యరాజ్యసమితి తీర్మానం అల్పసంఖ్యాకవర్గాలకోసం వచ్చింది. 1993లో సఫాయి కర్మచారి చట్టం ఏర్పడింది. 1994 ఆగస్టు 14 దీనికి సంబంధించిన కమీషన్ ఏర్పడింది. తర్వాత నెలలో అంటే 1994 సెప్టెంబరు 30న ఎన్.ఎమ్.డి.ఎఫ్.సి. – నేషనల్ మైనారిటీస్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూపుదాల్చింది. వడ్రంగం, మరమగ్గాలు, ల్యాండ్రి వంటి ఉపాధులకే కాక పాన్ షాప్, ఫోటో కాపీసెంటర్, కేబుల్ టీవీ, కూరగాయలబండి వంటి ఆధునిక కాలపు ఉపాధులకు ఋణం పొందే వెసులుబాటు కలిగింది. అంతేకాదు తొలుత అవసరమైతే శిక్షణ ఇవ్వడం, తర్వాత ఋణం కల్పించడం, ఉత్పత్తులు తయారైతే వాటికీ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం. మార్కెట్ చేయడం కూడా ఈ కార్పొరేషన్ పరిథిలో ఉంటాయి. 1996 ఫిబ్రవరి 7న సమాన అవకాశాలు, కల్పించడం, హక్కుల రక్షణ పూర్తి భాగస్వామ్యం గురించిన చట్టం అమలులోకి వచ్చింది. దివ్యాంగుల కోసం ఈ చర్య తీసుకొన్నారు. శారీరక లోపం వీరి ఎదుగుదలకు అవరోధం కాకూడదని ఆశ, ఆకాంక్ష.
భారతదేశం భిన్న భాషల నిలయం. మనదేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషలు కొన్నీ, సంఖ్యాపరంగా తక్కువమంది మాట్లాడేభాషలు కొన్నీ, అలాగే లిపి లేని భాషలు కూడా చాలానే ఉన్నాయి. తొలుత 1967లో రాజ్యాంగ 21వ సవరణ ద్వారా సింథి భాషను చేర్పారు. అంతకుముందు రాజ్యాంగంలో పొందుపరచబడిన భాషలు 14. సింథితో 15. పి.వీ. ప్రధానమంత్రిగా పార్లమెంటు 71వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1992లో తెచ్చింది. దాని ద్వారా మూడు భాషలు కొంకణి, మణిపురి, నేపాలీ భాషలకు రాజ్యాంగ గుర్తింపు కల్గింది. వీటిని గుర్తించాలని ఎంతో కాలంగా ప్రజలు ఎన్నో రకాలుగా కోరుతున్నారు. దీని గుర్తించి నరసింహారావు ప్రభుత్వం వీటికి రాజ్యాంగ గౌరవం కల్పించింది. నరసింహారావుగారి ఆలోచనా విధానం కొనసాగింది కూడా. 2004లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి భాషలను గుర్తించారు. వీటితో మొత్తం 22 భారతీయ భాషలు భారత రాజ్యాంగంలో గుర్తించినట్టయ్యింది.
అంతేకాదు స్థానిక సంస్థలను బలోపేతం చేేస్తూ, వీటిలో మహిళలతోపాటు ఎస్.సి., ఎస్.టి. వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 1993 ఏప్రిల్ 24న చట్టం తెచ్చింది కూడా పీ.వీ. నరసింహారావు ప్రభుత్వమే! రాజ్యాంగస్ఫూర్తిని గమనించి, మన సమాజంలో ఉన్నతారతమ్యాలకు పి.వి.నరసింహారావు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సామాజిక ఔషధాలుగా మారాయి. అది పీ.వీ.గారి దార్శనికత!

మూడు దశాబ్దాల క్రితం ప్రధానమంత్రిగా పి.వి.నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు తిరుగులేనివి. పూర్తి మెజారిటీ లేని పార్టీకి నాయకత్వం వహిస్తూ, ప్రధానమంత్రిగా నరసింహారావుగారు చేసిన సాహసం. వారు చాలా నమ్రతగా, హడావుడి లేకుండా సాగే వ్యక్తి. కానీ తీసుకున్న నిర్ణయాలు మాత్రం మామూలు నిర్ణయాలు కావు, ఎంతో సాహసం అవసరమైన నిర్ణయాలు. అటువంటి గుండెదిటవూ, మేధో విశేషం నరసింహారావుగారికే చెల్లు! భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఏ స్థాయిలో విభిన్నమైనవో – దానికి రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన భూ సంస్కరణలు మరింత మౌలికమైనవీ, విప్లవాత్మకమైనవీ!!
భూ సంపద బాగా ఉన్న కుంటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పి.వీ.నరసింహారావు. 1972 ఆగస్టు 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూ సంస్కరణల బిల్లు ప్రవేశపెడుతూ వారు చేసిన ప్రసంగం గ్రామీణ జీవన శకటం ఎలా నడుస్తుందో వివరించే తార్కికమైన విశ్లేషణ. అందులో ఆర్థిక శాస్త్రమే కాదు, సామాజిక శాస్త్రమూ, మానసిక విజ్ఞానమూ ఉంది! భూస్వాముల చెర నుంచి భూమిని విడుదల వాళ్ళ అహంకారం తగ్గుతుందని చాలా స్పష్టంగా పేర్కొన్నారు పీ.వీ. భూములుండి, వ్యవసాయం నేరుగా చేయకుండా పేదలను బాధించే వర్గాల నుంచి బడుగు రైతును ఆదుకోవాలని ఆయన యోచన చేశారు. జవహర్ లాల్ నెహ్రూ స్ఫూర్తితో ఆలోచన చేశానని పి.వి. ది ఇన్ సైడర్ పుస్తకంలో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇలా భూ సంస్కరణలు చేపట్టిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ దే మొదటి ప్రయత్నం. నరసింహారావు సారధ్యంలో ఈ ప్రయోగం జరిగింది.
ఆ ఆలోచనలో అపారమైన దార్శనికత ఉంది. ఈ భూ సంస్కరణల చట్టం కారణంగా తమ కుటుంబం కూడా 500 ఎకరాల దాకా భూమిని కోల్పోయింది. అంతేకాదు రాజకీయంగా ఈ నిర్ణయం కారణంగా సంక్షోభాలు ఎదుర్కొన్నారు. అయినా ఆయన వెరవ లేదు. ఈ నిర్ణయం కారణంగా 23 లక్షల ఎకరాలు సుమారు 16 లక్షల మందికి లాభించాయి. ఇది చిన్న విషయం కాదు. పేదలకు పంట భూమితోపాటు ఇళ్ళ స్థలాలు కూడా లభించాయి. అందువల్లనే పి.వి.నరసింహారావుగారు చరిత్రలో నిలిచిపోయారు. తన రాజకీయ పార్టీనుంచి వ్యతిరేకత మొదలైంది. వారి మనోధైర్యం, మోధోపరమైన వ్యూహం చాలా గొప్పవి. వారు 1973 జూన్ 15వ తేదీన అమలు చేసిన భూసంస్కరణల చట్ట పేదల గుండెలపై ధైర్యం జెండాను నిలబెట్టింది. అయితే తన రాజకీయ మిత్రులే చట్టం స్ఫూర్తిని దెబ్బతీస్తారని ఆయనకు బాగా తెలుసు. అలాంటి సమస్యను గుర్తించి ముందస్తు వ్యూహంగా 1972 మే నెలలో ల్యాండ్ సీలింగ్ అర్డినెన్స్ ద్వారా భూస్వాముల డొంకదారులకు తిరుగులేని కళ్లెం వేశారు.
పీ.వీ. నరసింహారావు భూమి గురించి, విద్యాబోధన గురించీ, ఆర్థిక పరిస్థితి గురించి, దేశ రక్షణ గురించి ఇలా ప్రతి కీలక రంగాన్ని శోధించి అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి ప్రవేశపెట్టిన ప్రతి మార్పు గొప్ప పరిణామానికి దారితీసేలా వ్యూహ రచన చేశారు.

పీ.వీ. రాజర్షి మాత్రమే కాదు, మౌనం విలువ తెలిసిన మహర్షి! మౌన ఋషి!! పదునాలుగు భాషలు తెలిసిన పాములపర్తి వేంకట నరసింహారావుకు మౌనంగా ఎలా పనిచేయాలో బాగా తెలుసు! ప్రచారానికీ, వివాదాలకూ బహుదూరంగా ఉండే నరసింహారావు దేశానికి అణుశక్తి సామర్థ్యాన్ని కల్పించారా? – అని చాలామందికి అనిపించవచ్చు. ఈ రహస్యం తనతోనే ఉండిపోవాలని కూడా ఆయన భావించారు. అయితే పి.వి.నరసింహారావు గారు కాలం చేశాక ఆయన మిత్రుడూ, ఆయన తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గౌ. అటల్ బీహారీ వాజ్ పేయి ఈ విషయాన్నిబయట పెట్టారు. అలా చెప్పడం, తన చారిత్రక బాధ్యత అని కూడా ప్రకటించారు!
భారతదేశపు అణుశక్తి సామర్థ్యపు సముపార్జన గురించి పరిణామక్రమాన్ని ఒకసారి చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1944 నుంచీ భారతీయ శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా అణుశక్తి వైపు దృష్టి పెట్టమని రాజకీయ పక్షాలను కోరుతూ ఉండేవారు. 1945 జూన్ 1వ తేదీన బెంగుళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆవరణలో మొదలైంది. సర్ దొరాబ్జీ టాటా ట్రస్టును హెచ్.జె.భాభా కోరగా వారి ఆర్థిక సాయంతో ఈ సంస్థ మొదలైంది. తర్వాత ఇప్పుడు భాభా అటామిక్ రీసర్చి సెంటర్ గా పిలువబడేే ‘బార్క్’ ముంబాయిలో మొదలైంది. తొలుత 1950ల కాలానికి ప్లూటోనియం బాంబు, ఇతర బాంబులకు కావాల్సిన పరికరాలు సిద్ధమయ్యాయి. 1962లో భారత్ – చైనా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణ తలెత్తింది. చైనా 1964లో న్యూక్లియర్ పరీక్షలు చేసింది. అయినా భారతదేశంలో ఈ దిశగా కృషి జరుగలేదు. దానికి కారణం అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి శాంతి కాముకత్వం!
అయితే 1966లో భారతప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ పదవీబాధ్యతలు తీసుకొన్న తర్వాత అణుశక్తి కార్యక్రమాలు మళ్ళీ మొదలయ్యాయి. శాస్త్రవేత్త రాజారామన్న నేతృత్వంలో శాస్త్ర సాంకేతిక సామర్థ్యం సిద్ధం కావడానికి ప్రయత్నాలు పుంజుకున్నాయి. మళ్ళీ చైనా మరో అణుపరీక్ష జరపడంతో భారత్ పరిస్థితిని పునస్సమీక్షించుకుంది. దానికి ఫలితమే 1974 మే 18న పోఖ్రాన్ లో జరిగిన అణుపరీక్షలు. ఈ పరీక్షలు ‘స్మైలింగ్ బుద్ధ’ లేదా పోఖ్రాన్-I గా పిలువబడ్డాయి! చైనా, పాకిస్తాన్ ల సరిహద్దులలో ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలు ఒకవైపు ఉండగా; మరోవైపు అణుబాంబు తయారీకి సంబంధించి మనకు కొరవడిన వనరులు, పరిజ్ఞానం! ఈ రెండింటి మధ్య ఇంకోవైపు అగ్రరాజ్యాల వత్తిళ్ళ మధ్య మన సామర్థ్యం దేశరక్షణకు, ప్రజాశాంతికి రూపుదిద్దుకుంటుంది.
ప్రపంచ శాంతికోసం వాదించిన ప్రధాని మొరార్జీ దేశాయి సమయంలో మళ్ళీ మనదేశ అణుశక్తి పరీక్షలు నెమ్మదించాయి. అయితే పాకిస్తాన్ పట్టు వదలకుండా తన అణు ప్రయత్నాలు కొనసాగించింది. కనుక మన దేశానికి కూడా అణుశక్తి సామర్థ్యం కోసం ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ మొదలు కాక తప్పలేదు. అలాగే శాస్త్రవేత్త ఎపిజె అబ్దుల్ కలాం మిస్సైల్ పరిశోధనా కార్యక్రమం కూడా ప్రారంభమైంది. దేశ ప్రధాని కాకముందు పీ.వీ. నరసింహారావు దేశరక్షణశాఖ, దేశవ్యవహారాల శాఖతోపాటు హోం మంత్రిగా కూడా పనిచేశారు. శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గార్లకు తలలోని నాలుకలా ఉండేవారు. కనుక వారి వ్యూహాలు కూడా పీవీకి బాగా తెలుసు. మరోవైపు అణుశక్తి పరంగా ప్రపంచపటం కూడా మారిపోయింది.
దేశవాళీ సామర్థ్యంలో పోఖ్రాన్-II పరీక్షలు 1995లో జరిగివుండాల్సిందని అంటారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించడం, అప్పటి అమెరికా ప్రధాని బిల్ క్లింటన్ మన దేశం మీద వత్తిడి పెంచడం అప్పటి విశేషాలు. అప్పటికే ఆనాటి పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో కాశ్మీర విషయమై ఐక్యరాజ్య సమితిలో అభియోగం చేసి ఉన్నారు. 1996లో, లోక్ సభ ఎన్నికలు జరిగాయి. అయితే సరియైన మెజారిటీ రాని కారణంగా మళ్ళీ 1998లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1998 మార్చి 19న అటల్ బిహారి వాజ్ పేయి ప్రధానమంత్రిగా మళ్ళీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1998 మే 11న పోఖ్రాన్ -IIg అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. నిజానికి నరసింహారావుగారి సమయంలోనే అంతా సిద్ధమైందనీ, తన హయాంలో కేవలం అణుపరీక్షలు నిర్వహించబడ్డాయని అటల్ బిహారీ వాజ్ పేయ్ గ్వాలియర్ లో ప్రకటిస్తూ – ఆ అణు పరీక్షలకు అసలు కారకులు పి.వి.నరసింహారావు అని వివరించారు.
అదీ పీ.వీ. నరసింహారావు నిశ్శబ్దంగా సాధించిన ఘనత. అందుకే పీ.వీ. దేశభక్తితో అలరారే రాజనీతిజ్ఞుడని మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం శ్లాఘించారు.