Devotional

బోనం అంటే ఏంటి? ఈ ఉత్స‌వాలు ఎప్పుడు మొద‌ల‌య్యాయి?

బోనం అంటే ఏంటి? ఈ ఉత్స‌వాలు ఎప్పుడు మొద‌ల‌య్యాయి?

ఆషాఢ మాసం వ‌చ్చేసింది ! బోనాల పండుగ‌ను తెచ్చేసింది !! ప్ర‌తి ఏటా నిర్వ‌హించే ఈ ఉత్స‌వాల‌కు భాగ్య‌న‌గ‌రం ముస్తాబైంది. రేపు గోల్కొండ జ‌గ‌దాంబికా అమ్మ‌వారికి తొలి బోనం స‌మ‌ర్పించ‌డంతో.. ఈ ఉత్స‌వ‌రం న‌గ‌ర‌మంత‌టా మొద‌ల‌వుతుంది. గోల్కొండ బోనాలు ముగిసిన త‌ర్వాత వారం ల‌ష్క‌ర్‌లో ఆ త‌ర్వాత లాల్ ద‌ర్వాజా, ధూళ్‌పేట‌, బ‌ల్కంపేట‌, పాతబ‌స్తీ అమ్మ‌వారి ఆల‌యాల్లో నెలంతా ఈ బోనాల పండుగ జ‌రుపుకోనున్నారు. న‌గ‌రాల్లో త‌ర్వాత జిల్లాల్లోనూ ఈ బోనాల పండుగ‌ను జ‌రుపుకుంటారు. రేప‌ట్నుంచి బోనాల పండుగ‌ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో అస‌లు బోనాల పండుగ‌ ఎప్పుడు మొద‌లైంది? వాటి చరిత్ర ఏంటి? విశిష్ఠ‌త ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కుటుంబ బాంధ్య‌వాల‌తో పెన‌వేసుకుపోయిన బంధం బోనం. స్త్రీ శ‌క్తికి ప్ర‌తిరూపం. సంప్ర‌దాయానికి చిహ్నం. అందుకే ఈ బోనాన్ని మ‌హిళ‌లే త‌యారు చేస్తారు. గ్రామ దేవ‌త‌ల‌కు ప‌సుపు కుంకుమ‌లు, చీర‌సారెలు, భోజ‌న నైవేద్యాల‌తో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్ల‌మ్మ‌, మైస‌మ్మ‌, పోచ‌మ్మ‌, ముత్యాల‌మ్మ‌, పెద్ద‌మ్మ‌.. ఇలా శ‌క్తి స్వ‌రూప‌మైన అమ్మ‌వార్ల వ‌ద్ద త‌మ‌ను చ‌ల్ల‌గా చూడ‌మ‌ని వేడుకుంటారు. త‌మ కుటుంబానికి, గ్రామానికి ఏ ఆప‌ద రాకుండా ర‌క్షించ‌మ‌ని ప్రార్థిస్తారు. తెలంగాణలో కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాయ‌లసీమ‌, క‌ర్ణాట‌క‌ల్లోనూ బోనాలు క‌నిపిస్తుంటాయి.

బోనం అంటే ఏంటి?
భోజ‌నం ప్ర‌కృతి అయితే.. దాని వికృతి ప‌ద‌మే బోనం. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మ‌వారి కోసం మ‌ట్టి లేక రాగికుండలో వండుతారు. ఆ త‌ర్వాత‌ బోనాల కుండ‌ల‌ను వేప రెమ్మ‌ల‌తో, ప‌సుపు, కుంకుమ‌తో అలంక‌రించి దానిపై ఒక దీపం ఉంచుతుంటారు. ఇలా త‌యారు చేసిన బోనాల‌ను త‌ల‌పై పెట్టుకుని డ‌ప్పు చ‌ప్పుళ్లతో మ‌హిళ‌లు ఆల‌యానికి తీసుకెళ్తారు. ఈ బోనాల కుండ‌ల‌ను ఇలా బోనం నైవేద్యంగా స‌మ‌ర్పించే తంతును ఊర‌డి అంటారు. గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ, ఊర పండుగ వంటి పేర్ల‌తో పిలుస్తారు. బోనాల జాతర‌ కేవ‌లం అమ్మ‌వారికి నైవేద్యం స‌మ‌ర్పించ‌డంతోనే ముగిసిపోదు. గ్రామీణ సంబురాల‌కు సంబంధించిన ప్ర‌తి ఘ‌ట్ట‌మూ ఇందులో క‌నిపిస్తుంది. తొట్టెల పేరుతో అమ్మ‌వారికి క‌ర్ర‌లు, కాగితాల‌తో చేసిన అలంకారాలు స‌మ‌ర్పించ‌డం, రంగం పేరిట భ‌విష్య‌వాణి చెప్పే ఆచార‌మూ ఈ బోనాల పండుగ‌లో ఉంటుంది. అమ్మ‌వారిని ఘ‌టం రూపంలో స్థాపించ‌డం, ఆ ఘ‌ట్టాన్ని నిమ‌జ్జ‌నం చేయ‌డ‌మూ మ‌నం చూడ‌వ‌చ్చు. మొత్తం మీద జాన‌ప‌ద క‌ళ‌లు, డ‌ప్పుల చ‌ప్పుళ్లు, శివ‌స‌త్తుల విన్యాసాల‌తో పండుగ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది.
bonalu-2
బోనాలు ఎప్పుడు మొద‌ల‌య్యాయి
అజ్ఞాత యుగం నుంచే ఈ బోనాల సంప్ర‌దాయం ఉంది. కొండ కోన‌ల్లో మ‌నిషి జీవించిన కాలంలో ఒక రాయిని దేవ‌త‌గా చేసుకుని ప్ర‌కృతి త‌న‌కు ఇచ్చిన ప‌త్రి, పువ్వు, కొమ్మ‌, ప‌సుపు కుంకుమ‌, నీళ్లు, ధాన్యం, కూర‌గాయ‌ల‌ను స‌మ‌ర్పించాడు. అప్పుడు ప్రారంభ‌మైన ఈ స‌మ‌ర్ప‌ణ‌మే బోనాల వ‌ర‌కు వ‌చ్చింది. పూర్వ కాలం నుంచే ఉన్న ఈ బోనాల‌కు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చ‌రిత్ర ఉంది. ఆరు వంద‌ల ఏళ్ల నాటి ప‌ల్ల‌వ రాజుల కాలంలో తెలుగు నేల‌పై బోనాల పండుగ ప్రాశ‌స్త్యం పొందింద‌ని ప్ర‌తీతి. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవ‌రాలు ఏడు కోల్ల ఎల్ల‌మ్మ న‌వదత్తి ఆల‌యాన్ని నిర్మించి, బోనాలు స‌మ‌ర్పించార‌ట‌. 1676లో క‌రీంన‌గ‌ర్ హుస్నాబాద్‌లో ఎల్ల‌మ్మ‌గుడిని స‌ర్వాయి పాప‌న్న క‌ట్టించి, ఆ దేవ‌త‌కు బోనాలు స‌మ‌ర్పించిన‌ట్టు కైఫీయ‌తుల్లో గౌడ‌నాడులు గ్రంథంలో ఉంది. ఇక హైద‌రాబాద్ చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే.. 1869లో జంట‌న‌గ‌రాల్లో ప్లేగు వ్యాధి మ‌హ‌మ్మారిలా వ‌చ్చి ప్ర‌బ‌లడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దైవాగ్ర‌హానికి గుర‌య్యామ‌ని భావించిన అప్ప‌టి ప్ర‌జ‌లు.. గ్రామ దేవ‌త‌ల‌ను శాంత‌ప‌రచ‌డానికి, ప్లేగు వ్యాధి నుంచి త‌మ‌ను తాము కాపాడుకోవ‌డానికి చేప‌ట్టిన క్ర‌తువే ఈ బోనాలు. 1675లో గోల్కొండ‌ను పాలించిన ల‌బుల్ హాస‌న్ కుతుబ్ షా ( తానీషా ) కాలంలో బోనం పండుగ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన‌ట్టు కూడా చ‌రిత్ర‌కారులు చెబుతుంటారు.

సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా..
రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించి వ‌ర్షా కాలం మొద‌ల‌వ్వ‌గానే మ‌లేరియా, టైఫాయిడ్ వంటి విష‌జ్వ‌రాల‌తో పాటు ఇత‌ర సీజ‌న‌ల్ అంటువ్యాధులు ప్ర‌బ‌లుతుంటాయి. ఈ సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌కు బోనాల పండుగ‌కు సంబంధం ఉంది. వేపాకు క్రిమినాశినిగా ప‌నిచేస్తుంది. అందుకే రోగ నిరోధ‌క‌త కోస‌మే ఇంటికి వేప తోర‌ణాలు క‌డ‌తారు. బోనం కుండ‌కు వేపాకులు క‌ట్ట‌డ‌మే కాకుండా.. బోనం ఎత్తుకున్న మ‌హిళలు వేపాకులు ప‌ట్టుకుంటారు. ప‌సుపు నీళ్లు చ‌ల్ల‌డం కూడా అందుకే మొద‌లైంద‌ని అంటారు.