Devotional

విశ్వ సౌభ్రాతృత్వ యాత్ర

విశ్వ సౌభ్రాతృత్వ యాత్ర

సకల మత ధర్మాలూ దేవాది దేవుని గురించి ప్రస్తావిస్తాయి. ఆ దేవాది దేవుడు ఒక్కడే కనుక… ఆయనను చేరే మార్గం కూడా ఒక్కటే ఉంటుంది. అదే భగవత్ర్పేమ. భగవంతుడి పట్ల ప్రేమను పెంపొందించుకోవాలని సకల మతాలూ భక్తులను ప్రోత్సహిస్తాయి. తమ అనుయాయులలో అలాంటి ప్రేమ నింపగల ఏ మతమైనా ధర్మబద్ధమైన మతమే. సర్వోన్నతుడైన భగవంతుడు లేదా దేవాదిదేవుళ్ళు ఎందరో ఉండరు. ఎందుకంటే ‘సర్వోన్నత’ అనే పదం ఒకరిని మాత్రమే సూచిస్తుంది. ఏ మతమైనా… తాము ఆరాధించే దేవదేవుడు, ఇతర మతాలు ఆరాధించే దేవదేవుడు వేర్వేరు అనుకుంటే అది పొరపాటు.

భగవంతుడు ఒక్కడే కనుక… భగవత్ర్పేమ కూడా ఒక్కటే… ఆ భగవంతుణ్ణి చేరే మార్గం కూడా ఒక్కటే. భక్తే ఆ పరమోన్నత మార్గమని సకల మతాలు బోధిస్తాయి. బాహ్యంగా… మతపరమైన ఆచారాలు భిన్నంగా కనిపించవచ్చు. కానీ వాటన్నిటి లక్ష్యం భగవంతుణ్ణి ప్రేమించడమే కాబట్టి… వాస్తవానికి అన్ని మతాలూ ఒక్కటే. భగవంతుణ్ణి, భగవద్ధామాన్ని చేరడం అనే అంతిమ గమ్యం విషయంలో… వాటి మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవు.

ధర్మసూత్రాలు సాక్షాత్తూ భగవంతుడి నుంచి… ఆయన దూతలు, ప్రతినిధులు, ఆచార్యుల ద్వారా వెలువడ్డాయని ప్రపంచవ్యాప్త హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులు వివరించారు. వాటిని భగవంతుడి నుంచి లేదా ఆయన ప్రామాణికమైన ప్రతినిధుల నుంచి స్వీకరించాలి. లోకంలోని వివిధ మత ధర్మాలకు కారణాలను శ్రీల ప్రభుపాదులు వివరిస్తూ… దేశ, కాల పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి ధర్మ సూత్రాలు వెల్లడి అవుతాయని చెప్పారు. కాలానుగుణంగా కొన్ని పరిస్థితులు మారినప్పుడు… కొన్ని ఆచారాలు, పద్ధతులు, ఆచరణాత్మకంగా కనిపించకపోవచ్చు. ఈ నేపథ్యంలో… సకల కాలాల్లో, సకల పరిస్థితుల్లో ప్రజలందరికీ ఆచరణీయమైన సనాతన ధర్మం గురించి శ్రీల ప్రభుపాదులు ప్రస్తావించారు. ‘భక్తి’ అనే పదానికి ‘భక్తియుత సేవ’ అనే నిర్వచనాన్ని ఆయన ఇచ్చారు. భక్తి అంటే సెంటిమెంట్‌ కాదనీ, సర్వశక్తిమంతుడైన భగవంతుడికి ప్రత్యక్షంగా ఆచరించే సేవ అనీ పేర్కొన్నారు. ఈ భక్తియుత సేవలను ప్రజలందరూ ఆచరించడం కోసం… నవవిధ భక్తిమార్గాలు ఉన్నాయి. వాటిలో మొదటిది శ్రవణం… అంటే భగవంతుడి గుణగణ వైభవాన్ని వినడం. రెండోది కీర్తనం… భగవంతుణ్ణి కీర్తించడం. మూడోది ఆయనను ఎల్లప్పుడూ స్మరించడం. నాలుగోది ప్రార్థించడం. అయిదోది విగ్రహ రూపంలో భగవంతుణ్ణి ఆరాధించడం. ఆరోది భగవంతుడి పాద పద్మాలను సేవించడం. ఏడోది భగవంతుడికి సేవకుడిగా వ్యవహరిస్తూ… అన్ని రకాల సేవలనూ చేయడం. ఎనిమిదోది భగవంతుణ్ణి స్నేహితుడిగా భావించడం. చివరిది భగవంతుడికి సమస్తం అర్పించి… శరణాగతి చేయడం. సనాతన ధర్మంలో ఈ తొమ్మిదీ కనిపిస్తాయి.

శ్రీల ప్రభుపాద… హరేకృష్ణ ఉద్యమాన్ని స్థాపించి, ప్రపంచవ్యాప్తం చేశారు. భగవంతుడి పవిత్ర నామాలను జపం ద్వారా సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేశారు. భగవంతుడి నామాలు అసంఖ్యాకం. ‘కృష్ణ’ అనేది సర్వోన్నతుడైన భగవంతుణ్ణి సూచించే ప్రాథమికమైన, అత్యంత ఆకర్షణీయమైన నామం. ‘దేవుడు’ లేదా ‘భగవంతుడు’ అనేవి అదే దేవాదిదేవుణ్ణి సూచించే అన్యనామాలు. మత, వర్ణ, లింగ బేధాలు కానీ, శారీరక లేదా భౌతిక ప్రాతిపదికన వివక్షలు కానీ లేకుండా… అందరికీ భగవత్ర్పేమను హరే కృష్ణ ఉద్యమం బోధిస్తుంది. ప్రపంచం నలుమూలల్లో లక్షలాది ప్రజలు మంత్ర జపాన్ని అభ్యసిస్తూ, శ్రీకృష్ణుడి పట్ల ఆకర్షణను పెంచుకుంటూ, తమ జీవితాలను పరిపూర్ణం చేసుకుంటున్నారు. ఈ ఉద్యమంలో భాగంగా, జగన్నాథ రథయాత్రను ప్రపంచవ్యాప్తంగా శ్రీల ప్రభుపాదులు ప్రవేశపెట్టారు. జగన్నాథుడు భారతదేశం వెలుపలకు వెళ్ళడం ప్రపంచ చరిత్రలో అదే తొలిసారి. నేడు జగన్నాథ రథయాత్రను ప్రపంచమంతటా జరుపుకొంటున్నారు. జగన్నాథ, బలదేవ, సుభద్రా మూర్తులను వేర్వేరు రథాల్లో లేదా ఒకే రథంపై అధిరోహింపజేసి… రథాలకు కట్టిన తాళ్ళను భక్తులు లాగుతూ రథయాత్రను నిర్వహిస్తారు.

1972 జూలై 16న లండన్‌లో నిర్వహించిన రథయాత్ర సందర్భంగా… శ్రీల ప్రభుపాద-
‘రథే చ వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’ అనే శ్లోకాన్ని ప్రస్తావించారు. ‘రథంపై ఆసీనుడైన భగవంతుడి దర్శన మాత్రాన.. జనన, మరణాల పునరావృత్తం నుండి బయటపడగలం’ అని అర్థం. భగవంతుడు సమస్త విశ్వానికి తండ్రి, సర్వశక్తిమంతుడు. ఆయనను సేవించడానికి ఎవ్వరూ అనర్హులు కారు. ఎవరైనా ఇంటినుంచి బయటకు వచ్చి, రథాన్ని కొంచెం ముందుకు లాగితే… అటువంటి భక్తుడి సేవను భగవంతుడు తప్పనిసరిగా గమనిస్తాడు. జగములనేలే జగన్నాథుడి సేవ… విశ్వసౌభ్రాతృత్వానికి నావ.

‘జగత్తు’ అంటే ‘కదులుతున్నది’ అని అర్థం. అది ఈ విశ్వాన్ని సూచిస్తుంది. అందుకే… ‘జగన్నాథుడు’ అంటే ఈ విశ్వానికి ప్రభువు. వివిధ కారణాల వల్ల ఆలయానికి రాలేక… భగవంతుడి కృపకు పాత్రులు కాలేకపోతున్నామనుకొనే ప్రజలను కరుణించడం కోసం… భగవంతుడే ఏడాదికి ఒకసారి ఆలయం నుంచి బయటకు వస్తాడు. అలా రథంపై జగన్నాథుడు బయటకు వచ్చినప్పుడు… స్వామివారికి ఏదో విధంగా చేసే గొప్ప అవకాశం ప్రతి ఒక్కరికీ లభిస్తుంది.